నేత కార్మికుల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం

నేత కార్మికుల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.

Published : 04 Jul 2024 03:24 IST

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టీకరణ

ఈనాడు, హైదరాబాద్‌: నేత కార్మికుల సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు. ప్రస్తుత సమస్యలను పరిష్కరిస్తూనే.. కార్మికులకు దీర్ఘకాలిక లబ్ధి చేకూర్చే విధంగా, నిరంతరం ఉపాధి దొరికేటట్లు శాశ్వత పరిష్కార దిశగా చర్యలు తీసుకున్నామని మంత్రి చెప్పారు. గత ప్రభుత్వం చేనేత కార్మికుల్ని పట్టించుకోలేదని విమర్శించారు. సచివాలయంలో పద్మశాలి, చేనేత సహకార సంఘాల నాయకులు బుధవారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో సమావేశమయ్యారు. ఇందులో చేనేత, జౌళి శాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్‌ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ సమస్యలను సంఘాల నేతలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. ‘‘కాంగ్రెస్‌ సర్కారు అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రభుత్వ శాఖలు తప్పనిసరిగా టెస్కో ద్వారా వస్త్రాలను కొనుగోలు చేయాలని ఆదేశాలిచ్చాం. ఇప్పటికే వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా రూ.250 కోట్ల విలువైన ఆర్డర్లు టెస్కోకు వచ్చాయి. తద్వారా నేత కార్మికులకు చేతి నిండా పని లభిస్తుంది. పని చేస్తున్న ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తాం. వీటి ద్వారా ఉత్పత్తి అయ్యే వివిధ రకాల వస్త్రాలకు మార్కెట్‌లో డిమాండ్‌ కల్పించే విధంగా కార్యాచరణ మొదలుపెట్టాం. నేత రంగానికి సంబంధించిన పాత బకాయిలన్నింటినీ పూర్తిగా చెల్లించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటాం. దురదృష్టవశాత్తు కొందరు నేతన్నలు, రైతన్నలు మరణిస్తే.. కొన్ని రాజకీయ పార్టీలు అనవసర రాద్ధాంతాలు చేస్తున్నాయి. దయచేసి ఇటువంటి సంఘటనలను రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం ఇకనైనా ఆపాలి’’ అని తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని