రోడ్డు భద్రతకు ‘ట్రాఫిక్‌ వాలంటీర్లు’!

రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న వాహనాలు.. నిబంధనలపై వాహనదారుల అవగాహనలేమి, నిర్లక్ష్యం కారణంగా ట్రాఫిక్‌ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రమాదాలూ పెరుగుతున్నాయి.

Published : 05 Jul 2024 03:17 IST

3 లక్షల మంది కళాశాలల విద్యార్థుల సేవ
ప్రతి నెలా ఒక గంటపాటు విధులు
విద్యా, పోలీసు శాఖలతో రవాణాశాఖ ప్రణాళిక

ట్రాఫిక్‌ నియంత్రణలో కళాశాలల విద్యార్థులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో భారీగా పెరుగుతున్న వాహనాలు.. నిబంధనలపై వాహనదారుల అవగాహనలేమి, నిర్లక్ష్యం కారణంగా ట్రాఫిక్‌ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రమాదాలూ పెరుగుతున్నాయి. వీటిని పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళిక సిద్ధమవుతోంది. విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించడంతోపాటు ట్రాఫిక్‌ సమస్యల పరిష్కారంలో వారి సేవలు ఉపయోగించుకునేలా రవాణా, విద్యా, పోలీసు శాఖలు కార్యాచరణ రూపొందించాయి. రాష్ట్రవ్యాప్తంగా కళాశాల విద్యార్థులను ఆగస్టు ఒకటికల్లా ఇందులో భాగస్వాములను చేయబోతున్నారు. 

300.. 30 వేలు..3 లక్షలు..

జాతీయ సేవా పథకం(ఎన్‌ఎస్‌ఎస్‌) విద్యార్థుల్లో 300 మందికి ట్రాఫిక్‌ నిబంధనలు, రహదారి భద్రతపై పోలీసులతో శిక్షణ అందించారు. ప్రాథమిక శిక్షకులు అయిన వీరు ఒక్కొక్కరు మరో 100 మందికి శిక్షణ ఇస్తారు. అలా 30 వేల మంది సిద్ధం అవుతారు. వారంతా పది మందికి చొప్పున శిక్షణ ఇస్తే.. మొత్తం 3 లక్షల మంది తయారవుతారు. వీరంతా కళాశాలల విద్యార్థులు. వీరికి ట్రాఫిక్‌ వార్డెన్లు, వాలంటీర్లు, స్టూడెంట్‌ పోలీస్‌ క్యాడెట్లు.. ఈ మూడు పేర్లను పరిశీలిస్తున్నారు. ట్రాఫిక్‌ వాలంటీర్ల పేరు వైపు అధికారులు మొగ్గు చూపిస్తున్నారు.

ఉల్లంఘనల నియంత్రణకు

రోడ్లపై అతివేగంతో ప్రయాణం.. ఒకే బైక్‌పై ముగ్గురు.. ఫ్రీలెఫ్ట్‌ను వదిలేయకపోవడం..గట్టిగా హార్న్‌ కొట్టడం వంటి ట్రాఫిక్‌ నిబంధనల ఉల్లంఘనలు రోజూ భారీ సంఖ్యలో జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల్లో ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన కల్పించాలని, సమాజానికి ఉపయోగపడేలా రహదారి భద్రతలో భాగస్వాములను చేయాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశానికి ఇటీవల సూచించారు. దీంతో ఈ మేరకు కార్యాచరణ సిద్ధమవుతోంది. రహదారి భద్రత, ట్రాఫిక్‌ నిబంధనలపై అవగాహన పొందిన విద్యార్థులకు నెలలో ఒక గంట విధులు కేటాయిస్తారు. కళాశాల దగ్గర ప్రాంతంలో ఈ విధులు నిర్వహించాల్సి ఉంటుంది. వీరు ట్రాఫిక్‌ సిబ్బందికి సహకారంగా ఉంటారు.


విద్యార్థి దశ నుంచే రహదారి భద్రతపై అవగాహన

రహదారి భద్రతపై విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించాలన్నది మా లక్ష్యం. కళాశాలల విద్యార్థుల సేవలను ట్రాఫిక్‌ కూడళ్లలో ఉపయోగించుకుంటాం. వాహనాల రద్దీ ఎక్కువ ఉండే ఉదయం, సాయంత్రం వేళల్లో వీరు భాగస్వాములు అవుతారు. జిల్లాలవారీగా డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు అధికారులు(డీటీసీ) సమన్వయం చేస్తారు.

పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ మంత్రి


తొలుత హైదరాబాద్‌లో.. తర్వాత రాష్ట్రమంతటా

పాఠశాలల విద్యార్థులను సమీపంలోని కూడలికి తీసుకెళ్లి.. ట్రాఫిక్‌ సమస్యలు, రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తాం. పాఠశాల మైదానంలోనూ తర్ఫీదు ఇస్తాం. ట్రాఫిక్‌ కట్టడి, రహదారి భద్రతలో కళాశాలల విద్యార్థుల సేవల్ని తొలుత హైదరాబాద్‌లో ఉపయోగించుకుంటాం. తర్వాత రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాం. ఈ విధానాన్ని 15, 20 రోజుల్లో అమల్లోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం.

బుర్రా వెంకటేశం, ముఖ్యకార్యదర్శి విద్యాశాఖ, ఎన్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ కోఆర్డినేటర్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని