టీచర్ల బదిలీలు, పదోన్నతుల్లో జోక్యం చేసుకోలేం

ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల వివాదాల్లో విద్యార్థుల ప్రయోజనాలే ముఖ్యమని హైకోర్టు గురువారం తేల్చి చెప్పింది. పదోన్నతులు, బదిలీలు విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ఉంటాయని, మధ్యలో చేపట్టినట్లయితే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంది.

Published : 05 Jul 2024 03:19 IST

విద్యార్థుల ప్రయోజనాలే ముఖ్యం: హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల వివాదాల్లో విద్యార్థుల ప్రయోజనాలే ముఖ్యమని హైకోర్టు గురువారం తేల్చి చెప్పింది. పదోన్నతులు, బదిలీలు విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ఉంటాయని, మధ్యలో చేపట్టినట్లయితే విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం విద్యాసంవత్సరం ప్రారంభంలో ఉన్నందున బదిలీలు, పదోన్నతుల్లో జోక్యం చేసుకోలేమని చెప్పింది. బదిలీల్లో భాగంగా ఇతర జిల్లాల నుంచి ఎస్జీటీ, స్కూల్‌ అసిస్టెంట్‌ ఉపాధ్యాయులను రంగారెడ్డికి బదిలీ చేయడం రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధమని, ఈ జిల్లాలో పనిచేసే తాము నష్టపోతున్నామంటూ రంగారెడ్డికి చెందిన సుమారు 40 మందికిపైగా ఉపాధ్యాయులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారించిన సింగిల్‌ జడ్జి మొదట బదిలీలు, పదోన్నతులను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం ఈ నెల 25న మధ్యంతర ఉత్తర్వులను సవరిస్తూ పదోన్నతులు, బదిలీలు కొనసాగించవచ్చని, అయితే 40 పోస్టులను పిటిషనర్ల నిమిత్తం రిజర్వు చేయాలని ఆదేశించారు. దీన్ని సవాలు చేస్తూ రంగారెడ్డికి చెందిన ఉపాధ్యాయులు అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్‌ అభినంద్‌కుమార్‌ షావిలి, జస్టిస్‌ అలిశెట్టి లక్ష్మీనారాయణలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు డి.బాలకిషన్‌రావు, పి.వి.కృష్ణయ్య, ప్రతివాదుల తరఫున న్యాయవాది ఎం.రాంగోపాల్‌రావు, ప్రభుత్వ న్యాయవాదులు వాదనలు వినిపించారు. వాదనలను విన్న ధర్మాసనం బదిలీలు, పదోన్నతుల ప్రక్రియ వల్ల ఎలాంటి నష్టం వాటిల్లదని, సింగిల్‌ జడ్జి ఉత్తర్వులను సమర్థిస్తూ అప్పీళ్లను కొట్టివేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని