సంక్షిప్త వార్తలు

మరో నాలుగు మార్కెట్‌ కమిటీలకు పాలకవర్గాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

Updated : 06 Jul 2024 03:27 IST

మరో నాలుగు మార్కెట్లకు కమిటీల నియామకం

ఈనాడు, హైదరాబాద్‌: మరో నాలుగు మార్కెట్‌ కమిటీలకు పాలకవర్గాలను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వనపర్తి టౌన్, వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు, బషీరాబాద్, జగిత్యాల జిల్లా ధర్మపురి మార్కెట్‌ యార్డులకు కమిటీలను నియమించినట్లు వ్యవసాయమంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మొత్తం 197 మార్కెట్‌ కమిటీల్లో ఇప్పటికి 15 కమిటీలకు  పాలకవర్గాలను నియమించామన్నారు.


9, 16 తేదీల్లో శ్రీవారి బ్రేక్‌ దర్శనాలు రద్దు

తిరుమల, న్యూస్‌టుడే: శ్రీవారి ఆలయంలో ఈ నెల 16న సాలకట్ల ఆణివార ఆస్థానం పర్వదినాన్ని పురస్కరించుకుని 9న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో 9, 16 తేదీల్లో శ్రీవారి బ్రేక్‌ దర్శనాలను తితిదే రద్దు చేసింది. ఈ కారణంగా 8, 15 తేదీల్లో సిఫార్సు లేఖలు స్వీకరించరు.


నేడు, రేపు ఓ మోస్తరు వర్షాలు 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో శని, ఆదివారాల్లో అక్కడక్కడ ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆది, సోమ, మంగళవారాల్లో కొన్ని జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా వనపర్తి జిల్లా పెబ్బేరులో 6.7 సెం.మీటర్ల, నారాయణపేట జిల్లా ధన్వాడలో 4.1, ములుగు జిల్లా వాజేడులో 3.3 సెం.మీటర్ల వర్షపాతం నమోదయింది. నిజామాబాద్, జోగులాంబ గద్వాల, హైదరాబాద్, మహబూబ్‌నగర్, రంగారెడ్డి, రాజన్న సిరిసిల్ల, ఖమ్మం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. 


ఎస్‌పీడీసీఎల్‌లోనూ క్యూఆర్‌ కోడ్‌తో చెల్లింపులు
వచ్చే నెల నుంచి అందుబాటులోకి  

ఈనాడు, హైదరాబాద్‌: దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ(టీజీఎస్‌పీడీసీఎల్‌) జారీ చేసే కరెంటు బిల్లులపై వచ్చే నెల నుంచి క్యూఆర్‌ కోడ్‌ను ముద్రించనున్నారు. వినియోగదారులు సెల్‌ఫోన్‌తో ఈ కోడ్‌ను స్కాన్‌ చేసి తమ బిల్లులు చెల్లించవచ్చు. ప్రస్తుతం సంస్థ వెబ్‌సైట్‌ లేదా మొబైల్‌ యాప్‌లోకి వెళ్లి బిల్లులు కట్టాలని సంస్థ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. వినియోగదారులకు మరింత సౌకర్యవంతమైన చర్యల్లో భాగంగా క్యూఆర్‌ కోడ్‌ సదుపాయాన్ని తీసుకొస్తున్నట్లు పేర్కొంది. ఇప్పటికే ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ పరిధిలోని కొన్నిచోట్ల పైలెట్‌ ప్రాజెక్టుగా క్యూఆర్‌ కోడ్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు.


7న డీఎస్‌ శ్రద్ధాంజలి సభ
సీఎంకు కార్డు అందజేసిన ఎంపీ అర్వింద్‌

డీఎస్‌ శ్రద్ధాంజలి సభకు రావాలని సీఎంకు కార్డు ఇస్తున్నఎంపీ అర్వింద్‌ 

హైదరాబాద్, న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ శుక్రవారం ఉదయం కలిశారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసానికి వెళ్లిన అర్వింద్‌..ఈ నెల 7న గచ్చిబౌలిలోని ఓ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఉదయం 11.30 గంటలకు జరగనున్న తన తండ్రి, సీనియర్‌ నేత ధర్మపురి శ్రీనివాస్‌(డీఎస్‌) శ్రద్ధాంజలి సభకు హాజరుకావాలని కోరుతూ కార్డును అందజేశారు.


పంచాయతీలకు నిధులు విడుదల చేయాలి
సీఎం రేవంత్‌కు హరీశ్‌రావు బహిరంగ లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: నిధులు లేక గ్రామ పంచాయతీలు తీవ్ర అవస్థల పాలయ్యాయని, ప్రభుత్వం వెంటనే నిధులు విడుదల చేయాలని భారాస సీనియర్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు కోరారు. ఈ మేరకు శుక్రవారం సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన బహిరంగ లేఖ రాశారు. ‘‘ఏడు నెలలుగా కాంగ్రెస్‌ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గ్రామాల్లో, పట్టణాల్లో పారిశుద్ధ్యం కుంటుపడింది. గ్రామ పంచాయతీలకు పైసా కూడా విడుదల చేయకుండా నిర్వహణను గాలికి వదిలి వేయడంతో కునారిల్లుతున్నాయి. చివరకు ట్రాక్టర్లకు డీజిల్‌ డబ్బులు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. పంచాయతీ ఉద్యోగులు, కార్మికులకు జీతాలు అందక అల్లాడుతున్నారు. గ్రామాల్లో చెత్తసేకరణ నిలిచి విషజ్వరాలు ప్రబలుతున్నాయి. పాడైపోతున్న పంచాయతీ వ్యవస్థను గాడిన పెట్టేందుకు కృషి చేయాలి’’ అని హరీశ్‌రావు కోరారు.


కృష్ణ జింకల పునరావాస కేంద్రానికి రూ.2.50 కోట్లు 

ఈనాడు, హైదరాబాద్‌ : నారాయణపేట జిల్లా కృష్ణా మండలంలో కృష్ణ జింకల సంరక్షణ, పునరావాస కేంద్రం ఏర్పాటుకానుంది. ఇందుకు అవసరమైన రూ.2.50 కోట్ల నిధులకు పరిపాలనపరమైన అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ మేరకు అటవీ, పర్యావరణ శాఖ ముఖ్యకార్యదర్శి అహ్మద్‌ నదీం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.


సిమెంట్‌ ప్యాకింగ్‌ బస్తాలకు బీఐఎస్‌ ధ్రువీకరణ తప్పనిసరి

ఈనాడు, హైదరాబాద్‌: సిమెంటును 50 కిలోల బస్తాల్లో మరింత నాణ్యతతో ప్యాకింగ్‌ చేసేందుకు హెచ్‌డీపీఈ, పాలిప్రొపిలీన్‌ బస్తాలకు బీఐఎస్‌ సర్టిఫికేషన్‌ తప్పనిసరి అని బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండర్డ్స్‌(బీఐఎస్‌) హైదరాబాద్‌ విభాగాధిపతి పీవీ శ్రీకాంత్‌ తెలిపారు. శుక్రవారం తెలంగాణ, ఏపీలకు చెందిన బస్తాల తయారీదారులు, సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ(సిపెట్‌) హైదరాబాద్‌తో కలిసి బీఐఎస్‌ హైదరాబాద్‌ విభాగం అవగాహన కార్యక్రమం నిర్వహించింది. బీఐఎస్‌ సర్టిఫికేషన్‌ ఎలా పొందాలి? నాణ్యత ప్రమాణాలు, బీఐఎస్‌ ప్రమాణాల చట్టాలను శాస్త్రవేత్తలు వివరించారు. బస్తాల నాణ్యత పరీక్షలు, సిపెట్‌లోని మౌలిక సదుపాయాలపై చీఫ్‌ మేనేజర్‌ డాక్టర్‌ వి.కిరణ్‌కుమార్‌ విశదీకరించారు. బీఐఎస్‌ జేడీ సవిత, ఏపీ వూవెన్‌సాక్స్‌ తయారీదారుల సంఘం ప్రధాన కార్యదర్శి నరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.


కౌలు రైతులకు గుర్తింపు కార్డులివ్వాలి
రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీ కన్వీనర్‌ విస్సా కిరణ్‌ కుమార్‌

బాగ్‌లింగంపల్లి, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని కౌలు రైతులందరికీ సత్వరమే గుర్తింపుకార్డులను పంపిణీచేయడంతో పాటు రైతుభరోసా తదితర పథకాలను వర్తింపజేయాలని రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీ కన్వీనర్‌ విస్సా కిరణ్కుమార్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య కళానిలయంలో రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో కౌలు రైతులను గుర్తించాలని కోరుతూ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 22 లక్షల మంది కౌలు రైతులున్నారని తెలిపారు. భూ అధీకృత సాగుదారులచట్టం-2011ను పక్కాగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డికి వినతిపత్రాన్ని అందజేశామన్నారు. కాంగ్రెస్‌ కిసాన్‌సెల్‌ అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి, రైతు సంఘం ప్రతినిధి నల్లమల వెంకటేశ్వరరావు, పీవోడబ్ల్యూ జాతీయ కన్వీనర్‌ వి.సంధ్య, రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కన్వీనర్‌ కన్నెగంటి రవి, రైతాంగ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్క వెంకటయ్య, కౌలు రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యురాలు చైతన్య, రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీ సభ్యుడు కొండల్‌రెడ్డి, వివిధ రైతు సంఘాల సభ్యులు పాల్గొన్నారు.


‘సీఎం విదేశీ విద్య’కు దరఖాస్తుల ఆహ్వానం

ఈనాడు, హైదరాబాద్‌: ముస్లిం మైనార్టీ విద్యార్థులు సీఎం విదేశీ విద్యానిధి పథకం కింద విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు స్ప్రింగ్‌ సీజన్‌కు ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నెల 8 నుంచి ఆగస్టు 7 వరకు అర్హులైన విద్యార్థులు ఈపాస్‌ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని మైనార్టీ సంక్షేమశాఖ కమిషనర్‌ తఫ్సీర్‌ ఇక్బాల్‌ తెలిపారు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, కెనడా, సింగపూర్, జర్మనీ, దక్షిణ కొరియా, జపాన్, ఫ్రాన్స్, న్యూజిలాండ్‌ దేశాల్లో పీజీ, పీహెచ్‌డీలు చేసేందుకు అర్హులని వివరించారు.


ఆహ్లాద వారధి

చుట్టూ పచ్చని చెట్లు.. చెంతనే జలాలతో కనువిందు చేస్తున్న ఈ ప్రాంతం హైదరాబాద్‌ నగర శివారు హిమాయత్‌సాగర్‌ సమీపంలో శంషాబాద్‌ కొత్వాల్‌గూడలో నిర్మిస్తున్న ఎకో పార్కు. రాష్ట్ర ప్రభుత్వం రూ.75 కోట్లతో 85 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ పార్కులో 1.5 కి.మీ. పొడవు ఉన్న ‘బోర్డు వాక్‌’ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో కొండల మధ్య వారధిపై నుంచి నడుస్తూ హిమాయత్‌సాగర్‌ అందాలను తిలకించేలా హెచ్‌ఎండీఏ దీన్ని చేపట్టింది. మరికొన్ని నెలల్లో ఈ ఎకో పార్కు పర్యాటక ప్రియులకు అందుబాటులోకి రానుంది.                      

ఈనాడు, హైదరాబాద్‌


‘ప్రజావాణి’కి 594 దరఖాస్తులు

సోమాజిగూడ, న్యూస్‌టుడే: మహాత్మా జ్యోతిబా ఫులే ప్రజాభవన్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 594 దరఖాస్తులు అందాయి. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డా.చిన్నారెడ్డి, ప్రత్యేక అధికారి దివ్య పాల్గొని దరఖాస్తులను స్వీకరించారు. రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 141,  పౌరసరఫరాల శాఖ 86, విద్యుత్తు శాఖ 58, హౌసింగ్‌ 56, పంచాయతీరాజ్‌ గ్రామీణ అభివృద్ధి శాఖకు సంబంధించి 54, ఇతర శాఖలకు సంబంధించి 199 వినతులు అందినట్లు అధికారులు తెలిపారు. గోదావరిఖని పట్టణంలోని లక్ష్మీనగర్‌ ప్రాంతంలో రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లు కూల్చే కుట్రలు చేస్తున్నారని బాధిత నివాసులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దివ్యాంగుల పెన్షన్‌ రూ.3016 నుంచి రూ.6016 లకు పెంచాలని కోరుతూ అఖిల భారత వికలాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు.


డెంగీ, మలేరియా నివారణకు చర్యలు

ఈనాడు, హైదరాబాద్‌ : డెంగీ కేసులపై అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్‌ చోంగ్తూ అధికారులను ఆదేశించారు. డెంగీ, మలేరియా సహా సీజనల్‌ వ్యాధులపై చోంగ్తూ శుక్రవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు గత ఏడాదికంటే డెంగీ కేసులు తక్కువగా నమోదైనా ఆ వ్యాధి ప్రబలకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. శాఖాధిపతులు, జిల్లాల అదనపు కలెక్టర్లు, వైద్యాధికారులు, పంచాయతీరాజ్‌శాఖ అధికారులు సమావేశాలు నిర్వహించి కార్యాచరణను సిద్ధం చేసుకోవాలని పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో ప్రత్యేక పడకలు ఏర్పాటు చేయాలని, ఐవీ ప్లూయిడ్‌లు, అత్యవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. సమావేశంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ ఆర్‌.వి.కర్ణన్, ఆయుష్‌ డైరెక్టర్‌ ఎం.ప్రశాంతిదేవి, వైద్యవిద్య డైరెక్టర్‌ ఎన్‌.వాణి, ప్రజారోగ్యశాఖ డైరెక్టర్‌ బి.రవీందర్‌ నాయక్, ఐపీఎం డైరెక్టర్‌ శివలీల పాల్గొన్నారు.


10 నుంచి వ్యవసాయ డిప్లొమా కోర్సులకు కౌన్సెలింగ్‌ 

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని పాలిటెక్నిక్‌లు, వర్సిటీ గుర్తింపు పొందిన ప్రైవేట్‌ పాలిటెక్నిక్‌లలో రెండేళ్ల వ్యవసాయ, సేంద్రియ వ్యవసాయ డిప్లొమా కోర్సులు, మూడేళ్ల డిప్లొమా ఇన్‌ అగ్రికల్చర్‌ ఇంజినీరింగ్‌ కోర్సులలో ప్రవేశాలకు ఈనెల 10 నుంచి 12 వరకు రాజేంద్రనగర్‌లోని విశ్వవిద్యాలయ ఆడిటోరియంలో కౌన్సెలింగ్‌ జరగనుంది. పాలిసెట్‌-2024 ర్యాంకులు పొందిన అభ్యర్థులను మెరిట్, రిజర్వేషన్‌ నిబంధనల ప్రకారం ప్రవేశాలు కల్పిస్తామని రిజిస్ట్రార్‌ పి.రఘురామిరెడ్డి తెలిపారు. అభ్యర్థులు షెడ్యూల్‌ మేరకు వారి ర్యాంకుల వారీగా కౌన్సిలింగ్‌కు హాజరుకావాలని సూచించారు. దీనికి సంబంధించి షెడ్యూల్, అభ్యర్థులు తేవాల్సిన ధ్రువీకరణపత్రాలు, రుసుం తదితర వివరాలు వర్సిటీ వెబ్‌సైట్‌ www.pjtsau.edu.inలో అందుబాటులో ఉంటాయని తెలిపారు.


పెండింగ్‌ డీఏలు వెంటనే మంజూరు చేయాలి
టీజీవో అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఎన్నికల సందర్భంగా బదిలీ అయిన అధికారులను వెనక్కు తీసుకురావాలని తెలంగాణ గెజిటెడ్‌ అధికారుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్‌లోని ఐదు డీఏలను వెంటనే మంజూరు చేయాలని డిమాండ్‌ చేసింది. శాఖాపరమైన పదోన్నతులు వెంటనే కల్పించాలని విజ్ఞప్తి చేసింది. నాంపల్లి గృహకల్పలోని టీజీవో భవన్‌లో అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ ఆధ్వర్యంలో సంఘం కేంద్ర కార్యవర్గ అత్యవసర సమావేశం జరిగింది. ప్రభుత్వం, ఉద్యోగుల సమాన నిష్పత్తి చందాతో ఉద్యోగుల ఆరోగ్య పథకం(ఈహెచ్‌ఎస్‌) అమలు చేయాలని అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు కోరారు. సంఘం ప్రతినిధులు శ్యామ, జగన్మోహన్‌రావు, ఉపేందర్‌రెడ్డి, పరమేశ్వర్‌రెడ్డి, జి.దీపారెడ్డి, రామకృష్ణగౌడ్, యాదగిరితోపాటు కేంద్ర కార్యవర్గం సభ్యులు, 33 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు, సచివాలయ, హైదరాబాద్‌ సిటీ అధ్యక్ష కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.


నేటి నుంచి మలిదశ  కాళేశ్వరం న్యాయ విచారణ
నగరానికి చేరుకున్న జస్టిస్‌ పీసీ ఘోష్‌

ఈనాడు, హైదరాబాద్‌: కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మూడు బ్యారేజీలపై న్యాయ విచారణ మలిదశ ప్రక్రియ శనివారం నుంచి ప్రారంభం కానుంది. కమిషన్‌ ఛైర్మెన్‌ జస్టిస్‌ పీసీ ఘోష్‌ శుక్రవారం సాయంత్ర కోల్‌కతా నుంచి హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా నీటిపారుదల శాఖ అధికారులు ఆయనను కలిశారు. ఇప్పటికే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను క్షేత్రస్థాయిలో జస్టిస్‌ పీసీ ఘోష్‌ సందర్శించారు. కమిషన్‌కు సహాయకారిగా ఉండేందుకు సాంకేతిక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అలాగే సీల్డ్‌ కవర్లలో కమిషన్‌కు అందిన అఫిడవిట్లపై విచారణ నిర్వహించనున్నారు.


జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సాయం
మీడియా అకాడమీ ఛైర్మన్‌ శ్రీనివాసరెడ్డి 

ఈనాడు, హైదరాబాద్‌: ఇటీవల 34 మంది జర్నలిస్టులు మృతిచెందగా, వారి కుటుంబాలకురూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం, ఐదేళ్ల పాటు ప్రతి కుటుంబానికి నెలకు రూ.3వేల చొప్పున పెన్షన్, ఎల్‌కేజీ నుంచి పదో తరగతి వరకు చదివే ఇద్దరు పిల్లలకు నెలకు రూ.2,000 చొప్పున ట్యూషన్‌ ఫీజు అందజేసినట్లు మీడియా అకాడమీ ఛైర్మన్‌ కె.శ్రీనివాసరెడ్డి తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమ నిధి నుంచి ఈ నిధులను మంజూరు చేసినట్లు శుక్రవారం జరిగిన సమావేశంలో వెల్లడించారు. ఇతర ప్రాణాంతక వ్యాధులతో, భృతి కోల్పోయి ఇబ్బంది పడుతున్న ముగ్గురు జర్నలిస్టులకు రూ.లక్ష చొప్పున, మరో ఇద్దరికి రూ.50వేల చొప్పున ఆర్థిక సాయం అందించినట్లు శ్రీనివాసరెడ్డి తెలిపారు. సమావేశంలో సమాచార పౌర సంబంధాల జాయింట్‌ డైరెక్టర్‌ జగన్, మీడియా అకాడమీ కార్యదర్శి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని