సామాన్యులపై ఆర్థికభారం మోపుతారా!

స్థలాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఏ ఒకరిద్దరిదో లోపం కాదని, రెవెన్యూ వ్యవస్థలోనే లోపం ఉందని శుక్రవారం హైకోర్టు వ్యాఖ్యానించింది.

Published : 06 Jul 2024 03:09 IST

రిజిస్ట్రేషన్‌ ఛార్జీలతోపాటు కోర్టు ఖర్చులు అదనమా?
రెవెన్యూ వ్యవస్థలోనే లోపం
వందల కొద్దీ పిటిషన్లతో న్యాయస్థానాలపై భారం
కౌంటర్‌ దాఖలు చేయండి.. ఉత్తర్వులు జారీచేస్తాం
పెద్దఅంబర్‌పేట సబ్‌రిజిస్ట్రార్‌కు హైకోర్టు ఆదేశం

ఈనాడు, హైదరాబాద్‌: స్థలాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి ఏ ఒకరిద్దరిదో లోపం కాదని, రెవెన్యూ వ్యవస్థలోనే లోపం ఉందని శుక్రవారం హైకోర్టు వ్యాఖ్యానించింది. జీవితకాలం కష్టార్జితంతో 100, 200 గజాల విస్తీర్ణంలో స్థలాన్ని కొనుగోలు చేయడానికి వెళితే రిజిస్ట్రేషన్, స్టాంపు డ్యూటీ, జీఎస్టీలతోపాటు కోర్టు ఖర్చులు, న్యాయవాదుల ఫీజులు అదనపు భారమవుతున్నాయని వ్యాఖ్యానించింది. కోర్టు ఉత్తర్వులను సబ్‌రిజిస్ట్రార్లు అర్థం చేసుకోకుండా ముగిసిన వివాదాలపైనా తాజా కోర్టు ఉత్తర్వులు తీసుకురావాలంటూ పట్టుబడుతుండటంతో అటు సామాన్యులపై ఆర్థిక భారంతోపాటు కోర్టుల్లో వందల కొద్దీ పిటిషన్లు దాఖలై పెండింగ్‌ భారం పడుతోందని పేర్కొంది. పూర్తి వివరాలు సమర్పించినప్పటికీ రిజిస్ట్రేషన్‌ చేయకపోగా స్పష్టమైన సమాధానాలు చెప్పని పెద్ద అంబర్‌పేట సబ్‌రిజిస్ట్రార్‌పై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎలాంటి నిషేధ ఉత్తర్వులు లేకపోయినా పెద్ద అంబర్‌పేట సర్వే నం.265లో ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ను తిరస్కరించడంపై రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన అనంత రామేశ్వరిదేవి దాఖలు చేసిన 23 పిటిషన్లపై శుక్రవారం జస్టిస్‌ ఎన్‌.వి.శ్రవణ్‌కుమార్‌ మరోసారి విచారణ చేపట్టారు. రిజిస్ట్రేషన్లను తిరస్కరించడానికి తగిన కారణాలు చెప్పాలని కోర్టుకు వ్యక్తిగతంగా హాజరైన పెద్దఅంబర్‌పేట సబ్‌ రిజిస్ట్రార్‌ను నిలదీశారు. 2024 మేలో వారసత్వ వివాదానికి సంబంధించి ఆర్డీవో, ఇబ్రహీంపట్నం ఇనాం ట్రైబ్యునల్‌ ఉత్తర్వులు జారీచేశాక రిజిస్ట్రేషన్లను ఎందుకు తిరస్కరించారని ప్రశ్నించారు. కోర్టు ఉత్తర్వులను అర్థం చేసుకోకుండా పదేపదే రిజిస్ట్రేషన్లను తిరస్కరించడంతోపాటు తాజాగా కోర్టు ఉత్తర్వులు తీసుకురావాలంటుండటం చూస్తే సబ్‌రిజిస్ట్రార్‌ విధులను ఎలా నిర్వహిస్తున్నారో తెలుస్తోందని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ న్యాయవాదులైనా సబ్‌రిజిస్ట్రార్‌కు సలహా ఇవ్వరా అని ప్రశ్నించారు. రిజిస్ట్రేషన్‌ ఎందుకు తిరస్కరించాల్సి వచ్చిందో రాతపూర్వకంగా కౌంటర్‌ దాఖలు చేయాలని సబ్‌రిజిస్ట్రార్‌కు ఆదేశాలు జారీచేశారు. ఈ దశలో పిటిషనర్‌ తరఫు న్యాయవాది మద్ది రాజేష్‌ వాదనలు వినిపిస్తూ రికార్డులన్నింటినీ సమర్పించినా, తాజాగా ఇచ్చిన కోర్టు ఉత్తర్వులు ఇచ్చినా రిజిస్ట్రేషన్‌ను నిరాకరించారన్నారు. రిజిస్ట్రేషన్‌ చేసేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ తాను కేవలం ఈ 23 పిటిషన్ల గురించి మాత్రమే ఆలోచించడం లేదని, ఇదే కారణంపై ప్రజలు తిరిగి కోర్టుకు రాకూడదనే చూస్తున్నానన్నారు. సబ్‌రిజిస్ట్రార్లు కోర్టు ఉత్తర్వులు అర్థం చేసుకోవడం లేదని, ఈ కేసులో కౌంటర్‌ దాఖలు చేసిన తర్వాత రాష్ట్రానికి వర్తించేలా తగిన ఆదేశాలు జారీ చేస్తామంటూ విచారణను 9వ తేదీకి వాయిదా వేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని