మున్నేరు వరద నీరు.. పాలేరుకు!

పాలేరు జలాశయం నాగార్జునసాగర్‌పై ఆధారపడిన ప్రాజెక్టు. కృష్ణమ్మ బిరబిరమంటూ ప్రవహిస్తేనే పాలేరుకు జల కళ. గతేడాది పరిస్థితులే ఎదురైతే ఆయకట్టు భూములన్నీ బీడుగా దర్శనమిచ్చే పరిస్థితి.

Updated : 06 Jul 2024 03:45 IST

తక్కువ వ్యయంతో లింక్‌ కెనాల్‌కు మళ్లింపు ప్రతిపాదనలు

కూసుమంచి, న్యూస్‌టుడే: పాలేరు జలాశయం నాగార్జునసాగర్‌పై ఆధారపడిన ప్రాజెక్టు. కృష్ణమ్మ బిరబిరమంటూ ప్రవహిస్తేనే పాలేరుకు జల కళ. గతేడాది పరిస్థితులే ఎదురైతే ఆయకట్టు భూములన్నీ బీడుగా దర్శనమిచ్చే పరిస్థితి. ఈ నేపథ్యంలో గోదావరి జలాలను పాలేరుకు మళ్లించడం ద్వారా ఖమ్మం జిల్లాలో లక్షల ఎకరాల సాగర్‌ ఆయకట్టు స్థిరీకరణ, కొత్త సాగు విస్తీర్ణం కోసం భద్రాద్రి జిల్లాలో సీతారామ పథకాన్ని చేపట్టారు. అయితే ఇందులో భాగంగా ప్రారంభమైన పాలేరు లింక్‌ కెనాల్‌ నిర్మాణ పనుల పూర్తికి మరో మూడేళ్ల కాలం పట్టే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో మున్నేరు వరద నీటిని ప్రస్తుతం తవ్వకం పనులు సాగుతున్న సీతారామ పథకం పాలేరు లింక్‌కెనాల్‌కు అనుసంధానించడం ద్వారా ఏటా సుమారు 30 టీఎంసీల నీటిని పాలేరు జలాశయానికి మళ్లించవచ్చనే ఆలోచనతో పుట్టిందే కొత్త పథకం. మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలంలో మున్నేరు ప్రవహించే మద్దివంచ ప్రాంతం నుంచి ఈ లింక్‌ కెనాల్‌ సుమారు 9.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మద్దివంచ ప్రాంతంలో మున్నేరుపై ఉన్న చెక్‌డ్యాంకు, లింక్‌ కెనాల్‌ సుమారు 4 మీటర్ల దిగువన ఉంటుంది. దీంతో మద్దివంచ చెక్‌డ్యాం ప్రాంతం నుంచి పాలేరు లింక్‌ కెనాల్‌ను అనుసంధానిస్తూ.. వరద కాలువ తవ్వకం చేపడితే గ్రావెటీ ద్వారా నీరు ఆ లింక్‌ కెనాల్‌లో ప్రవహించే అవకాశం ఉంది.

ఏడాదిన్నరలో పాలేరుకు నీరు!

మున్నేరు నుంచి తవ్వేందుకు ఉద్దేశించిన ఈ వరద కాలువ, లింక్‌ కెనాల్‌ను కలిపే ప్రాంతం నుంచి పాలేరు జలాశయం 28 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ నిడివిలో లింక్‌ కెనాల్‌ తవ్వకం ఇప్పటికే సుమారు 6 కిలోమీటర్లు పూర్తయింది. తిరుమలాయపాలెం, కూసుమంచి మండలాల్లో 8 కిలోమీటర్ల టన్నెల్‌ తవ్వకం పనుల్లో సుమారు 500 మీటర్లు పూర్తయింది. లింక్‌ కెనాల్‌ పనులతోపాటు, వరద కాలువ తవ్వకానికి కనీసం 15 నుంచి 18 నెలల సమయం అవసరం అవుతుందని ఇంజినీర్లు భావిస్తున్నారు. సీతారామ పథకం ద్వారా వచ్చే నీటికంటే కనీసం ఏడాదిన్నర ముందుగా మున్నేరు నీటిని పాలేరుకు తరలించే అవకాశం ఉందని ఇంజినీరింగ్‌ అధికారులు పేర్కొంటున్నారు.

మంత్రి పొంగులేటి దృష్టి

ఖమ్మం జిల్లా జలవనరుల శాఖ డీఈఈ రమేశ్‌రెడ్డి, ఇతర ఇంజినీరింగ్‌ అధికారులు వరద కాలువ పథకానికి ఆలోచన చేశారు. సాధ్యాసాధ్యాలను అంచనా వేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రాథమిక సర్వేను పూర్తి చేయించి, సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేయించాలనే యోచనలో ఉన్నారు. రూ.110 కోట్లతో వరద కాలువ పూర్తవుతుందని అంచనా.


త్వరలోనే ప్రభుత్వానికి నివేదిస్తాం

మున్నేరు నుంచి ఏటా దిగువకు సుమారు 30 నుంచి 40 టీఎంసీల నీరు వృథాగా పోతోంది. గ్రావెటీ ద్వారా సద్వినియోగం చేసుకుంటూ పాలేరు జలాశయానికి తరలించే ప్రాజెక్టు నిర్మాణానికి రూపకల్పన చేశాం. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆలోచనల మేరకు తక్కువ ఖర్చుతోనే ఎంతో ప్రయోజనం చేకూర్చే పథకమిది. ప్రతిపాదనలు త్వరలోనే ప్రభుత్వానికి నివేదిస్తాం. 

నర్సింగరావు, ఎస్‌ఈ


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు