శాస్త్రీయ పద్ధతిలోనే భూముల ధరల సవరణ

భూముల బహిరంగ మార్కెట్‌ ధరలకు, ప్రభుత్వ మార్కెట్‌ విలువకు భారీగా వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో ఎలాంటి విమర్శలకు తావు లేకుండా శాస్త్రీయ పద్ధతిలో ధరల సవరణ చేపట్టాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు.

Published : 06 Jul 2024 03:14 IST

సామాన్యులపై భారం పడకుండా చర్యలు
సమీక్షలో రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, చిత్రంలో రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిత్తల్, రిజిస్ట్రేషన్ల శాఖ కార్యదర్శి జ్యోతిబుద్ధప్రకాశ్‌ 

ఈనాడు, హైదరాబాద్‌: భూముల బహిరంగ మార్కెట్‌ ధరలకు, ప్రభుత్వ మార్కెట్‌ విలువకు భారీగా వ్యత్యాసం ఉన్న నేపథ్యంలో ఎలాంటి విమర్శలకు తావు లేకుండా శాస్త్రీయ పద్ధతిలో ధరల సవరణ చేపట్టాలని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖను రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిత్తల్, రిజిస్ట్రేషన్లశాఖ కార్యదర్శి, ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ జ్యోతిబుద్ధప్రకాశ్‌తో కలిసి ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు సవరణ ప్రక్రియ, శాఖకు సంబంధించిన వివరాలపై ప్రజంటేషన్‌ ఇచ్చారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ‘హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలో భూముల ధరలు గణనీయంగా పెరిగాయి. అందుకనుగుణంగానే ధరలను సవరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మధ్య తరగతి ప్రజలపై ఎలాంటి భారం పడకుండా చూడాలి. హేతుబద్ధంగా ఎంత శాతం పెంచడానికి అవకాశం ఉందనే దానిపై లోతైన అధ్యయనం చేయాలి. కొన్ని ప్రాంతాల్లో మార్కెట్‌ విలువ కన్నా ప్రభుత్వ ధర అధికంగా ఉంది. అలాంటి చోట్ల తగ్గించాలి. గత ప్రభుత్వంలో ఎలాంటి కసరత్తు చేయకుండానే పెంచారు. మళ్లీ అలాంటి పరిస్థితి పునరావృతం కావద్దు. రిజిస్ట్రేషన్లశాఖను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయడంపై కార్యాచరణ రూపొందించాలి. చట్టంలో ఉన్న లొసుగులకు ముగింపు పలికేలా చర్యలు తీసుకోవాలి. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చేవారు గంటల తరబడి వేచి చూడకుండా అత్యాధునిక వసతులతో సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు నిర్మిస్తాం. ఇందుకు అవసరమైన భూములు గుర్తించాలి. పనితీరు ఆధారంగా పారదర్శకంగా ఉద్యోగుల బదిలీలు చేపడతాం’ అని పేర్కొన్నారు. సమీక్షలో అదనపు ఐజీ వెంకట రాజేశం, ఉన్నతాధికారులు మధుసూదన్, సంతోష్, స్థితప్రజ్ఞ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని