ఆగస్టు 11న నీట్‌-పీజీ పరీక్ష

నీట్‌-పీజీ ప్రవేశ పరీక్షను ఆగస్టు 11న రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నట్లు నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎన్‌బీఈఎంఎస్‌) శుక్రవారం ప్రకటించింది.

Published : 06 Jul 2024 03:15 IST

నవంబరు తర్వాతే తరగతులు

ఈనాడు, హైదరాబాద్‌: నీట్‌-పీజీ ప్రవేశ పరీక్షను ఆగస్టు 11న రెండు షిఫ్టుల్లో నిర్వహించనున్నట్లు నేషనల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్స్‌ ఇన్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎన్‌బీఈఎంఎస్‌) శుక్రవారం ప్రకటించింది. గత నెల 23న ఈ పరీక్షను నిర్వహించాల్సి ఉండగా, నీట్‌-యూజీ పేపర్‌ లీక్‌ నేపథ్యంలో ఒక్క రోజు ముందు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మూడు సార్లు రీషెడ్యూల్‌ అయిన నీట్‌-పీజీ పరీక్ష కోసం విద్యార్థులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి ఎండీ, ఎంఎస్, మెడికల్‌ పీజీ డిప్లమా కోర్సుల్లో సీట్ల ఎంపిక కోసం ఆగస్టు 11న నీట్‌-పీజీ నిర్వహించనున్న నేపథ్యంలో.. ఈ ఏడాది పీజీ మెడికల్‌ కోర్సుల తరగతుల ప్రారంభంలో తీవ్ర జాప్యం చోటుచేసుకోనుంది. తాజా షెడ్యూలును బట్టి పీజీ తరగతుల ప్రారంభం నవంబరు లేదా అంతకంటే జాప్యం అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. సాధారణంగా పీజీ విద్యాసంవత్సరం ఏప్రిల్‌ నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. గత కొన్నేళ్లుగా పీజీ విద్యా సంవత్సరం అస్తవ్యస్తంగా మారింది. గతంలో కొవిడ్‌ నేపథ్యంలో ఏడాదిపాటు నీట్‌-పీజీ పరీక్ష నిర్వహణ ఆలస్యమైంది. ఆ తర్వాత కూడా ప్రవేశ పరీక్షను సకాలంలో నిర్వహించకపోగా తరగతుల ప్రారంభం నవంబరు, డిసెంబరుకు చేరింది. కనీసం ఈ ఏడాది నుంచి అయినా నీట్‌-పీజీలో సాధారణ పరిస్థితి నెలకొంటుందని అంతా భావించగా ఈసారి పరీక్ష నిర్వహణే గందరగోళంలో పడి తరగతుల ప్రారంభం యధావిధిగా నవంబరు తర్వాతకు మారనుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని