2030 నాటికి 2.4 కోట్లకు గిగ్‌ కార్మికులు

డిజిటల్‌ ఎకానమీలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని, దేశవ్యాప్తంగా కోటి మంది గిగ్‌ వర్కర్లు పనిచేస్తున్నారని, 2030 నాటికి వీరి సంఖ్య 2.4 కోట్లకు చేరే అవకాశాలు ఉన్నాయని కేంద్ర కార్మికశాఖ కార్యదర్శి సుమితాదావ్రా తెలిపారు.

Published : 06 Jul 2024 03:16 IST

కేంద్ర కార్మికశాఖ కార్యదర్శి సుమితాదావ్రా

ఈనాడు, హైదరాబాద్‌: డిజిటల్‌ ఎకానమీలో ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని, దేశవ్యాప్తంగా కోటి మంది గిగ్‌ వర్కర్లు పనిచేస్తున్నారని, 2030 నాటికి వీరి సంఖ్య 2.4 కోట్లకు చేరే అవకాశాలు ఉన్నాయని కేంద్ర కార్మికశాఖ కార్యదర్శి సుమితాదావ్రా తెలిపారు. కార్మికుల సంక్షేమం కోసం 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్‌కోడ్‌లుగా తీసుకువచ్చామని చెప్పారు. వీటి అమలుకు మరో 8 రాష్ట్రాలు ముసాయిదా నిబంధనలు జారీ చేయాల్సి ఉందన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఉపాధి, కార్మిక సంస్కరణలపై భారతీయ పరిశ్రమల సమాఖ్య(సీఐఐ), భారత యాజమాన్యాల సమాఖ్య(ఈఎఫ్‌ఐ) సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్మిక, ఉపాధి సంస్కరణలు, సరళీకృత పారిశ్రామిక విధానం, ఈఎస్‌ఐసీ, ఈపీఎఫ్‌వో సామాజిక భద్రత, బీమా, ప్రభుత్వ విధానాలు, నూతన ఆవిష్కరణలపై సదస్సులు జరిగాయి. సుమితాదావ్రా మాట్లాడుతూ.. హైదరాబాద్‌ ఇన్నొవేషన్, ఐటీ, ఫార్మా, టీహబ్, అంతర్జాతీయ పరిశ్రమలకు కేంద్రంగా మారిందని పేర్కొన్నారు. కార్మికులకు సామాజిక భద్రత, సంక్షేమం, సంస్కరణల కోసం కార్మిక సంఘాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ముందుకు వెళ్లాలన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ కార్మికశాఖ ముఖ్యకార్యదర్శి సంజయ్‌కుమార్, ఈపీఎఫ్‌వో సీబీటీ సభ్యులు సౌగటరాయ్‌ చౌధురి, మధు దామోదరన్, సుంకరి మల్లేశం, కేంద్ర ఈపీఎఫ్‌ అదనపు ప్రధాన కమిషనర్‌ ఎంఎస్‌కేవీవీ సత్యనారాయణ, తెలంగాణ అదనపు సీపీఎఫ్‌సీ ఆరిఫ్‌ లొహానీ, ప్రాంతీయ కమిషనర్లు డాక్టర్‌ శివ్‌కుమార్, అశ్వినీకుమార్‌ గుప్తా, విశాల్‌ అగర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని