మాది పరిశ్రమల ఫ్రెండ్లీ సర్కారు

ప్రపంచంలోనే రాష్ట్రాన్ని స్కిల్‌ క్యాపిటల్‌గా తీర్చిదిద్దాలని తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, అందులో భాగంగానే స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు.

Published : 06 Jul 2024 03:17 IST

ఎఫ్‌టీసీసీఐ ఎక్స్‌లెన్సీ పురస్కారాల ప్రదానోత్సవంలో మంత్రి శ్రీధర్‌బాబు

పురస్కార గ్రహీతలతో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎంపీ మల్లు రవి, చిత్రంలో వీణ, రవికుమార్, మీలా జయదేవ్, కరుణేంద్ర జాస్తి, సురేశ్‌కుమార్‌ సింఘాల్, రమాకాంత్‌ ఇనాని

రెడ్‌హిల్స్, న్యూస్‌టుడే: ప్రపంచంలోనే రాష్ట్రాన్ని స్కిల్‌ క్యాపిటల్‌గా తీర్చిదిద్దాలని తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, అందులో భాగంగానే స్కిల్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేయబోతున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌ రెడ్‌హిల్స్‌లో ‘ది ఫెడరేషన్‌ ఆఫ్‌ తెలంగాణ ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీ(ఎఫ్‌టీసీసీఐ) ఎక్స్‌లెన్సీ పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ప్రసంగించారు. ‘‘మాది పరిశ్రమల ఫ్రెండ్లీ ప్రభుత్వం. పారిశ్రామిక రంగంలోని సమస్యలను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంసిద్ధంగా ఉన్నారు. మూడు, నాలుగు వారాల్లో కొత్త, పటిష్ఠమైన పారిశ్రామిక విధానాన్ని తీసుకురాబోతున్నాం. ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించే సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల(ఎంఎస్‌ఎంఈ) సమస్యలపై కూడా దృష్టి సారించాం. చరిత్రలో మొదటిసారిగా ఎంఎస్‌ఎంఈల కోసం ప్రత్యేక విధానం తీసుకురానున్నాం. గత ప్రభుత్వం పరిశ్రమలకు ప్రకటించిన రూ.3,700 కోట్ల ప్రోత్సాహకాలు, రాయితీలను అందించలేదు. కాంగ్రెస్‌ ప్రభుత్వం దానిని పరిశీలిస్తోంది’’ అని శ్రీధర్‌బాబు వివరించారు. ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక రంగం గురించి తీసుకుంటున్న నిర్ణయాల కారణంగా తెలంగాణలో పెట్టుబడిదారులు పోటీపడుతున్నారన్నారు. కార్యక్రమంలో ఎఫ్‌టీసీసీఐ అధ్యక్షుడు మీలా జయదేవ్, అవార్డు కమిటీ ఛైర్‌ కరుణేంద్ర జాస్తి, కో-ఛైర్మన్‌ రమాకాంత్‌ ఇనాని, సీనియర్‌ ఉపాధ్యక్షుడు సురేశ్‌కుమార్‌ సింఘాల్, ఉపాధ్యక్షుడు ఆర్‌.రవికుమార్, కార్యదర్శి ఎం.వీణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరుస్తున్న 21 మందికి పురస్కారాలను ప్రదానం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని