మేడిగడ్డ ఇసుక తవ్వకాలకు గుత్తేదారుల పోటాపోటీ

మేడిగడ్డ బ్యారేజీ ఎగువ భాగంలో ఇసుక తవ్వితీసేందుకు గుత్తేదారులు పెద్దసంఖ్యలో బిడ్లు దాఖలు చేశారు. 14 బ్లాక్‌లకుగాను మొత్తం 383 బిడ్లు వచ్చాయి.

Published : 06 Jul 2024 03:17 IST

14 బ్లాక్‌లకు 383 బిడ్ల దాఖలు

ఈనాడు, హైదరాబాద్‌: మేడిగడ్డ బ్యారేజీ ఎగువ భాగంలో ఇసుక తవ్వితీసేందుకు గుత్తేదారులు పెద్దసంఖ్యలో బిడ్లు దాఖలు చేశారు. 14 బ్లాక్‌లకుగాను మొత్తం 383 బిడ్లు వచ్చాయి. అంటే ఒక్కో బ్లాక్‌కు సగటున 27 మంది పోటీ పడుతున్నారు. బిడ్ల పరిశీలనకు మైనింగ్, ఇరిగేషన్‌ శాఖల నుంచి ఒక్కొక్కరితోపాటు తెలంగాణ ఖనిజాభివృద్ధి సంస్థ నుంచి ముగ్గురు.. మొత్తం ఐదుగురు అధికారులతో కమిటీ వేశారు. సాంకేతిక అర్హతల పరిశీలన ప్రక్రియ దాదాపు పూర్తి కావొచ్చినట్లు సమాచారం. ఇందులో అర్హత సాధించిన గుత్తేదారుల బిడ్లను పరిశీలించి ఎంపిక చేయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ ఎగువ ప్రాంతంలో భారీ మొత్తంలో ఇసుక నిల్వలు ఉన్నాయి. ఈ బ్యారేజీ గతేడాది కుంగిన నేపథ్యంలో జలాశయంలోని నీటిని ఖాళీ చేయడంతో పెద్ద మొత్తంలో ఇసుక బయటపడింది. ఈ ఇసుక పూడికను తవ్వితీసి విక్రయించనున్నారు. ఇసుకను ఆయా బ్లాక్‌ల నుంచి తవ్వి తీసి నిల్వ కేంద్రాలకు ట్రాక్టర్లలో తరలించాల్సి ఉంటుంది. దాంతోపాటు నిల్వ కేంద్రాలకు వచ్చే లారీల్లో లోడ్‌ చేయాలి. ఈ పనులను ఎంపికయ్యే గుత్తేదారులే చేపట్టాలి. ఇందుకు ఒక్కో టన్నుకు రూ.97 చొప్పున చెల్లిస్తామని టీజీఎండీసీ టెండర్‌ పత్రాల్లో పేర్కొంది. పోటీ అధికంగా ఉండ[టంతో అంతకంటే తక్కువకు కోట్‌ చేసేవారికి బ్లాక్‌లవారీగా టెండర్లు దక్కే అవకాశం ఉంది. 

ఏడాదిన్నర, రెండేళ్లు..

మూడు బ్లాక్‌లలో తవ్వి తీసే ఇసుక పరిమాణం 10 లక్షల టన్నులపైనే ఉంది. ఆయాచోట్ల తవ్వకాలకు గుత్తేదారులకు రెండేళ్ల సమయం ఇచ్చారు. మిగిలిన 11 బ్లాక్‌లలో ఏడాదిన్నరలోగా తవ్వి తీయాలని టీజీఎండీసీ స్పష్టం చేసింది. 3రోజుల్లో ఆర్థిక బిడ్లను తెరవనున్నట్లు సమాచారం. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలం పరిధిలో ఈ ఇసుక బ్లాక్‌లు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని