తోపులాట.. వాగ్వాదం!

నిరుద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలంటూ శుక్రవారం వివిధ సంఘాలు పిలుపునిచ్చిన టీజీపీఎస్సీ ముట్టడి పోలీసు పహారాలో తోపులాటలు, వాగ్వాదాల మధ్య కొనసాగింది.

Published : 06 Jul 2024 03:18 IST

నిరుద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలంటూ టీజీపీఎస్సీ ముట్టడి
విడతలవారీగా వచ్చిన సంఘాల నేతలు, విద్యార్థుల్ని ఠాణాలకు తరలించిన పోలీసులు


బీఆర్‌ఎస్వీ నాయకులను అరెస్ట్‌ చేస్తున్న పోలీసులు

గన్‌ఫౌండ్రి, న్యూస్‌టుడే: నిరుద్యోగుల డిమాండ్లు నెరవేర్చాలంటూ శుక్రవారం వివిధ సంఘాలు పిలుపునిచ్చిన టీజీపీఎస్సీ ముట్టడి పోలీసు పహారాలో తోపులాటలు, వాగ్వాదాల మధ్య కొనసాగింది. టీజీపీఎస్సీ ముట్టడికి విడతలవారీగా విద్యార్థి, యువజన, నిరుద్యోగ సంఘాల నేతలు తరలివచ్చారు. వచ్చిన వారిని వచ్చినట్లు పోలీసులు అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌ నగరంలోని వివిధ ఠాణాలకు తరలించారు. బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు, విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు డి.రాజారాంయాదవ్, బీఆర్‌ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, నిరుద్యోగ ఐకాస నేత మోతీలాల్‌నాయక్, గిడ్డంగుల కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ రజని సాయిచంద్, శిరీష(బర్రెలక్క), ఆమ్‌ ఆద్మీ పార్టీ యువజన విభాగం నేతలు బుర్ర రాముగౌడ్, హేమ జిల్లోజు తదితరులు వేర్వేరుగా తమ కార్యకర్తలతో కలిసి తరలివచ్చారు. వారు టీజీపీఎస్సీ కార్యాలయం సమీపంలోకి వచ్చీ రావడంతోనే పోలీసులు అదుపులోకి తీసుకుని వాహనాల్లో ఠాణాలకు తరలించారు. భాజపా యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు చేవెళ్ల మహేందర్‌తోపాటు పలువురు కార్యకర్తలను ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయం వద్ద అడ్డుకున్నారు. ఆయా సంఘాల వారిని అడ్డుకునే క్రమంలో పోలీసులకు.. నిరసనకారులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకున్నాయి. 

తోపులాటలో గాయపడిన యువకుడు

పోరాటం కొనసాగిస్తాం..

నిరుద్యోగులను రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి వారిని నిండా ముంచారని డి.రాజారాంయాదవ్‌ మండిపడ్డారు. శాంతియుత నిరసన కార్యక్రమాలను నియంతృత్వ ధోరణిలో అణచివేసేందుకు ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. ప్రభుత్వం మాట నిలబెట్టుకునే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. సీఎంకు ఇతర పార్టీల నేతలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై ఉన్న శ్రద్ధ నిరుద్యోగుల సమస్యలపై లేదని గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ మండిపడ్డారు. 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలని, జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని మహేందర్‌ డిమాండ్‌ చేశారు.


నిరుద్యోగుల అరెస్టు గర్హనీయం
కేటీఆర్, హరీశ్‌రావు

ఈనాడు, హైదరాబాద్‌: ఉద్యోగాల సాధన కోసం డిమాండ్‌ చేస్తున్న నిరుద్యోగులు, విద్యార్థి సంఘాల నాయకులు, వందల మంది విద్యార్థులను అరెస్టు చేయడం గర్హనీయమని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి టి.హరీశ్‌రావు శుక్రవారం వేర్వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. ఉద్యోగాల భర్తీ, గ్రూప్స్‌ నోటిఫికేషన్లలోని సమస్యలు, జాబ్‌ క్యాలెండర్‌ వంటి అంశాలపై శాంతియుతంగా నిరసన తెలపాలనుకున్న వారిపై లాఠీఛార్జీ చేయడం దుర్మార్గమన్నారు. వెంటనే ప్రభుత్వం జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగులు చేపట్టే అన్ని నిరసన కార్యక్రమాలకు భారాస అండగా ఉంటుందని వారు భరోసా ఇచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు