కవిత జ్యుడిషియల్‌ కస్టడీ 18 వరకు పొడిగింపు

దిల్లీ మద్యం విధాన రూపకల్పనలో జరిగిన అవకతవకలపై సీబీఐ నమోదు చేసిన కేసులో భారాస ఎమ్మెల్సీ కవితకు విధించిన జ్యుడిషియల్‌ కస్టడీని ఇక్కడి రౌజ్‌ అవెన్యూ కోర్టు ఈ నెల 18వ తేదీ వరకు పొడిగించింది.

Published : 06 Jul 2024 03:18 IST

ఈనాడు, దిల్లీ: దిల్లీ మద్యం విధాన రూపకల్పనలో జరిగిన అవకతవకలపై సీబీఐ నమోదు చేసిన కేసులో భారాస ఎమ్మెల్సీ కవితకు విధించిన జ్యుడిషియల్‌ కస్టడీని ఇక్కడి రౌజ్‌ అవెన్యూ కోర్టు ఈ నెల 18వ తేదీ వరకు పొడిగించింది. ఈ మేరకు న్యాయమూర్తి కావేరి బవేజా ఉత్తర్వులు జారీచేశారు. కవిత కస్టడీ కాలపరిమితి శుక్రవారంతో ముగియడంతో తిహాడ్‌ జైలు నుంచి ఆమెను వీసీ ద్వారా న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు. కస్టడీ పొడిగించాలన్న సీబీఐ విజ్ఞప్తిని కవిత తరఫు న్యాయవాదులు వ్యతిరేకించారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, బెయిల్‌ ఇస్తే ఆమె సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ న్యాయవాదులు చేసిన వాదనలను దృష్టిలో ఉంచుకొని న్యాయమూర్తి ఆమె కస్టడీని పొడిగించారు. కవితకు వ్యతిరేకంగా సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకొనే అంశంపై కోర్టు శనివారం విచారించి నిర్ణయం వెలువరించనుంది.

కవితతో కేటీఆర్, హరీశ్‌రావు ములాఖత్‌

తిహాడ్‌ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితతో శుక్రవారం కేటీఆర్, హరీశ్‌రావు ములాఖత్‌ అయ్యారు. బెయిల్‌ పిటిషన్లను కొట్టేస్తూ దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో దాఖలు చేయనున్న పిటిషన్‌పై వారు ఆమెతో చర్చించారు. వేసవి సెలవుల అనంతరం సుప్రీంకోర్టు ఈ నెల 8న పునఃప్రారంభమవుతున్నందున ఆ రోజు పిటిషన్‌ దాఖలు చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. అప్పటివరకు వీరిద్దరూ దిల్లీలోనే ఉండి న్యాయవాదులతో సమన్వయం చేసుకోనున్నారు. న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని, త్వరలోనే బెయిల్‌ వస్తుందని వారిద్దరూ ఆమెకు భరోసా ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని