ఇందిరమ్మ ఇళ్ల అర్హుల గుర్తింపు ఎలా?

రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులను గుర్తించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏటా నాలుగున్నర లక్షల ఇళ్లను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా 82.82 లక్షల దరఖాస్తులు అందాయి.

Published : 06 Jul 2024 04:21 IST

అధికారుల కసరత్తు
ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో అధ్యయనానికి బృందం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అర్హులను గుర్తించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏటా నాలుగున్నర లక్షల ఇళ్లను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా 82.82 లక్షల దరఖాస్తులు అందాయి. వాటి నుంచి అర్హులను గుర్తించడం తలకుమించిన భారంగా మారింది. అర్హులకు మాత్రమే ఇళ్లను కేటాయించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులకు స్పష్టంచేశారు. ఇళ్ల నిర్మాణ ప్రగతి ఆధారంగా నిధులు విడుదల చేయాలన్నది ప్రభుత్వ నిర్ణయం. లబ్ధిదారులు ముందస్తుగా కొంత మొత్తాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. పేదరికంలో ఉన్న వారికే ఇళ్లు కేటాయించాలన్న నేపథ్యంలో వారి ఆర్థిక స్తోమతను గుర్తించడం పెద్ద సవాలేనని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి నియోజకవర్గానికి మూడున్నర వేల ఇళ్లను కేటాయించనున్నారు. దసరా పండగ నాటికి కొన్ని జిల్లాల్లోనైనా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి శంకుస్థాపన చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. అయితే మూడు నెలల వ్యవధిలో లబ్ధిదారుల ఎంపిక సాధ్యమవుతుందా? అని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కనీసం అయిదు నెలలుపడుతుందని అభిప్రాయపడుతున్నారు. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి మార్గదర్శకాలను కూడా ప్రభుత్వం ఖరారు చేయాల్సి ఉంది. ఈ పథక అమలుకు నిధులు పెద్ద మొత్తంలో అవసరమైనప్పటికీ బడ్జెట్‌లో సుమారు రూ.ఏడున్నర వేల కోట్ల వరకు కేటాయించింది. 

ఆ రెండు రాష్ట్రాల్లో అధ్యయనం...

పలు రాష్ట్రాల్లో పేదల ఇళ్ల నిర్మాణంలో అనుసరించిన తీరుతెన్నులను అధ్యయనం చేయాలని ఇటీవల జరిగిన సమావేశంలో మంత్రి శ్రీనివాసరెడ్డి సూచించారు. ఆ మేరకు అధికారులు ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలను ఎంపికచేశారు. ఆయా వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు బదిలీ కావటంతో ఆ ప్రక్రియ వేగం పుంజుకోలేదు. తాజాగా గృహ నిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శిగా వీపీ గౌతమ్‌ను ప్రభుత్వం నియమించింది. ఆ రెండు రాష్ట్రాల్లో అధ్యయనానికి అధికారుల బృందం వెళ్లేందుకు మార్గం సుగమమైంది. ఆయా రాష్ట్రాల్లో అనుసరించిన విధానాల్లో ఏవైనా అంశాలు ఉపయుక్తం అనుకున్న పక్షంలో ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో చర్చించిన మీదట వాటిని రాష్ట్రంలో అమలు చేయాలా? వద్దా? అన్నది నిర్ణయిస్తుందని ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’తో చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని