రెండేళ్ల తాత్కాలిక సంరక్షణ పూర్తయితే శాశ్వత దత్తత

రాష్ట్రంలో తల్లిదండ్రుల్లేని, సంరక్షణ కొరవడిన ఆరేళ్లకు పైబడిన చిన్నారులను దత్తతకు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సులభతరం చేసింది.

Published : 06 Jul 2024 04:22 IST

ఆదర్శ ఫాస్టర్‌ కేర్‌ నిబంధనలు -2024 రూపొందించిన కేంద్రం

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో తల్లిదండ్రుల్లేని, సంరక్షణ కొరవడిన ఆరేళ్లకు పైబడిన చిన్నారులను దత్తతకు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సులభతరం చేసింది. ఆరేళ్ల వయసులోపు దత్తతకు ఎంపికకాని చిన్నారులు సంరక్షణ కేంద్రాలకే పరిమితమవుతున్నారు. వారు సంరక్షణ కేంద్రాల నుంచి బయటకు వచ్చి కుటుంబ వాతావరణంలో పెరిగేందుకు వీలుగా నూతన మార్గదర్శకాలు అందుబాటులోకి వచ్చాయి. తాత్కాలిక సంరక్షణ గడువు రెండేళ్లు పూర్తిచేసుకున్న చిన్నారులను చట్టబద్ధంగా దత్తతకు అర్హులైన వారిగా ప్రకటించనుంది. రెండేళ్ల పాటు తాత్కాలిక సంరక్షణ కల్పించిన కుటుంబాలు, దంపతులు ముందుకు వస్తే వారికే పిల్లలను దత్తతకు ఇచ్చేలా ‘ఆదర్శ ఫాస్టర్‌కేర్‌ నిబంధనలు-2024’ రూపొందించింది. నూతన నిబంధనలపై ప్రజలకు విస్తృతమైన ప్రచారం కల్పించాలని కోరింది. ఈ మేరకు రాష్ట్రాల మహిళాశిశు సంక్షేమశాఖలు చర్యలు తీసుకోవాలని కేంద్ర మహిళాశిశు సంక్షేమ మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి త్రిపాటిగుర్హ లేఖరాశారు. ఆరేళ్లకు పైబడిన పిల్లల ఫాస్టర్‌కేర్‌ కోసం ముందుకు వచ్చే దంపతులు, కుటుంబాలు రిజిస్టర్‌ చేసుకునేందుకు రాష్ట్రాలు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలోని కమిటీ తాత్కాలిక సంరక్షణ, శాశ్వత సంరక్షణను పర్యవేక్షిస్తుందని వెల్లడించారు. 


ఇవీ నిబంధనలు...

  • ఫాస్టర్‌కేర్‌ కోసం ముందుకు వచ్చే దంపతులు, కుటుంబాలు శారీరకంగా, మానసికంగా, భావోద్వేగపరంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా అర్హులై ఉండాలి. ఆరేళ్ల నుంచి 12 ఏళ్లలోపు చిన్నారులను సంరక్షణలోకి తీసుకోవాలనుకున్న దంపతులిద్దరి వయసు కలిపితే 70 ఏళ్ల నుంచి 110 ఏళ్ల మధ్య ఉండాలి. సింగిల్‌ పేరెంట్‌ అయితే 35 ఏళ్ల నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి. 12 నుంచి 18 ఏళ్లలోపు చిన్నారులను దత్తత తీసుకోవాలనుకున్నా ఇవే వయో నిబంధనలు వర్తిస్తాయి. సింగిల్‌ పేరెంట్‌ పురుషుడు ఉంటే ఆడపిల్లను తాత్కాలిక సంరక్షణకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇవ్వరు.
  • తాత్కాలిక సంరక్షణకు ముందుకు వచ్చిన దంపతులు నిబంధనల ప్రకారం అన్ని వివరాలతో రిజిస్టరు చేసుకోవాలి. వారి వివరాలు బాలల సంరక్షణ కమిటీలు, జిల్లా బాలల సంరక్షణ యూనిట్లు పరిశీలించి సంరక్షణకు అనుమతిస్తారు. తాత్కాలిక సంరక్షణ సమయంలో పిల్లలపై వివక్ష చూపినా, సంరక్షణ సరిగా లేకున్నా ఆ సంరక్షణను రద్దుచేస్తారు. 
  • కుటుంబం లేదా దంపతులు ఇద్దరు పిల్లలను తాత్కాలిక సంరక్షణ కింద తీసుకోవచ్చు. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు ఒకే కుటుంబం పరిధిలో ఉండాలి. సంరక్షణ కుటుంబంలోని సొంత పిల్లలతో కలిపి మొత్తం పిల్లల సంఖ్య నలుగురికి మించి ఉండకూడదు. 
  • ఫాస్టర్‌ కేర్‌ కింద పిల్లలను తొలుత ఏడాది కాలానికి సంరక్షణలో పెడతారు. ఆ తరువాత చిన్నారుల బాగోగులు పర్యవేక్షిస్తూ, తాత్కాలిక సంరక్షణ దంపతుల వివరాలు సమీక్షించి ఏటా సంరక్షణ బాధ్యతను పెంచుతూ 18 ఏళ్ల వరకు పొడిగిస్తారు. ఒకవేళ రెండేళ్ల తరువాత దంపతులు ముందుకు వస్తే, పిల్లలు అంగీకరిస్తే శాశ్వత దత్తత ఇస్తారు. 
  • తాత్కాలిక సంరక్షణ పూర్తయిన తరువాత శాశ్వత దత్తత కోరుకుంటే.. కేంద్రీయ దత్తత నిబంధనల ప్రకారం పోర్టల్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి. వాటిని పరిశీలించిన తరువాత నివేదికలన్నీ సక్రమంగా ఉంటే ఆ పిల్లలను శాశ్వత దత్తతకు అనుమతిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని