అమిత్‌షా, కిషన్‌రెడ్డిలపై ఎన్నికల కేసు ఉపసంహరణ

ఎన్నికల నిబంధనలు అతిక్రమించారని కేంద్ర మంత్రులు అమిత్‌షా, కిషన్‌రెడ్డిలపై నమోదు చేసిన కేసును పాతబస్తీ మొఘల్‌పురా పోలీసులు ఉపసంహరించుకున్నారు.

Published : 07 Jul 2024 02:53 IST

మొఘల్‌పురా, న్యూస్‌టుడే: ఎన్నికల నిబంధనలు అతిక్రమించారని కేంద్ర మంత్రులు అమిత్‌షా, కిషన్‌రెడ్డిలపై నమోదు చేసిన కేసును పాతబస్తీ మొఘల్‌పురా పోలీసులు ఉపసంహరించుకున్నారు. ఇన్‌స్పెక్టర్‌ పి.ఎన్‌.దుర్గాప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా మే 1వ తేదీ రాత్రి లాల్‌దర్వాజా మహంకాళి దేవాలయం నుంచి సుధా థియేటర్‌ సమీపంలోని గ్రంథాలయం వరకు జరిగిన భాజపా రోడ్‌షోలో అమిత్‌షా పాల్గొన్నారు. గ్రంథాలయం వద్ద ఏర్పాటు చేసిన సభా వేదికపై అమిత్‌షా, ఎంపీ అభ్యర్థులు మాధవీలత, జి.కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యే రాజాసింగ్‌తోపాటు భాజపా నాయకుడు యమన్‌సింగ్‌లు కొంతమంది పిల్లలతో కలిసి ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ప్రచారం నిర్వహించారని టీపీసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్‌ మెయిల్‌ ద్వారా తెలంగాణ ముఖ్య ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోను కూడా పంపారు. దీంతో ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు మొఘల్‌పురా పోలీసులు అమిత్‌షాతోపాటు మిగతా వారిపైనా ఐపీసీ సెక్షన్‌    188 కింద కేసు నమోదు చేశారు. అయితే ఇందులో ఎ3, ఎ4లుగా ఉన్న అమిత్‌షా, కిషన్‌రెడ్డిలు ఉద్దేశపూర్వకంగా కోడ్‌ ఉల్లంఘించినట్లు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో వారిపై కేసును వెనక్కి తీసుకున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ పేర్కొన్నారు. కోర్టులో దాఖలు చేసిన ఛార్జిషీటులోనూ వారిద్దరి పేర్లను తొలగించినట్లు వెల్లడించారు. ఫిర్యాదుదారుకు ఈ నెల  10లోపు ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనకు సంబంధించిన తగిన ఆధారాలు సమర్పించాలని కోర్టు ఆదేశించిందని చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని