సికింద్రాబాద్‌-గోవా మధ్య బైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌

ప్రముఖ పర్యాటక ప్రదేశం గోవాకు వెళ్లి వచ్చేందుకు కొత్తగా మరో రైలు అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్‌-వాస్కోడగామా (గోవా) మధ్య బైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌ (17039/17040)ను ప్రారంభించేందుకు రైల్వేశాఖ నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు.

Published : 07 Jul 2024 02:55 IST

కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి 
మహబూబ్‌నగర్, గుంతకల్‌ మీదుగా ప్రయాణం

ఈనాడు, హైదరాబాద్‌:  ప్రముఖ పర్యాటక ప్రదేశం గోవాకు వెళ్లి వచ్చేందుకు కొత్తగా మరో రైలు అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్‌-వాస్కోడగామా (గోవా) మధ్య బైవీక్లీ ఎక్స్‌ప్రెస్‌ (17039/17040)ను ప్రారంభించేందుకు రైల్వేశాఖ నిర్ణయం తీసుకుందని కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఈ రైలుతో ఎంతో ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. కొత్త రైలును ప్రకటించినందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కి ధన్యవాదాలు తెలిపారు. ఈ రైలు కోసం మార్చి 16న ఆ శాఖ మంత్రికి లేఖ రాశానని.. ఎన్నికల్‌ కోడ్‌తో అప్పుడు ఆలస్యమైందని, ఇటీవల మరోసారి గుర్తు చేయడంతో మంజూరు చేశారని తెలిపారు. సికింద్రాబాద్‌-వాస్కోడగామా బైవీక్లీ రైలు బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరుతుంది. వాస్కోడగామా నుంచి గురు, శనివారాల్లో తిరుగు ప్రయాణం అవుతుందని కిషన్‌రెడ్డి తెలిపారు. కాచిగూడ, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, గద్వాల, కర్నూల్‌ సిటీ, డోన్, గుంతకల్, బళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్, హుబ్బళ్లి, ధార్వాడ్, లోండా, క్యాసిల్‌ రాక్, కులెం, సాన్వోర్‌డెమ్, మడగావ్‌ జంక్షన్‌లలో ఈ రైలు ఆగుతుంది. తెలుగు రాష్ట్రాల నుంచి గోవాకు భారీగా పర్యాటకులు వెళ్లి వస్తుంటారు. చాలామంది రైలు రిజర్వేషన్లు దొరక్క ప్రైవేటు బస్సులు, సొంతవాహనాలు, విమానాల్లో వెళ్లి వస్తున్నారు.

సికింద్రాబాద్‌-వాస్కోడగామా (17039): రైలు సికింద్రాబాద్‌లో ఉదయం 10.05కి బయల్దేరుతుంది. డోన్‌కు 3.20, బళ్లారికి సాయంత్రం 6.35, వాస్కోడగామాకు మరుసటిరోజు ఉదయం 5.45కి చేరుకుంటుంది.

వాస్కోడగామా-సికింద్రాబాద్‌ (17040): వాస్కోడగామా నుంచి ఉదయం 9 గంటలకు బయల్దేరుతుంది. బళ్లారికి రాత్రి 7.30 గంటలకు, డోన్‌కి 10.55కి, సికింద్రాబాద్‌కు మరుసటిరోజు ఉదయం 6.20కి చేరుకుంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని