సాంకేతికతను సక్రమంగా వాడాలి

సాంకేతిక పరిజ్ఞానాన్ని సక్రమమైన పద్ధతిలో వినియోగించకపోతే ప్రయోజనాల కంటే చెడు ప్రభావం అధికంగా ఉంటుందని అటార్నీ జనరల్‌్ ఆఫ్‌ ఇండియా ఆర్‌.వెంకటరమణి అన్నారు.

Updated : 07 Jul 2024 03:26 IST

లేదంటే చెడు ప్రభావం అధికం 
నల్సార్‌ క్యాపిటల్‌ ఫౌండేషన్‌  కార్యక్రమంలో అటార్నీ జనరల్‌ వెంకటరమణి

మాట్లాడుతున్న అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి, వేదికపై క్యాపిటల్‌ ఫౌండేషన్‌ హెడ్‌ వినోద్‌ సేఠీ, ఉస్మానియా విశ్రాంత ఆచార్యుడు పురుషోత్తమ్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, హైకోర్టు ప్రధాన  న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, నల్సార్‌ ఉపకులపతి శ్రీకృష్ణదేవరావు 

శామీర్‌పేట, న్యూస్‌టుడే: సాంకేతిక పరిజ్ఞానాన్ని సక్రమమైన పద్ధతిలో వినియోగించకపోతే ప్రయోజనాల కంటే చెడు ప్రభావం అధికంగా ఉంటుందని అటార్నీ జనరల్‌్ ఆఫ్‌ ఇండియా ఆర్‌.వెంకటరమణి అన్నారు. శనివారం మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేటలోని నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయంలో క్యాపిటల్‌ ఫౌండేషన్‌ వార్షిక ప్రసంగ కార్యక్రమం, అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని సరైన పద్ధతిలో వాడుకునేందుకు న్యాయవ్యవస్థ సహకారం అందించాలన్నారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, నల్సార్‌ న్యాయ విశ్వవిద్యాలయం ఛాన్స్‌లర్‌ జస్టిస్‌ ఆలోక్‌ అరాధే మాట్లాడుతూ.. చట్టాలను సామాన్యులకు సైతం చేరవేసేలా న్యాయవాదులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. న్యాయవ్యవస్థకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకారం అందిస్తుందన్నారు. తెలుగులో రాజ్యాంగం ఆన్‌లైన్‌ కోర్సును జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, మంత్రి ఉత్తమ్‌ ప్రారంభించారు. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ లీలా సేఠ్‌ రచించిన వి, ది చిల్డ్రన్‌ ఆఫ్‌ ఇండియా; ది ప్రియాంబుల్‌ ఆఫ్‌ అవర్‌ కాన్‌స్టిట్యూషన్‌ పుస్తకాన్ని జస్టిస్‌ ఆలోక్‌ అరాధే తెలుగులో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి క్యాపిటల్‌ ఫౌండేషన్‌ సొసైటీ ఛైర్మన్, సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఏకే పట్నాయక్‌ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో నల్సార్‌ ఉపకులపతి శ్రీకృష్ణదేవరావు, క్యాపిటల్‌ ఫౌండేషన్‌ హెడ్‌ వినోద్‌ సేఠీ, ఉస్మానియా విశ్రాంత ఆచార్యుడు పురుషోత్తమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

అవార్డుల ప్రదానం ఇలా..

జస్టిస్‌ జేఎస్‌ వర్మ జాతీయ అవార్డును జస్టిస్‌ ఆలోక్‌ అరాధేకు ప్రదానం చేశారు. జస్టిస్‌ దీపాంకర్‌ ప్రసాద్‌ గుప్తా జాతీయ అవార్డును సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి ఇందిరా బెనర్జీకి ఇచ్చారు. జస్టిస్‌ పీఎన్‌ భగవతి జాతీయ అవార్డును గువాహటి హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అజయ్‌ లంబాకు, అటార్నీ జనరల్‌ కె.వేణుగోపాల్‌ జాతీయ అవార్డును సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది పరాగ్‌ పీ త్రిపాఠికి అందించారు. లావేసీయ అటార్నీ జనరల్‌ కె.పరాశరన్‌ అవార్డును బార్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా వైస్‌ ప్రెసిడెంట్‌ నాగానంద్‌కు, ఎన్‌.నరోత్తంరెడ్డి జాతీయ అవార్డును సీనియర్‌ జర్నలిస్టు దిలీప్‌రెడ్డికి, ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ నేషనల్‌ అవార్డును జస్టిస్‌ యాపీ విస్క్‌కు ఇచ్చారు. విశ్రాంత డిప్యూటీ కన్జర్వేషన్‌ ఆఫ్‌ ఫారెస్ట్, డైరెక్టర్‌ గ్లోబల్‌ బయోడైవర్సిటీ సొల్యూషన్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ ఎన్విరాన్‌మెంట్‌ ప్రొటెక్షన్‌ నేషనల్‌ అవార్డును డా.అల్లాడి కిషన్‌రావు, డాక్టర్‌ కె తులసీరావులకు అందజేశారు. పర్యావరణ న్యాయ కార్యకర్త డా.శివాజీరావు అవార్డును పరిశోధకుడు డా.నర్సింహారెడ్డి అందుకున్నారు. అచార్య నాగార్జున యూనివర్సిటీ మాజీ డీన్, కామర్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ ఫ్యాకల్టీ  ప్రొ.రామినేని శివరామప్రసాద్‌కు క్యాపిటల్‌ ఫౌండేషన్‌ జాతీయ అవార్డు లభించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని