తెలంగాణలో భారీగా మొక్కజొన్న సాగు

రాష్ట్రంలో మొక్కజొన్న సాగు భారీగా పెరగనుంది. ప్రస్తుత వానాకాలం సీజన్‌లో 6,09,458 ఎకరాల లక్ష్యానికి గాను జూన్‌ నెలలో 1,25,235 (20.55 శాతం) ఎకరాలు సాగైనట్లు వ్యవసాయశాఖ గుర్తించింది.

Published : 07 Jul 2024 02:59 IST

వానాకాలం మొదటి నెలలోనే 20.55 శాతం పంట

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో మొక్కజొన్న సాగు భారీగా పెరగనుంది. ప్రస్తుత వానాకాలం సీజన్‌లో 6,09,458 ఎకరాల లక్ష్యానికి గాను జూన్‌ నెలలో 1,25,235 (20.55 శాతం) ఎకరాలు సాగైనట్లు వ్యవసాయశాఖ గుర్తించింది. గత నాలుగేళ్లతో పోలిస్తే ఇది అత్యధికం కాగా.. సీజన్‌లో నిర్దిష్ట లక్ష్యానికి మించి మొక్కజొన్న సాగవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మక్కలకు మంచి ధర రావడంతో పాటు ఇథనాల్, కోళ్ల పెంపకం, ఆహారశుద్ధి పరిశ్రమల నుంచి మంచి డిమాండ్‌ ఏర్పడటంతో రైతులు ఈ పంటపై మొగ్గు చూపుతున్నారని తేలింది. రాష్ట్రంలో రెండేసి సీజన్లలో మొక్కజొన్న సాగవుతోంది. గత యాసంగిలో 5,11,521 ఎకరాల లక్ష్యానికి ఏకంగా 6,68,754 ఎకరాలు(130.74 శాతం) సాగైంది. అంతకుముందు వానాకాలంలో 6,58,867 ఎకరాల్లో రైతులు సాగు చేశారు. గత ఏడాది మక్కలకు భారీగా డిమాండ్‌ ఏర్పడింది. పౌల్ట్రీకి దాణాగా వినియోగం, బిస్కెట్లు, పాప్‌కార్న్‌లు, ఇతర ఉత్పత్తుల కోసం మొక్కజొన్న అవసరముంది. మరోవైపు ప్రభుత్వం మద్దతు ధరల భరోసా కోసం మార్క్‌ఫెడ్‌ ద్వారా కేంద్రాలు తెరిచింది. 

ఇథనాల్‌ తయారీకి..

జీవ ఇంధనమైన ఇథనాల్‌ తయారీ కోసం మొక్కజొన్నలను మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడుల నుంచి పరిశ్రమలు కొనుగోలు చేశాయి. దేశంలో భవిష్యత్తు అవసరాల దృష్ట్యా 2025 నాటికి పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్‌ కలిపి వాహనాలు వినియోగించేందుకు వీలుగా ఉత్పత్తిని నిర్దేశించింది. దీనికి అనుగుణంగా మొక్కజొన్న సాగు పెంపుపై హైదరాబాద్‌ వేదికగా జాతీయ సదస్సు ఇటీవల నిర్వహించారు. దేశంలో 2025 నాటికి పెట్రో వాహనాలకు ఇథనాల్‌ అవసరాల దృష్ట్యా మక్కల సాగు పెరగాలని శాస్త్రవేత్తలు పిలుపునిచ్చారు. దీనికి అనుగుణంగా కొత్త రకాల రూపకల్పన జరుగుతోంది. మరోవైపు నీటిలభ్యత కూడా మక్కల సాగు పెరుగుదలకు కారణమని వ్యవసాయశాఖ భావిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని