మూడో విడతలో 73,662 మందికి డిగ్రీ సీట్లు

డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌-తెలంగాణ(దోస్త్‌) మూడో విడతలో 73,662 మంది విద్యార్థులకు సీట్లు దక్కాయి. వారిలో 9,630 మంది గత రెండు విడతల్లో సీట్లు పొందినవారే. మళ్లీ వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకుని కొత్త కళాశాలలు, కోర్సుల కోసం ప్రయత్నించారు.

Published : 07 Jul 2024 02:59 IST

15 నుంచి తరగతుల ప్రారంభం

ఈనాడు, హైదరాబాద్‌: డిగ్రీ ఆన్‌లైన్‌ సర్వీసెస్‌-తెలంగాణ(దోస్త్‌) మూడో విడతలో 73,662 మంది విద్యార్థులకు సీట్లు దక్కాయి. వారిలో 9,630 మంది గత రెండు విడతల్లో సీట్లు పొందినవారే. మళ్లీ వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకుని కొత్త కళాశాలలు, కోర్సుల కోసం ప్రయత్నించారు. అంటే.. కొత్తగా 64,032 మందికి సీట్లు లభించాయి. మూడో విడత సీట్లను శనివారం కేటాయించారు. ఆ వివరాలను దోస్త్‌ కన్వీనర్‌ ఆచార్య ఆర్‌.లింబాద్రి వెల్లడించారు. తక్కువ వెబ్‌ ఆప్షన్లు ఇచ్చినందువల్ల 6,650 మందికి సీట్లు దక్కలేదని తెలిపారు. సీట్లు పొందినవారు ఈ నెల 7 నుంచి 11వ తేదీ వరకు ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసి సీట్లను రిజర్వు చేసుకోవాలని ఆయన సూచించారు. రెండో విడతలో సీటు పొంది, ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసి.. మూడో విడతలో కొత్తగా వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకున్నవారు సైతం మళ్లీ ఆన్‌లైన్‌ సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేయాలని స్పష్టం చేశారు. వారి మొబైల్‌కు ఓటీపీ వస్తుందని తెలిపారు. ఈ నెల 8 నుంచి 12వ తేదీ వరకు సంబంధిత కళాశాలకు వెళ్లి.. ఆ ఓటీపీ సమర్పించి తమ సీట్లను ధ్రువీకరించుకోవాలని, ఒకవేళ కళాశాలలో రిపోర్ట్‌ చేయకుంటే సీట్లు కోల్పోతారని ఆయన స్పష్టం చేశారు. మూడు విడతల సీట్ల కేటాయింపు పూర్తి కావడంతో ఈ నెల 15వ తేదీ నుంచి మొదటి సెమిస్టర్‌ తరగతులు ప్రారంభం కానున్నాయి. మూడు విడతల్లో సీట్లు ధ్రువీకరించుకున్న అభ్యర్థులు ఆయా కళాశాలల్లో ఖాళీలను బట్టి కోర్సులను మార్చుకోవచ్చని లింబాద్రి తెలిపారు. అందుకు ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలని, 19వ తేదీన సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని