పింఛన్లకు రూ.22 వేల కోట్లు కేటాయించండి

రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్న పూర్తిస్థాయి బడ్జెట్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.51 వేల కోట్లు కేటాయించాలని ఆ శాఖ మంత్రి సీతక్క ఆర్థిక శాఖను కోరారు.

Published : 07 Jul 2024 03:03 IST

ఇతర పద్దులకు రూ.29 వేల కోట్లు 
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ బడ్జెట్‌ ప్రతిపాదనలు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం త్వరలో ప్రవేశపెట్టనున్న పూర్తిస్థాయి బడ్జెట్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు రూ.51 వేల కోట్లు కేటాయించాలని ఆ శాఖ మంత్రి సీతక్క ఆర్థిక శాఖను కోరారు. చేయూత పథకం కింద పింఛన్లకు రూ.22 వేల కోట్లు, ఇతర పద్దులకు రూ.29 వేల కోట్లు ఇవ్వాలని విన్నవించారు. శనివారం ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క ఆధ్వర్యంలో సచివాలయంలో బడ్జెట్‌ ప్రతిపాదనలపై సమావేశం జరిగింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఆ శాఖ తరఫున ప్రతిపాదనలు సమర్పించారు. ‘‘గత బడ్జెట్‌లో రూ.23 వేల కోట్లు కేటాయించారు. ఇప్పుడు అవసరాలు, హామీల అమలు కోసం ఆ మొత్తాన్ని రూ.51 వేల కోట్లకు పెంచాలి. ప్రస్తుతం ఆసరా పథకం కింద రూ.12 వేల కోట్లు వెచ్చిస్తున్నారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర వర్గాల వారికి ‘పింఛను రెట్టింపు’ హామీ అమలుకు ఈ కేటాయింపులను రూ.22 వేల కోట్లకు పెంచాలి. గ్రామీణ రహదారుల బడ్జెట్‌ను రెట్టింపు చేయాలి. మహిళా స్వయం సహాయక సంఘాలకు రుణ బీమా, ప్రమాద బీమాకు అవసరమైన నిధులను బడ్జెట్లో కేటాయించాలి’’ అని సీతక్క కోరారు. 

తాగునీటి కొరత ఉండరాదు: సీతక్క 

తెలంగాణలోని ప్రతి ఆవాస ప్రాంతానికి రక్షిత తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని మంత్రి సీతక్క ఆదేశించారు. అటవీ ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. శనివారం సచివాలయంలో జరిగిన తాగునీటి సరఫరా సంస్థ సమావేశానికి మంత్రి అధ్యక్షత వహించారు. రాష్ట్రంలోని పలు ఆవాసాలకు సాగు నీరందడం లేదని, వాటిలో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ‘‘అడవుల్లో విద్యుత్‌ లైన్లు వేసేందుకు కేంద్ర అటవీ శాఖ అనుమతులు ఇవ్వడం లేదు. అక్కడ సౌరవిద్యుత్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసి బోర్ల ద్వారా ఆవాసాలకు తాగునీటి సౌకర్యం కల్పించాలి. ములుగు జిల్లాలోని వారికి పాకాల, లక్నవరం నుంచి నీటిని తరలించాలి. గ్రామ పంచాయతీల్లో ఓవర్‌హెడ్‌ ట్యాంకులను ప్రతి 15 రోజులకు ఒకసారి శుభ్రపరచాలి. ప్రభుత్వం సరఫరా చేస్తున్న తాగునీటిని వినియోగించే విధంగా ప్రజలకు నమ్మకం కలిగించాలి. మిషన్‌ భగీరథ అధికారులు పారదర్శకంగా వ్యవహరించాలి. వర్కింగ్‌ ఏజెన్సీలతో పనులు చేయించాలి’’ అని సీతక్క సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని