పేరుకే తెలుగు విశ్వవిద్యాలయం

భాషాభివృద్ధి... సాహిత్యం.. సంస్కృతి.. పరిశోధనలతో తెలుగుకు మరింత వన్నె తెచ్చేందుకు ఏర్పాటైన విశ్వవిద్యాలయంలో ఆ భాషకు ప్రాధాన్యమే లేదు.

Published : 07 Jul 2024 03:04 IST

ఒప్పంద ఆచార్యులతో తెలుగు ఎంఏ కోర్సు నిర్వహణ

ఈనాడు, హైదరాబాద్‌: భాషాభివృద్ధి... సాహిత్యం.. సంస్కృతి.. పరిశోధనలతో తెలుగుకు మరింత వన్నె తెచ్చేందుకు ఏర్పాటైన విశ్వవిద్యాలయంలో ఆ భాషకు ప్రాధాన్యమే లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రాజధాని కేంద్రంగా 1985లో ఏర్పాటైన పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో తెలుగు ఎంఏ కోర్సు లేదు. ఇక్కడ ప్రవేశాలు తీసుకున్నా మొదట్లో విద్యార్థులు రాజమహేంద్రవరంలోని క్యాంపస్‌ పర్యవేక్షణలోనే ఆ కోర్సును అభ్యసించేవారు. హైదరాబాద్‌లో ఉంటున్న విద్యార్థులు 15 ఏళ్ల క్రితం ఆందోళన చేయగా.. 2011లో ఎంఏ తెలుగు కోర్సును ప్రారంభించారు. కానీ శాశ్వత ఆచార్యులను నియమించలేదు. విశ్రాంత, ఒప్పంద ఆచార్యులతో తరగతుల నిర్వహణ కొనసాగుతోంది. పదో షెడ్యూలులోని విద్యా సంస్థల విభజన వేళ ఇవన్నీ వెలుగుచూస్తున్నాయి.

ఆది నుంచే అనాసక్తి... 

హైదరాబాద్‌లో తెలుగు ఎంఏ కోర్సు ప్రారంభించాలన్న నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి, అప్పుడు విధుల్లో ఉన్న కొందరు అధికారులు, ఆచార్యులు అనాసక్తితో ఎంఏ(తెలుగు) విభాగానికి గట్టి పునాదులు పడలేదు. ఇద్దరు విశ్రాంత ఆచార్యులు, మరో ఇద్దరు విశ్రాంత సహ ఆచార్యులతో ఎంఏ(తెలుగు)ను అందుబాటులోకి తెచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక, రెగ్యులర్‌ యంత్రాంగం ఆవశ్యకతను అప్పటి ఉపకులపతి, రిజిస్ట్రార్‌ ప్రభుత్వం దృషికి తీసుకెళ్లారు. ఉన్నతవిద్యాశాఖ అధికారులకు విషయం వివరించినా స్పందన కొరవడింది. 

సివిల్స్‌లోనూ ప్రాధాన్యం..

కేంద్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానాన్ని అమల్లోకి తెచ్చాక పోటీ పరీక్షల్లోనూ మార్పులు వచ్చాయి. విద్యార్థులకు ఇష్టమైన సబ్జెక్టులను ఎంచుకునే వెసులుబాటు లభించింది. ఆంగ్ల మాధ్యమంలో చదువుకొంటున్న వారూ తెలుగును అభ్యసించేందుకు అవకాశం ఉంది. దీంతోపాటు సివిల్స్‌కు సిద్ధమవుతున్న ఏపీ, తెలంగాణ వారు కొన్నేళ్ల నుంచి తెలుగు ఐచ్ఛికానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ భాష అభివృద్ధి కోసం ప్రత్యేకంగా ఏర్పాటైన విశ్వవిద్యాలయంలో శాశ్వత ఆచార్యులు, పరిశోధకులు లేకపోవడంతో ఉస్మానియా, హైదరాబాద్‌ కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో చదువుకునేందుకు విద్యార్థులు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని