గ్రూప్‌-1లో ఉప విద్యాశాఖ అధికారుల పోస్టులు!

పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ఉప విద్యాశాఖ అధికారుల (డిప్యూటీ ఈఓ) పోస్టులను గ్రూప్‌-1 ద్వారా భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలు సమర్పించారు.

Published : 07 Jul 2024 03:07 IST

పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదనలు
ప్రభుత్వం అనుమతి ఇస్తే 24 కొలువుల భర్తీ

ఈనాడు, హైదరాబాద్‌: పాఠశాల విద్యాశాఖ పరిధిలోని ఉప విద్యాశాఖ అధికారుల (డిప్యూటీ ఈఓ) పోస్టులను గ్రూప్‌-1 ద్వారా భర్తీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వానికి విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలు సమర్పించారు. సర్కారు పచ్చజెండా ఊపితే.. వచ్చే గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ ద్వారా 24 ఖాళీలను భర్తీ చేస్తారు. టీజీపీఎస్సీ అధికారులు సైతం ఈ పోస్టులను గ్రూప్‌-1 ద్వారానే భర్తీ చేయాలని, ప్రత్యేక పరీక్ష అవసరం లేదన్న భావనతో ఉన్నట్లు సమాచారం. త్వరలో ఉద్యోగ క్యాలెండర్‌ను ప్రకటించేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోంది. అందులో భాగంగా గ్రూప్‌-1లో ఉప విద్యాశాఖ అధికారుల ఖాళీలను కూడా చూపవచ్చని తెలుస్తోంది.

పీజీతోపాటు బీఈడీ ఉంటేనే...

ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉంటే చాలు.. గ్రూప్‌-1 ఉద్యోగాలకు పోటీపడవచ్చు. డిప్యూటీ ఈఓ కొలువులకు మాత్రం పోస్టు గ్రాడ్యుయేషన్‌(పీజీ)తో పాటు బీఈడీ విద్యార్హత ఉండాలి. ఒకవేళ బీఈడీ లేకుంటే.. సర్వీస్‌లో చేరిన తర్వాత చేయవచ్చు. పీజీ మాత్రం తప్పనిసరిగా ఉండాలి.  

అనుమతి ఇచ్చి ఏడాదిన్నర దాటినా...

పాఠశాల విద్యాశాఖ పరిధిలో 134 ఉద్యోగాలను టీజీపీఎస్సీ ద్వారా భర్తీ చేసేందుకు ఆర్థికశాఖ 2022 నవంబరు 12న అనుమతి ఇచ్చింది. అందులో 24 ఉప విద్యాశాఖ అధికారుల పోస్టులు, 110 అధ్యాపక, సీనియర్‌ అధ్యాపక ఖాళీలు ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 72 డిప్యూటీ ఈఓ పోస్టులు ఉండగా.. వాటిలో 33 శాతం కింద 24 ఖాళీలను నోటిఫికేషన్‌ ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. అయితే, ఏడాదిన్నర గడిచినా ఇంకా నోటిఫికేషన్‌ వెలువడలేదు. ఈ పోస్టులను భర్తీ చేయాలంటూ ఇటీవలే టీజీపీఎస్సీని పాఠశాల విద్యాశాఖ కోరింది. వీటిని గ్రూప్‌-1 ద్వారా భర్తీ చేయాలన్న ఆలోచన తలెత్తింది. ఈ నేపథ్యంలోనే పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

ఆ 110 పోస్టులకు నోటిఫికేషన్‌ ఎన్నడో?

రాష్ట్రంలోని 12 డైట్‌ కళాశాలలతో పాటు వరంగల్, మహబూబ్‌నగర్, నాగార్జునసాగర్‌లలోని మూడు ప్రభుత్వ బీఈడీ కళాశాలలు(కాలేజ్‌ ఆఫ్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌-సీటీఈ), హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంకులోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీ ఇన్‌ ఎడ్యుకేషన్‌(ఐఏఎస్‌ఈ-ప్రభుత్వ ఎంఈడీ కళాశాల)లో 80 శాతానికిపైగా అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిలో 33 శాతాన్ని మాత్రమే డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌(నోటిఫికేషన్‌) ద్వారా భర్తీ చేయాల్సి ఉంటుంది. మిగిలిన 67 శాతం పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేస్తారు. ఉపాధ్యాయులకు ఏకీకృత సర్వీస్‌ నిబంధనల కేసు తేలకపోవడంతో పదోన్నతుల ప్రక్రియ గత దశాబ్దన్నర కాలంగా నిలిచిపోయింది. ప్రత్యక్ష నియామకాల ద్వారా డైట్‌లలో 23 సీనియర్‌ అధ్యాపకులు, 65 అధ్యాపకుల ఖాళీలు, ఎస్‌సీఈఆర్‌టీ/సీటీఈ/ఐఏఎస్‌ఈలో మరో 22 పోస్టులు కలిపి.. మొత్తం 110 ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. వాటికీ 2022 నవంబరులో అనుమతి ఇచ్చినా ఇప్పటివరకు నోటిఫికేషన్‌ వెలువడలేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని