విశ్వసనీయతకు.. క్రమశిక్షణకు మారుపేరు రామోజీరావు

విశ్వసనీయతకు, నిబద్ధతకు, క్రమశిక్షణకు రామోజీరావు మారుపేరని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో శనివారం సీఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సంస్మరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

Published : 07 Jul 2024 03:09 IST

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
సీఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు

రామోజీరావుకు నివాళులు అర్పిస్తున్న పోకూరి బాబూరావు, ఎన్‌.వెంకటేశ్వరరావు, కె.నారాయణ, తుమ్మల నాగేశ్వరరావు, సురవరం సుధాకర్‌రెడ్డి, పల్లా వెంకట్‌రెడ్డి, పి.శ్రీరామ్, చెన్నకేశవరావు, పశ్య పద్మ, చెన్నమనేని వెంకటేశ్వరరావు తదితరులు

మియాపూర్, న్యూస్‌టుడే: విశ్వసనీయతకు, నిబద్ధతకు, క్రమశిక్షణకు రామోజీరావు మారుపేరని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో శనివారం సీఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సంస్మరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘‘రామోజీరావు ఎప్పుడూ ప్రజాహితం కోరుకునేవారు. ప్రజలకు పాలన, రాజకీయ, ప్రకృతి వైపరీత్యాల పరంగా ఏ కష్టం వచ్చినా అండగా నిలిచి.. తన వంతు కర్తవ్యంగా ముందుండి నడిపించేవారు. తన జీవితకాలంలో ప్రజలకు వ్యతిరేకంగా పనిచేసిన ఏ వ్యక్తికి గాని, శక్తికి గాని తలవంచలేదు’’ అని తుమ్మల అన్నారు. సీఆర్‌ ఫౌండేషన్‌కు తనవంతు తోడ్పాటు అందిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. సీఆర్‌ ఫౌండేషన్‌ గౌరవాధ్యక్షుడు, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. విలువలతో కూడిన వ్యవస్థలను, సంస్థలను నిర్మించిన ఘనత రామోజీరావుదేనని అన్నారు. తెలుగు భాష కోసం ఆయన ఎనలేని కృషి చేశారని చెప్పారు. ఫౌండేషన్‌ అధ్యక్షుడు, సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మాట్లాడుతూ.. సీఆర్‌ ఫౌండేషన్‌ ఏర్పాటులో రామోజీరావుది కీలక భూమిక అని, అప్పట్లోనే రూ.5 లక్షల విరాళం అందజేశారని తెలిపారు. వృద్ధులకు సౌకర్యవంతంగా ఉండేలా వృద్ధాశ్రమం నిర్మించాలని ఆయన కోరుకునేవారన్నారు. నిర్మాణ సమయంలో రామోజీరావు సూచనలు, సలహాలు తమకు ఎంతగానో ఉపకరించాయని చెప్పారు. కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ.. రామోజీరావు అక్షర విప్లవకారుడని, ఆయన భావాలు, ఆలోచన విధానాలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. ఈటీవీ న్యూస్‌ కోఆర్డినేటర్‌ పి.శ్రీరామ్‌ మాట్లాడుతూ.. రామోజీరావు జీవితం విలువలకు నిలువెత్తు నిదర్శనమన్నారు. ఈ సందర్భంగా రామోజీరావు చిత్రపటానికి సీఆర్‌ ఫౌండేషన్‌ ప్రతినిధులు, అభిమానులు, వృద్ధాశ్రమ వాసులు ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ఫౌండేషన్‌ ప్రధాన కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి, కార్యదర్శులు పీజే చంద్రశేఖరరావు, చెన్నమనేని వెంకటేశ్వరరావు, కోశాధికారి చెన్నకేశవరావు, హెల్త్‌ సెంటర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కూనంనేని రజిని, ఏఐటీయూసీ మాజీ జాతీయ కార్యదర్శి విజయలక్ష్మి, రైతు సంఘం నాయకుడు ఎన్‌.వెంకటేశ్వరరావు, సినీ నిర్మాత పోకూరి బాబూరావు, దర్శకులు మద్దినేని రమేష్, బాబ్జి, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి పల్లె నరసింహ, జ్యోత్స్న, బట్ల కల్పన, కృష్ణకుమారి, పశ్య పద్మ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని