ఉత్తర భాగానికి రూ.5వేల కోట్లు!

హైదరాబాద్‌ ప్రాంతీయ రింగ్‌ రోడ్‌కు ఆర్థిక అవస్థలు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. హైదరాబాద్‌ అవుటర్‌ రింగ్‌ రోడ్‌ అవతల నుంచి 2 భాగాలుగా ప్రాంతీయ రింగ్‌ రోడ్‌(ఆర్‌ఆర్‌ఆర్‌)ను తలపెట్టిన విషయం తెలిసిందే.

Updated : 07 Jul 2024 03:34 IST

 రుణం ద్వారా రూ.3,000 కోట్లు

రాష్ట్ర బడ్జెట్‌ నుంచి రూ.2,000 కోట్లు
ప్రాంతీయ రింగ్‌ రోడ్‌కు ప్రభుత్వ వ్యూహం

ఈనాడు, హైదరాబాద్‌: హైదరాబాద్‌ ప్రాంతీయ రింగ్‌ రోడ్‌కు ఆర్థిక అవస్థలు రాకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికను సిద్ధం చేసింది. హైదరాబాద్‌ అవుటర్‌ రింగ్‌ రోడ్‌ అవతల నుంచి 2 భాగాలుగా ప్రాంతీయ రింగ్‌ రోడ్‌(ఆర్‌ఆర్‌ఆర్‌)ను తలపెట్టిన విషయం తెలిసిందే. ఉత్తర భాగం భూ సేకరణ వ్యయంలో రాష్ట్ర వాటా మొత్తాన్ని ముందస్తుగా సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో భూసేకరణ ప్రక్రియ త్వరలో వేగం పుంజుకోనుంది. ఇప్పటికే గుర్తించిన భూ యజమానులకు అధికారులు త్వరలో నోటీసులు జారీ చేయనున్నారు. ఉత్తర భాగం రహదారి నిర్మాణానికి సుమారు 4,700 ఎకరాల వరకు భూసేకరణ చేయాలి. ఈ వ్యయాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరించాలని నిర్ణయించాయి. భూమిని కోల్పోయే యజమానులకు ఎకరాకు ఎంత నష్ట పరిహారంగా చెల్లించాలన్న అంశాన్ని అధికారులు తేల్చాలి. భూ సేకరణకు రూ.10 వేల కోట్ల వరకు వ్యయం అవుతుందన్నది ప్రాథమిక అంచనా. ఆ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద రూ.5 వేల కోట్ల వరకు వెచ్చించాలి. 

భూ సేకరణకు అవసరమైన నిధుల్లో రూ.3 వేల కోట్లను రుణంగా సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. బ్యాంకుల కన్సార్షియం నుంచి రుణాన్ని పొందేందుకు రహదారులు, భవనాలశాఖ కసరత్తు చేసింది. అయితే బ్యాంకులు ముందుకు రాలేదు. దీంతో హడ్కోను సంప్రదించాలన్న ప్రభుత్వ సూచన మేరకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. రుణం ఇచ్చేందుకు అది ఆమోదం తెలిపింది. మరో రూ.2 వేల కోట్లను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని, బడ్జెట్‌లో ఆ మొత్తాన్ని పేర్కొనాలని నిర్ణయించింది. 


మూడేళ్లుగా కసరత్తు...

ప్రాంతీయ రింగ్‌ రోడ్‌ ఉత్తర భాగం నిర్మాణానికి మూడేళ్లుగా కసరత్తు జరుగుతోంది. ఇప్పటి వరకు రూ.100 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు కేటాయించారు. ఆ మొత్తాన్ని పూర్తిస్థాయిలో విడుదల చేసిన దాఖలాలు లేవు. రాష్ట్ర ప్రభుత్వం ప్రాంతీయ రింగ్‌ రోడ్‌ నిర్మాణం ద్వారా పారిశ్రామిక అభివృద్ధి దిశగా భారీ ప్రణాళికలను రహదారి నిర్మాణంలో భూ సేకరణే కీలకం. ఈ విషయంలో జాప్యం జరగకుండా ఉండేందుకు అవసరమైన నిధులను ముందస్తుగానే సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని