ఎస్సీ గురుకుల సొసైటీలో పూర్తికాని తుది కేటాయింపులు

రాష్ట్రంలోని ఎస్సీ గురుకుల సొసైటీలో జీవో నం. 317కు సంబంధించిన ఉద్యోగుల తుది కేటాయింపుల ప్రక్రియ గందరగోళంగా మారింది. ఇతర సంక్షేమ సొసైటీల్లో సాంకేతిక పొరపాట్లకు అవకాశం లేకుండా తుది కేటాయింపులు పూర్తయ్యాయి.

Published : 07 Jul 2024 03:31 IST

ఆందోళనలో ఉద్యోగులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఎస్సీ గురుకుల సొసైటీలో జీవో నం. 317కు సంబంధించిన ఉద్యోగుల తుది కేటాయింపుల ప్రక్రియ గందరగోళంగా మారింది. ఇతర సంక్షేమ సొసైటీల్లో సాంకేతిక పొరపాట్లకు అవకాశం లేకుండా తుది కేటాయింపులు పూర్తయ్యాయి. ఎస్సీ సొసైటీలో మాత్రం ఈ ప్రక్రియ ఇంతవరకు మొదలు కాలేదు. తొలుత ప్రకటించిన షెడ్యూలు ప్రకారం కోర్టు నుంచి యథాస్థితి ఉత్తర్వులు పొందిన వారికి మినహా.. మిగిలిన వారికి గత నెల 24, 25 తేదీల్లోనే తుది కేటాయింపులు పూర్తిచేయాలని సొసైటీ భావించింది. ఈ మేరకు ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌కు ఏర్పాట్లు చేసినా, ఉద్యోగుల సంఖ్యకు సరిపడా ఖాళీలు లేకపోవడం, సాంకేతిక తప్పిదాల కారణంగా వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఉద్యోగుల నుంచి ఆఫ్‌లైన్‌ ఆప్షన్లు తీసుకుని పూర్తిచేస్తామని ఉద్యోగ సంఘాలకు ఎస్సీ గురుకుల సొసైటీ హామీ ఇచ్చింది. అయినా ఇప్పటివరకు తుది కేటాయింపులు జరగకపోవడంతో ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జీవో నం. 317 బాధితులకు ప్రభుత్వం ఇచ్చిన గడువు జూన్‌ 30తో ముగిసింది. బాధిత ఉద్యోగులకు న్యాయం చేసేందుకు ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం త్వరలో నివేదిక ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం తుది కేటాయింపుల ప్రక్రియ చేపట్టకుండా నివేదిక ప్రకారమే ముందుకెళ్లాలని కొందరు ఉద్యోగులు పేర్కొంటున్నారు. మరోవైపు సాధారణ బదిలీలకు ప్రభుత్వం అనుమతించినా సొసైటీలో ఆ మేరకు ఏర్పాట్లు జరగడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా.. గడువులోగా తుది కేటాయింపులు, బదిలీలు పూర్తిచేస్తామని సొసైటీ వర్గాలు ఉద్యోగ సంఘాలకు చెబుతున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని