సంక్షిప్త వార్తలు

డోర్నకల్‌-భద్రాచలం స్టేషన్ల మధ్య లైన్‌ డబ్లింగ్‌ కోసం భూసేకరణ చేపట్టాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్‌ జారీచేసింది. ఈ లైన్‌ కోసం మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్, గార్ల మండలాల్లో భూసేకరణ చేపట్టనున్నారు.

Updated : 07 Jul 2024 03:54 IST

డోర్నకల్‌-భద్రాచలం మధ్య డబ్లింగ్‌కు భూసేకరణ
నోటిఫికేషన్‌ జారీ చేసిన రైల్వేశాఖ

ఈనాడు, దిల్లీ: డోర్నకల్‌-భద్రాచలం స్టేషన్ల మధ్య లైన్‌ డబ్లింగ్‌ కోసం భూసేకరణ చేపట్టాలని రైల్వేశాఖ నిర్ణయించింది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్‌ జారీచేసింది. ఈ లైన్‌ కోసం మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్, గార్ల మండలాల్లో భూసేకరణ చేపట్టనున్నారు. దీనిపై అభ్యంతరాలున్నవారెవరైనా 30 రోజుల్లో మహబూబాబాద్‌ జిల్లా ఆర్డీవోకు లిఖితపూర్వకంగా తెలపాలని రైల్వేశాఖ వెల్లడించింది. ఈ భూసేకరణ కారణంగా ప్రభావితమయ్యేవారు నేరుగా కానీ, న్యాయవాది ద్వారా కానీ మహబూబాబాద్‌  ఆర్డీవో ముందు తమ వాదనలు వినిపించుకోవచ్చని తెలిపింది. 


ఫ్రాన్స్‌ ఎన్నికల్లో ఓటేయనున్న యానాం వాసులు

యానాం, న్యూస్‌టుడే: ఫ్రాన్స్‌లో ఆదివారం జరగనున్న రెండో విడత ఓటింగ్‌లో యానాం నుంచి 60 మంది ఫ్రెంచి ఓటర్లు పాల్గొననున్నారు. ఇప్పటికే ఆన్‌లైన్‌ ద్వారా 18 మంది ఓట్లేశారు. ఫ్రెంచి పార్లమెంటులోని 577 స్థానాల్లోని ఓ నియోజకవర్గం పరిధిలో పోటీచేసే అభ్యర్థులకు యానాం ఓటర్లు ఓట్లేయాల్సి ఉంటుంది. ఈ స్థానానికి అనెగినెట్, జపోల్‌ ఫోరెట్‌ పోటీపడుతున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన ఫ్రెంచ్‌ ఓటర్లకు చెన్నై, పుదుచ్చేరిల్లో పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేశారు.


నాటుసారా కట్టడిలో ఆబ్కారీ శాఖ రికార్డు

ఈనాడు, హైదరాబాద్‌: నాటుసారాను అరికట్టడంలో రాష్ట్ర ఆబ్కారీ శాఖ రికార్డు సృష్టించింది. జూన్‌ నుంచి ఆగస్టు వరకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టిన ఆ శాఖ.. లక్ష్యాన్ని చేరుకోవడంలో భాగంగా మొదటి నెలలోనే మెరుగైన పనితీరును కనబరిచింది. నాటుసారా కట్టడికి సంబంధించి గతేడాది(2023) మొత్తం 1,182 కేసులు నమోదవగా.. ఈ ఏడాది ఒక్క జూన్‌ నెలలోనే 1,901 కేసులను నమోదుచేయడం గమనార్హం. అధికారులు జూన్‌లో 8,716 లీటర్ల గుడుంబాను జప్తు చేయడంతోపాటు 20,158 కిలోల బెల్లాన్ని స్వాధీనం చేసుకున్నారు. 77 నాటుసారా బట్టీలను ధ్వంసం చేసి 1,91,850 లీటర్ల బెల్లం పానకాన్ని పారబోశారు. నాటుసారా తయారీకి వాడే 3,307 కిలోల ఆలంను సీజ్‌ చేశారు. ఇలా ఆగస్టు చివరి నాటికి రాష్ట్రంలో నాటుసారాను తుదముట్టించడమే లక్ష్యంగా ఆబ్కారీ శాఖ అధికారులు ముందుకు సాగుతున్నారు. 


తిరుమలలో సిఫారసు లేఖలపై చొరవ చూపండి 

సీఎం రేవంత్‌రెడ్డికి తుమ్మల లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లే భక్తులకు వసతి, దర్శనం కోసం తెలంగాణ ప్రజాప్రతినిధులు పంపే సిఫారసు లేఖలకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రాధాన్యమిచ్చేలా ఏపీ సీఎం చంద్రబాబునాయుడుకు విజ్ఞప్తి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు. ఈ మేరకు శనివారం రేవంత్‌కు లేఖ రాశారు.ఇద్దరు సీఎంల భేటీలో సిఫారసు లేఖలపై నిర్ణయం తీసుకునేలా చొరవ తీసుకోవాలని కోరారు.


జీవో నం.317 బాధితులకు త్వరలో పరిష్కారం

మంత్రి దామోదర్‌ రాజనర్సింహ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో జీవో నం.317 బాధిత ఉద్యోగులకు శాశ్వత పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం త్వరలో నిర్ణయం తీసుకోనుందని వైద్యఆరోగ్య శాఖ మంత్రి దామోదర్‌ రాజనర్సింహ తెలిపారు. ఉపసంఘం మరోసారి సమావేశమై తుది నివేదికను సీఎం రేవంత్‌రెడ్డికి అందిస్తుందని పేర్కొన్నారు. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక తయారీలో భాగంగా జీవో నం.317 బాధిత ఉద్యోగ సంఘాలతో ప్రాథమిక సమావేశం శనివారం జరిగింది. ఉద్యోగుల స్థానికత, రాష్ట్రపతి ఉత్తర్వులు, జిల్లాల పునర్విభజన, జోన్, మల్టీజోన్లు, స్పౌజ్‌ బదిలీల అంశాలపై ఉద్యోగుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాధిత ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ఉపసంఘం కృషి చేస్తుందని మంత్రి తెలిపారు. ఈ సందర్భంగా బాధితుల సమన్వయ సంఘం ప్రతినిధులు ప్రతిపాదించిన పలు డిమాండ్లు, అంశాలను పరిశీలించిన మంత్రి వాటి పరిష్కారానికి సానుకూలంగా స్పందించారని ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి.


నేటి నుంచి పాలిసెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌

ఈనాడు, హైదరాబాద్‌: పాలిసెట్‌ చివరి విడత కౌన్సెలింగ్‌ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 7 నుంచి 8వ తేదీ వరకు ఫీజు చెల్లించి స్లాట్‌ బుక్‌ చేసుకోవచ్చు. వారికి ఈ నెల 9న ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. అభ్యర్థులు 9, 10 తేదీల్లో వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవాలని, 13వ తేదీన సీట్లు కేటాయిస్తామని పాలిసెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ శ్రీదేవసేన తెలిపారు.


బదిలీ అయిన ఉపాధ్యాయులను  రిలీవ్‌ చేయాలి: బీసీటీఏ

ఈనాడు, హైదరాబాద్‌: తాజాగా బదిలీ అయిన ఎస్‌జీటీల స్థానంలో విద్యా వాలంటీర్లను నియమించి, వారిని కొత్త స్థానాల్లో చేరేవిధంగా రిలీవ్‌ చేయాలని బహుజన క్లాస్‌ టీచర్స్‌ అసోసియేషన్‌(బీసీటీఏ) రాష్ట్ర అధ్యక్షుడు కె.కృష్ణుడు, ప్రధాన కార్యదర్శి ఎ.లక్ష్మణ్‌గౌడ్‌ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు శనివారం వినతిపత్రం సమర్పించారు. భాషాపండితులు, పీఈటీల ఉన్నతీకరణ కంటే ముందు ఖాళీగా ఉన్న 900కిపైగా పోస్టులను ఎస్‌జీటీలు, పీఎస్‌హెచ్, పీఈటీలకు అర్హత కల్పించి పదోన్నతులివ్వాలని కోరారు.


డ్రగ్స్‌ కంట్రోల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ జేడీగా జి.రాంధన్‌

ఈనాడు, హైదరాబాద్‌: డ్రగ్‌కంట్రోల్‌ విభాగంలో డిప్యూటీ డైరెక్టర్‌గా పనిచేస్తున్న జి.రాంధన్‌కు ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఆయనను డ్రగ్‌కంట్రోల్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ జాయింట్‌ డైరెక్టర్‌గా నియమిస్తూ వైద్యఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్‌ క్రిస్టీనా జెడ్‌ చోంగ్తు ఉత్తర్వులు జారీ చేశారు.


ఎల్‌పీలకూ పదోన్నతి కల్పించండి

పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌కు ఆర్‌యూపీపీటీఎస్‌ వినతి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో పదోన్నతుల తర్వాత సుమారు 800 మంది భాషా పండితులు స్కూల్‌ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందకుండా మిగిలిపోయారని, వారికి కూడా ప్రయోజనం కలిగేలా పదోన్నతి కల్పించాలని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు(ఆర్‌యూపీపీటీఎస్‌) పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఈవీ నర్సింహారెడ్డిని కోరింది. ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సి.జగదీశ్, ప్రధాన కార్యదర్శి ఎస్‌.నర్సింహులు, కోశాధికారి రమణశర్మ తదితరులు శనివారం వినతిపత్రం సమర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని