కలెక్టర్ల వద్దే ఏజెన్సీ భూ వివాదాల పరిష్కారం

ఏజెన్సీల్లోని భూ వివాదాలను జిల్లా కలెక్టర్ల వద్దనే పరిష్కరించుకోవచ్చని ఆదిలాబాద్‌ కోర్టుల పోర్ట్‌ఫోలియో జడ్జి అయిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శరత్‌ సూచించారు.

Published : 07 Jul 2024 03:37 IST

హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శరత్‌
ఆదిలాబాద్‌లో అదనపు సివిల్‌ జడ్జి కోర్టు ప్రారంభం 

అదనపు సివిల్‌ జడ్జి కోర్టును ప్రారంభించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శరత్‌.. చిత్రంలో ఆదిలాబాద్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్‌రావు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎన్రాల నగేష్, కలెక్టర్‌ రాజర్షిషా, జిల్లా అదనపు న్యాయమూర్తి శివరాంప్రసాద్‌

ఎదులాపురం, న్యూస్‌టుడే: ఏజెన్సీల్లోని భూ వివాదాలను జిల్లా కలెక్టర్ల వద్దనే పరిష్కరించుకోవచ్చని ఆదిలాబాద్‌ కోర్టుల పోర్ట్‌ఫోలియో జడ్జి అయిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శరత్‌ సూచించారు. శనివారం ఆదిలాబాద్‌ కోర్టు ఆవరణలో జస్టిస్‌ శరత్‌ మొక్కలు నాటి రెండో అదనపు సివిల్‌ జడ్జి కోర్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  ప్రస్తుతం ఏజెన్సీ భూ వివాదాలను ఐటీడీఏ పరిధిలో పరిష్కరించుకుంటున్నారని, ఈ కారణంగా ఆయా జిల్లాల బాధితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కొత్తగా ప్రారంభించిన కోర్టులో న్యాయమూర్తి సూర్యవార్‌ మంజుల మూడు కేసులను పరిశీలించారు. ఒకదాన్ని కొట్టివేసి, రెండింటిని వాయిదా వేశారు. అనంతరం జిల్లా న్యాయమూర్తులతో జస్టిస్‌ శరత్‌ అంతర్గత సమావేశం నిర్వహించి వారికి దిశానిర్దేశం చేశారు. ఆదిలాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎన్రాల నగేష్‌ ఆధ్వర్యంలో ప్రతినిధులు హైకోర్టు న్యాయమూర్తిని సత్కరించి గుస్సాడీ టోపీ అలంకరించారు. కార్యక్రమాల్లో జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్‌రావు, న్యాయమూర్తులు పి.శివరాంప్రసాద్, ప్రమీలా జైన్, సూర్యవార్‌ మంజుల, దుర్గారాణి, హుస్సేన్, కలెక్టర్‌ రాజర్షిషా, డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి సౌజన్య, పీపీ ముస్కు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని