కమ్యూనిటీ వాలంటీర్లతో మధ్యవర్తిత్వం

కమ్యూనిటీ వాలంటీర్లకు మధ్యవర్తిత్వ చట్టాలపై అవగాహన కల్పించి వివాహ వ్యవస్థలోని తగాదాలు పరిష్కరించవచ్చని హైకోర్టు న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట్ర న్యాయసేవా సంస్థ అధ్యక్షుడు జస్టిస్‌ సుజయ్‌ పాల్‌ పేర్కొన్నారు.

Published : 07 Jul 2024 03:38 IST

నిజామాబాద్‌ జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు
హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుజయ్‌ పాల్‌

సమావేశంలో మాట్లాడుతున్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సుజయ్‌ పాల్‌.. వేదికపై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీసుధ, నిజామాబాద్‌ జిల్లా జడ్జి కుంచాల సునీత

నిజామాబాద్‌ న్యాయవిభాగం న్యూస్‌టుడే: కమ్యూనిటీ వాలంటీర్లకు మధ్యవర్తిత్వ చట్టాలపై అవగాహన కల్పించి వివాహ వ్యవస్థలోని తగాదాలు పరిష్కరించవచ్చని హైకోర్టు న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట్ర న్యాయసేవా సంస్థ అధ్యక్షుడు జస్టిస్‌ సుజయ్‌ పాల్‌ పేర్కొన్నారు. శనివారం నిజామాబాద్‌ జిల్లా కోర్టు కాన్ఫరెన్స్‌ హాలులో న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో కమ్యూనిటీ వాలంటీర్లతో నిర్వహించిన సమావేశానికి జస్టిస్‌ సుజయ్‌ పాల్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఇందౌర్‌లో ఏర్పాటుచేసిన ‘కమ్యూనిటీ మధ్యవర్తిత్వ కేంద్రం’ వివాహ వివాదాలకు సంబంధించి 5 వేలకు పైగా కేసులను పరిష్కరించినట్లు వివరించారు. అదే తరహాలో రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా నిజామాబాద్‌ జిల్లాలో కమ్యూనిటీ వాలంటీర్లను ఏర్పాటుచేసి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇక్కడ శిక్షణ పొందిన వారు సామాజిక సేవలో భాగంగా స్థానికంగా మధ్యవర్తిత్వ కేంద్రాలను నెలకొల్పాలని సూచించారు. ‘‘కమ్యూనిటీ మధ్యవర్తిత్వ కేంద్రాల్లోని పెద్దలు న్యాయసేవా సంస్థ అందించే మధ్యవర్తిత్వ చట్టాలపై శిక్షణ పొంది స్వచ్ఛందంగా పనిచేయాలి. కేంద్రాలకు వచ్చే వారి నుంచి డబ్బులు వసూలు చేయొద్దు. వివాహ వ్యవస్థలోని చిన్నచిన్న గొడవలు పెద్దవి కాకుండా పరిష్కరించాలి. చిన్నపిల్లలు తప్పుదోవ పట్టకుండా సన్మార్గంలో నడిచేలా చూడాలి. ఈ కేంద్రాల్లో రాజకీయ నాయకులు, న్యాయవాదులకు అనుమతి లేదు’’ అన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీసుధ మాట్లాడుతూ.. చాలా మంది భార్యాభర్తలు అహంతో కోర్టు మెట్లెక్కి పిల్లలకు దూరమవుతున్నారని అన్నారు. జిల్లా జడ్జి కుంచాల సునీత, తెలంగాణ రాష్ట్ర న్యాయసేవా సంస్థ మెంబర్‌ సెక్రటరీ పంచాక్షరి, జిల్లా జ్యుడిషియల్‌ అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని