బాధ్యతల భారం.. పరిష్కారం దూరం!

రాష్ట్రంలో కాలుష్య సంబంధిత సమస్యలు, ఫిర్యాదులు భారీగా పెరిగిపోతున్నాయి. అయినా. వాటి పరిష్కారానికి కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, ఉద్యోగులు దృష్టి సారించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Published : 07 Jul 2024 03:55 IST

పీసీబీలో సిబ్బంది కొరత
పేరుకుపోతున్న ఫిర్యాదులు
ఖాళీల భర్తీ, అదనపు కార్యాలయాల మంజూరుతోనే ఊరట

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కాలుష్య సంబంధిత సమస్యలు, ఫిర్యాదులు భారీగా పెరిగిపోతున్నాయి. అయినా. వాటి పరిష్కారానికి కాలుష్య నియంత్రణ మండలి అధికారులు, ఉద్యోగులు దృష్టి సారించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ విభాగంలో పెరిగిన ఖాళీలు, పనిభారమే దీనికి కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ కారణంగా సంబంధిత విభాగం అధికారులు జిల్లాల్లో కలెక్టర్లు నిర్వహించే ప్రజావాణి, ఇతర సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు అధికంగా ఉన్న హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, ఆర్‌సీపురం, సంగారెడ్డి ప్రాంతీయ కార్యాలయాల పరిధిలో ఫిర్యాదులు ఎక్కువగా పెరిగినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో అదనంగా రెండు జోనల్, నాలుగు ప్రాంతీయ కార్యాలయాలు కావాలని కాలుష్య నియంత్రణ మండలి(పీసీబీ) ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. 42 పోస్టుల భర్తీకి ప్రతిపాదనలను కూడా కొన్ని నెలల క్రితం పంపింది. గత ప్రభుత్వం 9 నెలల క్రితం 42 పోస్టుల భర్తీకి ఉత్తర్వులిచ్చినా నోటిఫికేషన్‌ రాలేదు. పీసీబీలో రెగ్యులర్‌ పోస్టులు 230 ఉండగా.. ప్రస్తుతం 142 మంది పనిచేస్తున్నారు. 88 ఖాళీల్లో 46 పోస్టులు భర్తీ ప్రక్రియలో ఉన్నాయి. మిగిలిన 42 పోస్టుల భర్తీ అంశం కొలిక్కి రావడం లేదు. రాష్ట్రంలో కీలకమైన హైదరాబాద్‌ ప్రాంతీయ కార్యాలయంలో కీలక పోస్టులో ఓ అధికారి పూర్తి అదనపు బాధ్యతలతో కొనసాగుతున్నారు. ఒక్కో ప్రాంతీయ కార్యాలయంలో ఇద్దరు ఏఈలు ఉండాలి. కానీ ఒక్కొక్కరే ఉన్నారు. దీంతో పని ఒత్తిడికి గురై ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించలేకపోతున్నామని అధికారులు, ఉద్యోగులు వ్యాఖ్యానిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని