రైతు కుటుంబానికి ప్రభుత్వ అండ

రైతు ఆత్మహత్య బాధాకరమని, ఈ ఘటనపై నిష్పాక్షికంగా విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Published : 08 Jul 2024 03:22 IST

ఆత్మహత్య ఘటనపై నిష్పాక్షిక విచారణ: భట్టి విక్రమార్క

రైతు ప్రభాకర్‌ కుటుంబికులతో మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క

చింతకాని, న్యూస్‌టుడే: రైతు ఆత్మహత్య బాధాకరమని, ఈ ఘటనపై నిష్పాక్షికంగా విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, స్థానిక ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ఇటీవల బలవన్మరణానికి పాల్పడ్డ ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరుకు చెందిన రైతు ప్రభాకర్‌ కుటుంబాన్ని ఆయన ఆదివారం పరామర్శించారు. మధిర నియోజకవర్గ ప్రజలంతా తనవాళ్లే అని, రాజకీయాలకు స్థానం లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా భట్టి బాధిత రైతు కుటుంబికులతో మాట్లాడారు. మృతి చెందిన రైతు ప్రభాకర్‌ పిల్లల చదువు విషయంలో ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందన్నారు. వారిని చదివిస్తామని హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేటట్లు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ఆత్మహత్యకు ప్రేరేపించిన వారిపై చర్యలు తీసుకోవటమే కాకుండా, రైతు ప్రభాకర్‌ భూమికి సంబంధించి శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. గ్రామంలో మత్స్య సహకార సంఘం, నీటిపారుదలశాఖ, రెవెన్యూశాఖ అధికారులతో మాట్లాడి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామన్నారు. అనంతరం వివాదాస్పద చెరువు ప్రాంతాన్ని భట్టి పరిశీలించారు. జడ్పీటీసీ మాజీ సభ్యురాలు కూరపాటి తిరీష ఇంటికి మంత్రి వెళ్లారు. ఈ కేసులో తన భర్త కూరపాటి కిశోర్‌ను కావాలని కొందరు ఇరికించారని ఆమె కన్నీరు పెట్టుకున్నారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించిన వారిలో కలెక్టర్‌ ముజమ్మిల్‌ ఖాన్, ఆర్డీఓ గణేశ్, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, విద్యుత్తుశాఖ ఎస్‌ఈ సురేందర్, కాంగ్రెస్‌ నాయకుడు అంబటి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని