యాసంగి వడ్లతో హాస్టళ్లకు సన్నబియ్యం

హాస్టళ్లకు సరఫరా చేసేందుకు పిలిచిన సన్నబియ్యం టెండర్లను పౌరసరఫరాల సంస్థ పక్కన పెట్టింది. యాసంగి సీజన్‌లో రైతుల నుంచి సేకరించిన వడ్లను ఇందుకు ఉపయోగిస్తోంది.

Published : 08 Jul 2024 03:22 IST

ఈనాడు, హైదరాబాద్‌: హాస్టళ్లకు సరఫరా చేసేందుకు పిలిచిన సన్నబియ్యం టెండర్లను పౌరసరఫరాల సంస్థ పక్కన పెట్టింది. యాసంగి సీజన్‌లో రైతుల నుంచి సేకరించిన వడ్లను ఇందుకు ఉపయోగిస్తోంది. ఈ మేరకు వచ్చిన సన్న ధాన్యాన్ని మిల్లింగ్‌ చేయించి బియ్యాన్ని హాస్టళ్లకు పంపించే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. జులై నెలకు సంబంధించి 15 వేల టన్నుల సన్న బియ్యాన్ని మధ్యాహ్న భోజన పథకం, ఐసీడీఎస్, హాస్టళ్లకు పంపించింది. రైతుల నుంచి యాసంగి సీజన్‌లో పౌర సరఫరాల సంస్థ రాష్ట్రవ్యాప్తంగా 48 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించింది. ధర ఎక్కువ ఉండటంతో సన్న వడ్లను రైతులు ఎక్కువగా ప్రైవేటులో విక్రయించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన సన్న వడ్లలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోనే ఎక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. పౌరసరఫరాల సంస్థలో ఓ సీనియర్‌ అధికారికి సంస్థ బాధ్యతలు అప్పగించింది. ఆ రెండు జిల్లాల్లో సేకరించిన సన్న ధాన్యం బస్తాలను గుర్తించి వాటిని కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ (సీఎంఆర్‌) చేయిస్తున్నారు. వాస్తవానికి యాసంగి వడ్ల సీఎంఆర్‌కు కొంత సమయం పడుతుంది. ప్రస్తుతం గత ఏడాది వానాకాలం వడ్ల మిల్లింగ్‌ నడుస్తోంది. హాస్టళ్లకు సన్నబియ్యం అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రెండు జిల్లాల్లో వచ్చిన సన్న వడ్లను ప్రాధాన్యతతో సీఎంఆర్‌ చేయిస్తున్నారు. అక్కడి నుంచి 15 వేల టన్నుల సన్న బియ్యాన్ని రాష్ట్రవ్యాప్తంగా హాస్టళ్లకు, మధ్యాహ్నభోజన పథకం స్కూళ్లకు తరలించారు.

3 నెలలకు 50 వేల టన్నులు..

వచ్చే మూడు నెలలకు సంబంధించి మరో 50 వేల టన్నుల సన్నబియ్యాన్ని సిద్ధం చేయించడంపై పౌరసరఫరాల సంస్థ దృష్టి పెట్టింది. ఆ తర్వాత వచ్చే వానాకాలం ధాన్యం పంటతో సన్నబియ్యాన్ని సర్దుబాటు చేయాలని  సంస్థ భావిస్తోంది. సన్నబియ్యం కొనుగోలుకు సంస్థ మార్చిలో టెండర్లు పిలిచింది. 10 నెలలకు 2.20 లక్షల టన్నులు అవసరమని అంచనా వేసింది. ఈ టెండర్లలో పాల్గొన్న సంస్థలు ధర అధికంగా కోట్‌ చేశాయి.దీంతో ప్రభుత్వం ఆ టెండర్లను పక్కన పెట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని