9 నెలలుగా జీతాలు లేవు!

రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో విధులు నిర్వర్తించే బహుళవిధ కార్మికుల (మల్టీపర్పస్‌ వర్కర్స్‌) పరిస్థితి దయనీయంగా మారింది.

Published : 08 Jul 2024 03:25 IST

దయనీయ స్థితిలో బహుళవిధ కార్మికులు
వేతనాల్లేకుండానే పనులు

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో విధులు నిర్వర్తించే బహుళవిధ కార్మికుల (మల్టీపర్పస్‌ వర్కర్స్‌) పరిస్థితి దయనీయంగా మారింది. అధికశాతం గ్రామ పంచాయతీల్లో 9 నెలలుగా వేతనాలు అందక వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రాష్ట్రంలో 12,769 పంచాయతీల్లో 51,308 మంది బహుళవిధ కార్మికులుగా 2018 నుంచి పనిచేస్తున్నారు. వారికి నెలనెలా రూ.9,500 జీతం చెల్లిస్తున్నారు. బహుళవిధ కార్మికుల వేతనాలకు ప్రత్యేక పద్దు లేదు. వారి జీతాలను ఆయా పంచాయతీలే భరించాలని ప్రభుత్వం నిర్దేశించింది. పంచాయతీలకు ఆదాయం ఉంటే సాధారణ నిధి(జనరల్‌ ఫండ్‌)లో జమ చేసి అందులోంచి వేతనాలు ఇస్తున్నాయి. రాష్ట్రంలో 95 శాతం పంచాయతీలకు ఇంటిపన్నుల వసూళ్లు మినహా ఇతర ఆదాయ వనరులు లేవు. గత ఏడాది అక్టోబరులో ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక పంచాయతీలకు రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు నిలిచిపోయాయి. కేంద్ర ఆర్థిక సంఘం నిధులూ విడుదల కాలేదు. దీంతో  కార్మికులకు జీతాల విషయంలో పంచాయతీలు చేతులెత్తేశాయి. కోడ్‌ ముగిసిన తర్వాత నిధులు విడుదలవ్వలేదు.  జనవరిలో పంచాయతీ సర్పంచుల పదవీకాలం ముగిసింది. పాలకవర్గాలు లేవనే కారణంతో ఫిబ్రవరి నుంచి కేంద్రం నిధులివ్వడం లేదు. ట్రాక్టర్‌కు డీజిల్, విద్యుత్‌ బిల్లుల చెల్లింపులు, పంచాయతీల్లో క్లోరిన్, బ్లీచింగ్‌పౌడర్, డంపింగ్‌ షెడ్‌ సామగ్రిని, కాగితాలు, లెడ్జర్ల వంటి వాటికి కటకట ఏర్పడింది. నిధులందకపోయినా అత్యవసరం అంటూ ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో ఖర్చులను కార్యదర్శులే భరిస్తున్నారు.  

కార్మికుల అగచాట్లు 

రోజూ తెల్లవారుజాము నుంచే కార్మికులు విధుల్లో చేరుతున్నారు. రోడ్లు, మురుగుకాల్వలను పరిశుభ్రం చేయడం, చెత్త తొలగింపుతో పాటు మొక్కలకు నీళ్లు పోయడం, మంచినీటి సరఫరా, సాయంత్రం వేళల్లో వీధి లైట్లు వేయడం, మళ్లీ ఉదయం ఆర్పడం, ట్రాక్టర్‌ నడపడం వంటి పనులు చేస్తున్నారు. మొదట్లో నెల, రెండు నెలల వేతనాలు అందక వారికి కష్టాలు మొదలయ్యాయి. సర్పంచుల పాలన సమయంలో వారిని బతిమిలాడి డబ్బులు తీసుకునేవారు. ఇప్పుడు వారు కూడా లేకపోవడంతో వారికి ఎవరూ డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు. ప్రభుత్వం తమకు జీతాలు చెల్లించి న్యాయం చేయాలని  కారోబార్ల సంఘం నేత, గ్రామ పంచాయతీ కార్మికుడు పూస శంకర్‌ కోరుతున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని