కొర్లపహాడ్‌ వద్ద ట్రామాకేర్‌ సెంటర్‌

రహదారి ప్రమాదాల్లో బాధితులకు అందించే అత్యవసర వైద్య సేవల్లో తొలిగంట(గోల్డెన్‌అవర్‌) అత్యంత కీలకం. సకాలంలో సరైన వైద్యం అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చు.

Published : 08 Jul 2024 03:27 IST

సీఎస్‌ఆర్‌ కింద ఏడీపీ సంస్థ సహకారం
నేడు మంత్రి కోమటిరెడ్డిచే శంకుస్థాపన 

ఈనాడు, హైదరాబాద్‌: రహదారి ప్రమాదాల్లో బాధితులకు అందించే అత్యవసర వైద్య సేవల్లో తొలిగంట(గోల్డెన్‌అవర్‌) అత్యంత కీలకం. సకాలంలో సరైన వైద్యం అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చు. ఇందులో భాగంగా తొలిసారిగా జాతీయ రహదారిపై ట్రామాకేర్‌ సెంటర్‌ ఏర్పాటుకు అమెరికాకు చెందిన ఏడీపీ సంస్థ ముందుకు వచ్చింది. హైదరాబాద్‌లోని ఏడీపీ ప్రైవేటు లిమిటెడ్‌ సంస్థ కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద తెలంగాణలో నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం కొర్లపహాడ్‌ వద్ద ఈ ఆసుపత్రిని నిర్మించనుంది. ఈ ట్రామాకేర్‌ సెంటర్‌ నిర్మాణానికి సోమవారం రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. తెలంగాణ ప్రాంతంలో విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిపై ఏటా 200-300 మంది వరకు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ హైవేపై ట్రామాకేర్‌ సెంటర్‌ ఏర్పాటు కోసం ఎప్పటినుంచో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల జాతీయ రహదారుల విషయమై కేంద్ర మంత్రి గడ్కరీని కలిసిన ఆయన విజయవాడ-హైదరాబాద్‌ హైవేపై ప్రమాదాలను తగ్గించేందుకు రహదారిని ఆరువరుసలకు పెంచడంతో పాటు ట్రామాకేర్‌ సెంటర్‌ ఏర్పాటు గురించి కూడా చర్చించారు. ఈ నేపథ్యంలో సామాజిక బాధ్యత కింద జాతీయ రహదారిపై కొర్లపహాడ్‌ వద్ద అత్యాధునిక వైద్య సదుపాయాలతో కూడిన ట్రామాకేర్‌ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ఏడీపీ సంస్థ పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు