సంక్షిప్త వార్తలు

ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ సజావుగా సాగేందుకు వీలుగా వైద్య, ఆరోగ్యశాఖలో ఏడు కమిటీలను ఏర్పాటు చేస్తూ ఆ శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్‌ చోంగ్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Updated : 08 Jul 2024 04:12 IST

వైద్య, ఆరోగ్యశాఖలో బదిలీలకు కమిటీలు

ఈనాడు, హైదరాబాద్‌: ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ సజావుగా సాగేందుకు వీలుగా వైద్య, ఆరోగ్యశాఖలో ఏడు కమిటీలను ఏర్పాటు చేస్తూ ఆ శాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్‌ చోంగ్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కేడర్, సబ్‌ కేడర్‌లు సహా వేర్వేరు ప్రత్యేకతలున్న నేపథ్యంలో కమిటీలు ఆయా విభాగాల్లో బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్, వైద్యవిద్య డైరెక్టర్, ప్రజారోగ్యశాఖ డైరెక్టర్, వైద్య విధాన పరిషత్‌ కమిషనర్, ఆయుష్‌ డైరెక్టర్, ఔషధ నియంత్రణ మండలి డైరెక్టర్‌ జనరల్, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ (ఐపీఎం) విభాగాల కోసం ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ల నేతృత్వంలో ఈ కమిటీలను ఏర్పాటు చేశారు. బదిలీలపై ఆర్థికశాఖ ఈ నెల 3న జారీ చేసిన జీవోలోని మార్గదర్శకాలను పాటించాలని స్పష్టం చేశారు.


245 మందికి పదోన్నతులు

బోధనాసుపత్రుల్లోని 245 మంది అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు అసోసియేట్‌ ప్రొఫెసర్లుగా పదోన్నతి కల్పించారు. ఈ మేరకు ఆదివారం వైద్యవిద్య డైరెక్టర్‌ ఎన్‌.వాణి ఆధ్వర్యంలో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. అసోసియేట్‌ ప్రొఫెసర్లకు ప్రొఫెసర్లుగా పదోన్నతులిచ్చేందుకు డీపీసీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. బోధనాసుపత్రుల్లో ఏడు విభాగాలకు సంబంధించి డీపీసీ సమావేశాలు పూర్తికాగా 56 మంది ప్రొఫెసర్లుగా పదోన్నతి పొందారు. మరో 14 విభాగాలకు సంబంధించి డీపీసీ సమావేశం సోమవారం జరగనుంది.


సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా డి.యాదగిరి

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగులు ఆదివారం హైదరాబాద్‌లోని టీఎన్‌జీవో భవన్‌లో సమావేశమై నూతన కమిటీని ఎన్నుకున్నారు. సంఘం నూతన అధ్యక్షుడిగా డి.యాదగిరి, ప్రధాన కార్యదర్శిగా జాన్సీ సౌజన్య, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా అనిల్‌చారి, కార్యవర్గ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని సంఘం ఒక ప్రకటనలో కోరింది.


బోగస్‌ పింఛనుదారుల ఏరివేత షురూ..

ఆదిలాబాద్‌ పాలనాప్రాంగణం, భీంపూర్, న్యూస్‌టుడే: ఆదిలాబాద్‌ జిల్లాలో బోగస్‌ పింఛన్ల ఏరివేత ప్రారంభమైంది. తొలుత రెండు పింఛన్లు పొందుతున్న వారి జాబితాను అధికారులు సిద్ధం చేశారు. అలాంటి వారికి ‘చేయూత’ పథకాన్ని నిలిపివేస్తూ జూన్‌ 27న డైరెక్టర్‌ ఆఫ్‌ ట్రెజరీస్‌ అండ్‌ అకౌంట్్స విభాగం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఆ ఉత్తర్వులు జిల్లా ఖజానాశాఖకు చేరాయి. గత భారాస ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, దివ్యాంగుల కోసం ఆసరా పేరిట పింఛన్లు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే వీటిని ఫ్యామిలీ పెన్షన్‌ పొందే ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబీకులు కూడా పొందుతున్నట్లు గుర్తించారు. నకిలీలను గుర్తించేందుకు ప్రభుత్వ పెన్షనర్ల డేటాను ఆసరా పింఛనుదారుల డేటాతో అనుసంధానించడంతో ఈ గుట్టు బయటపడింది. 2014 నవంబరు నుంచి ఒక్క ఆదిలాబాద్‌ జిల్లాలోనే 155 మంది ఫ్యామిలీ, ఆసరా పింఛన్లు పొందినట్లు ఆధార్‌ అనుసంధానంతో వెలుగులోకి వచ్చింది. ఇందులో ఓ వ్యక్తి అత్యధికంగా రూ.2,68,928 అక్రమంగా పొందారని తేలింది. దుర్వినియోగమైన సొమ్మును రికవరీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 


తుంగభద్రకు పెరిగిన వరద

ఈనాడు, హైదరాబాద్‌: కర్ణాటక రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో తుంగభద్ర నదిలో ప్రవాహం పెరిగింది. దీంతో ఆదివారం తుంగభద్ర ప్రాజెక్టుకు వరద జలాలు చేరుతున్నాయి. ఈ జలాశయంలో రెండు రోజుల క్రితం 19 వేల క్యూసెక్కుల ప్రవాహం నమోదు కాగా.. ఇప్పుడు అది 50,715 క్యూసెక్కులు పెరిగింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం 105.79 టీఎంసీలకు గాను 18.25 టీఎంసీలకు చేరింది. కృష్ణా నదికి తుంగభద్ర ఉపనది కావడంతో తుంగభద్ర ప్రాజెక్టు నిండితే అక్కడి నుంచి విడుదల చేసే నీరంతా శ్రీశైలం జలాశయానికి చేరుకుంటుంది. మరోవైపు కర్ణాటకలో కృష్ణా నదికి కూడా ప్రవాహం పెరిగింది. ఆలమట్టి ప్రాజెక్టులోకి 59 వేల క్యూసెక్కుల వరద వస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలు కాగా.. 61.06 టీఎంసీల వద్ద నీరు ఉంది. జూరాల ప్రాజెక్టుకు 1821 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు. 7.54 టీఎంసీల జలాలు నిల్వ ఉన్నాయి. గోదావరి పరీవాహకంలో ప్రవాహాలు లేవు. ఏపీలోని ధవళేశ్వరం(గోదావరి డెల్టా) బ్యారేజీ వద్ద 40 వేల క్యూసెక్కుల ప్రవాహం నమోదవుతోంది. ఇక్కడి నుంచి 28 వేల క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.


నేటి నుంచి ఆర్జీయూకేటీలో  ప్రవేశాలకు కౌన్సెలింగ్‌

ముథోల్‌(బాసర), న్యూస్‌టుడే: బాసర ఆర్జీయూకేటీలో పీయూసీ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి ఎంపికైన విద్యార్థులకు సోమవారం నుంచి మూడు రోజుల పాటు కౌన్సెలింగ్‌ జరగనుందని ఇన్‌ఛార్జి ఉపకులపతి వెంకటరమణ తెలిపారు. మొదటి, రెండో రోజు 500 మంది చొప్పున, మూడో రోజు 404 మందికి కౌన్సెలింగ్‌ ఉంటుందన్నారు. ఉదయం 8 గంటల నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభమవుతుందన్నారు. 


భలేగా.. తీగ బొప్పాయి 

ఈ ఫొటోలో కనిపిస్తున్న పొడవాటి తీగలకు సొరకాయలు కాశాయి అనుకుంటే పొరపాటే. అవి తీగ బొప్పాయి చెట్లకు కాసిన కాయలు. సాధారణంగా బొప్పాయి చెట్టుకు అనుకొని కాయలు కాస్తుంటాయి. కానీ ఈ మూడు బొప్పాయి చెట్లు మాత్రం పొడవాటి తీగలతో కాయలను విరగకాశాయి. ఈ చెట్లు కుమురం భీం జిల్లా కెరమెరి మండలంలోని పరందోలి గ్రామంలో పవర్‌ రమేశ్‌ ఇంటి ఆవరణలో పెరిగి చూపరులను ఆకట్టుకుంటున్నాయి. పక్షులు తెచ్చి పడేసిన విత్తనాలతో ఈ చెట్లు పెరిగాయని రమేశ్‌ చెబుతున్నారు. ఈ విషయమై జిల్లా డివిజినల్‌ ఉద్యాన అధికారి మహేశ్‌ను సంప్రదించగా.. అడవిలో ఇలాంటి తీగ జాతి బొప్పాయి చెట్లు అరుదుగా పెరుగుతాయని తెలిపారు. 

ఈనాడు, ఆదిలాబాద్‌; న్యూస్‌టుడే, కెరమెరి


పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడిగా బోనగిరి మధు

నల్లకుంట, న్యూస్‌టుడే: ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీడీఎస్‌యూ) రాష్ట్ర నూతన కమిటీని కౌన్సిల్‌ సమావేశంలో ఎన్నుకున్నట్లు సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మామిడికాయల పరశురామ్‌ ఆదివారం తెలిపారు. రాష్ట్ర అధ్యక్షుడిగా మహబూబాబాద్‌కు చెందిన బోనగిరి మధు, ప్రధాన కార్యదర్శిగా హైదరాబాద్‌కు చెందిన పొడపంగి నాగరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా ప్రణయ్‌(భద్రాద్రి కొత్తగూడెం), మంద నవీన్‌(హైదరాబాద్‌), సహాయ కార్యదర్శులుగా నర్సింహారెడ్డి(సంగారెడ్డి), అజయ్‌(వరంగల్‌), కోశాధికారిగా మహేశ్‌(యాదాద్రి భువనగిరి)లను ఎన్నుకున్నామన్నారు. విద్యార్థి, నిరుద్యోగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. 


మూడు గ్రామ పంచాయతీలుగా భద్రాచలం!

భద్రాచలం, బూర్గంపాడు, న్యూస్‌టుడే: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పట్టణాన్ని భద్రాచలం, సీతారామనగర్, శాంతినగర్‌ గ్రామపంచాయతీలుగా, బూర్గంపాడు మండలం సారపాక పట్టణాన్ని సారపాక, ఐటీసీ గ్రామపంచాయతీలుగా విభజించినట్లు తెలిసింది. రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ ప్రతిపాదించిన బిల్లుకు రాష్ట్ర గవర్నర్‌ రాధాకృష్ణన్‌ గత శనివారం సంతకం చేసినట్లు సమాచారం. దక్షిణ అయోధ్యగా విలసిల్లుతున్న భద్రాచలంతోపాటు సారపాకను మున్సిపాలిటీగా మారుస్తారన్న ఊహాగానాలతో 2018లో ఆ రెండింటికి పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదు. పురపాలిక ఎన్నికల్లోనూ వీటి ఊసే లేదు. ప్రస్తుతం ప్రత్యేకాధికారుల పాలనలోనే ఈ రెండు పట్టణాలు కొనసాగుతున్నాయి.  


‘అన్నారం’ పరీక్షలకు వర్షం ఆటంకం

కాళేశ్వరం, న్యూస్‌టుడే: కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం సరస్వతి బ్యారేజీ రెండో దశ జియో ఫిజికల్‌ పరీక్షలకు ఆదివారం వర్షం కారణంగా ఆటంకం ఏర్పడింది. మొదటి దశ పరీక్షలు జూన్‌ 21న ప్రారంభం కాగా 15 రోజుల పాటు నిర్వహించారు. రెండో దశ పరీక్షలకు శాస్త్రవేత్తలు డాక్టర్‌ మందిర, సంతోష్‌కుమార్‌ రంగా, రమేశ్‌ బాస్కేలు ఆదివారం మధ్యాహ్నం అన్నారం బ్యారేజీకి చేరుకోగా వర్షం వల్ల అంతరాయం ఏర్పడింది. ఈ శాస్త్రవేత్తల బృందం పర్యవేక్షణలో సోమవారం నుంచి తిరిగి పరీక్షలు కొనసాగనున్నాయి.


ప్రాథమిక పాఠశాలల్లో హెడ్‌మాస్టర్‌ పోస్టులుండాలి
డీటీఎఫ్‌ వినతి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ప్రతి ప్రాథమిక పాఠశాలకు ప్రధానోపాధ్యాయ పోస్టును మంజూరు చేయాలని, సెకండరీ గ్రేడ్‌ టీచర్లకు పదోన్నతులు కల్పించి వారితో భర్తీ చేయాలని డెమోక్రటిక్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌(డీటీఎఫ్‌) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సోమయ్య, లింగారెడ్డిలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన డీటీఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారు. ప్రతి పాఠశాలకు స్వచ్ఛ కార్మికులను నియమించాలని, పాఠశాలల కరెంటు బిల్లులు ప్రభుత్వమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. తరగతులు ప్రారంభమై 20 రోజులు దాటుతున్నా విద్యార్థులందరికీ సరిపడా పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్‌లు అందలేదని, వెంటనే పంపిణీ చర్యలు చేపట్టాలని కోరారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని