మహిళలకు... పాడి పశువులు, కోళ్ల ఫారాలు

రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలకు మహిళాశక్తి పథకం కింద పాడి పశువులు, దేశవాళీ కోళ్ల పెంపకం, పౌల్ట్రీ ఫారాలు, పాడి ఉత్పత్తుల విక్రయ కేంద్రాలు, సంచార చేపల విక్రయ కేంద్రాలను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

Published : 08 Jul 2024 03:29 IST

మిల్క్‌పార్లర్లు, సంచార చేపల విక్రయ కేంద్రాలు కూడా
మహిళాశక్తి పథకం కింద మంజూరుకు ప్రభుత్వ నిర్ణయం  

ఈనాడు,హైదరాబాద్‌: రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలకు మహిళాశక్తి పథకం కింద పాడి పశువులు, దేశవాళీ కోళ్ల పెంపకం, పౌల్ట్రీ ఫారాలు, పాడి ఉత్పత్తుల విక్రయ కేంద్రాలు, సంచార చేపల విక్రయ కేంద్రాలను మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా యూనిట్ల నిర్వహణకు బ్యాంకులు, స్త్రీనిధి, మండల మహిళాసమాఖ్య ద్వారా రుణ సాయం అందిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాల్లో అర్హులైన వారిని వీటి కోసం ఎంపిక చేయాలని తాజాగా  జిల్లా కలెక్టర్లను ఆదేశించింది.    

పాడి పశువులు: ప్రతి జిల్లాకు రూ.4.50 కోట్లతో 500 మంది మహిళా సమాఖ్యల సభ్యురాళ్లకు పాడిపశువుల యూనిట్లు ఇస్తారు. రూ.90 వేల రుణ సాయంతో ఒక్కో సభ్యురాలికి ఒకటి లేదా రెండు పాడిపశువులను కొనుగోలు చేసి ఇస్తారు. గ్రామ పరిధిలోని మహిళా సమైక్య సంఘంలో వారు సభ్యురాళ్లై ఉండాలి. పశువుల పెంపకానికి, జీవనానికి అనువైన వాతావరణం ఉన్న గ్రామాల్లోని వారికే వీటిని మంజూరు చేస్తారు. 

నాటుకోళ్ల పెంపకం యూనిట్లు: ఒక్కో జిల్లాలో రూ.3కోట్లతో రెండువేల మందికి వీటిని మంజూరు చేస్తారు. మహిళా సంఘంలోని సభ్యురాళ్లకు ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున రుణసాయం చేస్తారు. దీనికింద 20 లేదా 50 లేదా 100 దేశవాళీ కోళ్లను ఇంటి వద్దే పెంచుకోవచ్చు.

కోళ్ల ఫారాలు: ప్రతి జిల్లాలో మండలానికి ఒకటి చొప్పున మంజూరు చేస్తారు. యూనిట్‌కు రూ.2.91 లక్షల రుణం ఇస్తారు. సొంత స్థలం ఉండి షెడ్డు వేసుకొని పారం ఏర్పాటు చేసుకునేందుకు ముందుకొచ్చే వారిని ఎంపిక చేస్తారు. వారికి నిర్వహణపై శిక్షణ ఇచ్చిన అనంతరం రుణం మంజూరు చేస్తారు. 

పాల విక్రయ కేంద్రాలు (మిల్క్‌పార్లర్లు): మండలానికి ఒకటి చొప్పున మహిళా సంఘాలకు వీటిని మంజూరు చేస్తారు. బస్టాండ్లు, రైల్వే స్షేషన్లు, సినిమాథియేటర్లు, రైతు బజార్లు ఉండే ప్రాంతాల్లోని సంఘాల సభ్యురాళ్లకు అవకాశం కల్పిస్తారు. ఒక్కో పార్లర్‌ ఏర్పాటుకు రూ. 1.90 లక్షల రుణం అందిస్తారు. 

సంచార చేపల విక్రయ కేంద్రాలు: ఒక్కో యూనిటుకు రూ.10 లక్షల చొప్పున మండలానికి ఒకటి ఇస్తారు. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి మత్య్స సంపత్‌ యోజన కింద 60 శాతం సబ్సిడీ లభిస్తుంది. వాహనం కొనుగోలుతో పాటు చేపల నిల్వ, విక్రయాలు, శుద్ధి, వంట ఉత్పత్తుల తయారీ పరికరాలు, పాత్రలను సమకూర్చుకోవాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని