సర్వమత స్వేచ్ఛ, భావజాల వ్యాప్తికి ప్రభుత్వం సహకరిస్తుంది

రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలందరిదని, మతసామరస్యాన్ని కాపాడడంతోపాటు సర్వమతాలకు స్వేచ్ఛ, వారి భావజాలాన్ని వివరించుకునేందుకు అవకాశం కల్పిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

Updated : 08 Jul 2024 04:11 IST

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌- న్యూస్‌టుడే, రాంనగర్‌: రాష్ట్రంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలందరిదని, మతసామరస్యాన్ని కాపాడడంతోపాటు సర్వమతాలకు స్వేచ్ఛ, వారి భావజాలాన్ని వివరించుకునేందుకు అవకాశం కల్పిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. ఆషాఢ మాసం ప్రారంభం సందర్భంగా ఇస్కాన్‌ దేవాలయం(అబిడ్స్‌) ఆధ్వర్యంలో చేపట్టిన జగన్నాథ రథయాత్రను ఆదివారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో ఆయన ప్రారంభించారు. జగన్నాథునికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతోపాటు చీపురుతోనూ రథం ముందు శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల సుభిక్షం కోసం చేపట్టే ఈ యాత్రలో పాల్గొనడం ద్వారా మంచి అనుభూతి కలిగిందన్నారు. రాష్ట్రం ప్రశాంతంగా, సస్యశ్యామలంగా, సుఖశాంతులతో వర్ధిల్లాలని ఇస్కాన్‌ సంస్థ చేసే ప్రార్థనలు ఫలిస్తాయని బలంగా విశ్వసిస్తున్నానని చెప్పారు. ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించడం ద్వారా అందరూ సమానమే, మానవసేవే మాధవసేవ అనే సందేశాలు విస్తరింపజేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ప్రస్తుత సమాజంలో హింస, మత్తుపదార్థాల వాడకం పెరుగుతున్న క్రమంలో ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా మార్పు వస్తుందని పేర్కొన్నారు. అనంతరం నిర్వాహకులు ఆయన్ను ఘనంగా సత్కరించారు. ఆ తర్వాత రథయాత్ర అక్కడి నుంచి నాంపల్లి ఎగ్జిబిషన్‌ మైదానానికి బయలుదేరింది. కార్యక్రమంలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు అంజన్‌కుమార్‌ యాదవ్, రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌ యాదవ్, యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అరవింద్‌కుమార్‌ యాదవ్, ఇస్కాన్‌ దేవాలయం అధ్యక్షులు వేదాంత చైతన్యరాజ్, సీతారాందాస్, రాధేశ్యామ్‌దాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని