నాలుగేళ్ల సర్వీసుంటే దంపతులకూ స్థానచలనం

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలపై జారీచేసిన ఉత్తర్వుల్లోని సందేహాలపై ఆర్థికశాఖ వర్గాలు స్పష్టతనిచ్చాయి. గతంలో అమలైన విధానమే వర్తిస్తుందని పేర్కొన్నాయి.

Updated : 08 Jul 2024 07:12 IST

నగరంలోనే తిష్ఠ వేస్తామంటే కుదరదు
సాధారణ బదిలీలపై ఆర్థికశాఖ స్పష్టీకరణ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలపై జారీచేసిన ఉత్తర్వుల్లోని సందేహాలపై ఆర్థికశాఖ వర్గాలు స్పష్టతనిచ్చాయి. గతంలో అమలైన విధానమే వర్తిస్తుందని పేర్కొన్నాయి. దీని ప్రకారం ఒకేచోట నాలుగేళ్ల నుంచి పనిచేసినవారందరినీ కచ్చితంగా బదిలీ చేయాల్సి ఉంటుందని వివరించాయి. వీరిలో భార్యాభర్తలున్నా తప్పనిసరిగా స్థానచలనం కలిగించాల్సి ఉంటుందని, అలా మార్చినప్పుడు కొత్త ప్రాంతాల్లో దగ్గరగా ఉండేలా వారికి పోస్టింగులు ఉండాలని పేర్కొన్నాయి. బదిలీల విషయంలో పలు శాఖల ఉద్యోగులు మినహాయింపులు, సందేహాలను వ్యక్తం చేస్తూ ఆర్థికశాఖను వివరణ అడుగుతున్నారు. దీనిపై 2018లో సాధారణ బదిలీల సందర్భంగా జారీచేసిన ‘సర్క్యులర్‌ మెమో నంబరు 2934-ఏ’ ప్రకారం నిబంధనలు అనుసరించాలని ఆర్థికశాఖ సూచించింది. ఈ మెమోలో 8వ నిబంధన ప్రకారం.. ప్రస్తుతం నాలుగేళ్ల సర్వీసు పూర్తిచేసిన భార్యాభర్తలుంటే వారిని బదిలీ చేయాలి. 

‘స్పౌజ్‌’ను గ్రామీణ ప్రాంతానికీ పంపించవచ్చు.. 

చాలామంది ఉద్యోగ దంపతుల్లో ఒకరు నగరంలో, మరొకరు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్నారు. వీరంతా తమ జీవిత భాగస్వామి నగరంలో పనిచేస్తున్నందున తమను కూడా అక్కడికే బదిలీ చేయాలని ‘స్పౌజ్‌ కేస్‌’ నిబంధన కింద గట్టిగా అడుగుతున్నారు. ఇలా అడిగేవారిని కచ్చితంగా నగరానికి బదిలీ చేయాల్సిన అవసరం లేదని, నగరంలో ఉన్నవారినే గ్రామీణ ప్రాంతానికి మార్చవచ్చని నిబంధనలు చెపుతున్నాయి. 

వేర్వేరు శాఖల్లోని ఉద్యోగ దంపతులు నగరంలో 20 ఏళ్లుగా పనిచేస్తున్న వారున్నారు. రెండు శాఖల మధ్య సమన్వయలోపాన్ని ఆసరాగా చేసుకుని వారు స్పౌజ్‌ కేసు నిబంధనను అనుకూలంగా మార్చుకుని నగరంలోనే 20 ఏళ్లుగా కొనసాగుతున్నారు. నిబంధనల ప్రకారం వేర్వేరు శాఖల్లో పనిచేస్తున్నా.. ఇద్దరికీ నగరంలో నాలుగేళ్ల సర్వీసు పూర్తయితే కచ్చితంగా ఇతర ప్రాంతాలకు బదిలీ చేయాలి. అలా చేసే సమయంలో మాత్రమే స్పౌజ్‌ కేసులు పరిగణనలోకి తీసుకుని వారికి గ్రామీణ ప్రాంతాల్లో ఒకే చోట పోస్టింగ్‌ ఇవ్వాల్సిన అవసరం ఉంది. 

డిప్యుటేషన్‌నూ పరిగణించాల్సిందే..

పలువురు ఉద్యోగులు గ్రామీణ ప్రాంతాల్లో రెగ్యులర్‌ పోస్టులో ఉంటూ డిప్యుటేషన్‌పై వచ్చి నగరంలో పనిచేస్తున్నారు. సాధారణ బదిలీకి గ్రామీణ ప్రాంతంలోని రెగ్యులర్‌ సర్వీసును మాత్రమే పరిగణనలోకి తీసుకుని ఇప్పుడు నగరంలో పోస్టింగ్‌ ఇవ్వాలని ఒత్తిడి తెస్తున్నారు. పైగా వారి జీవిత భాగస్వామి కూడా స్పౌజ్‌ నిబంధన కింద నగరానికి పంపాలని అడుగుతున్నారు. డిప్యుటేషన్‌పై ఉద్యోగి నాలుగేళ్లపాటు ఎక్కడ పనిచేస్తే దానిని అక్కడి సర్వీసుగానే పరిగణించి సదరు ఉద్యోగికి అదే ప్రాంతంలో మళ్లీ సాధారణ బదిలీ కింద పోస్టింగు ఇవ్వవద్దని ఆర్థికశాఖ మెమోలో వివరణ ఇచ్చింది. 

మొత్తం పోస్టుల్లో 40 శాతం కాదు...

సాధారణ బదిలీలు ఒక శాఖలో ఒక కేడర్‌లో 40 శాతానికి మించకుండా చూడాలనే నిబంధన విధించింది. ఉదాహరణకు.. ఒక శాఖలో ఒక కేడర్‌లో మొత్తం మంజూరైన పోస్టులు వంద ఉంటే వీటిలో 60 ఖాళీలున్నాయనుకోండి. మిగిలిన 40 మంది ఉద్యోగులు(వర్కింగ్‌ స్ట్రెంగ్త్‌) పనిచేస్తున్నారనుకోండి. 40 శాతం నిబంధన కింద 40 మందిలో 16 మందిని మాత్రమే బదిలీ చేయాలని ఆర్థికశాఖ 2018 మెమోలోనే వివరణ ఇచ్చింది. మొత్తం పనిచేస్తున్న 40 మందినీ బదిలీచేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని