సంక్షిప్త వార్తలు

రాష్ట్రంలోని ములుగు జిల్లా మంగపేటలో సోమవారం అత్యధికంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.

Updated : 09 Jul 2024 02:50 IST

పలు జిల్లాల్లో భారీ వర్షాలు 

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ములుగు జిల్లా మంగపేటలో సోమవారం అత్యధికంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కుమురం భీం జిల్లా ఆసిఫాబాద్‌లో 8, ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌లో 7.4, భూపాలపల్లి జిల్లా భూపాలపల్లిలో 6.9, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూర్లబయ్యారంలో 5.7 సెం.మీ. వర్షం కురిసింది. హనుమకొండ, జగిత్యాల, గద్వాల, నిర్మల్‌ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది. 


ఆలమట్టికి పెరుగుతున్న వరద

ఈనాడు, హైదరాబాద్‌: కర్ణాటకలో కురుస్తున్న వర్షాలకు కృష్ణానదిలో ప్రవాహం పెరిగి ఆలమట్టి ప్రాజెక్టులోకి వరద పెరుగుతోందని కేంద్ర జల సంఘం సోమవారం ఒక బులిటెన్‌లో తెలిపింది. ఈ ప్రాజెక్టులో ప్రవాహం ఆదివారం 59 వేల క్యూసెక్కులు ఉండగా.. సోమవారం సాయంత్రానికి 88 వేల క్యూసెక్కులను దాటింది. మంగళవారం ఉదయం వరకు 7.63 టీఎంసీల సామర్థ్యం గల వరద ఆలమట్టికి చేరుతుందని సీడబ్ల్యూసీ అంచనా వేసింది.తుంగభద్ర ప్రాజెక్టుకూ 30 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది.


కులగణన తర్వాతే ‘స్థానిక’ ఎన్నికలు నిర్వహించాలి 

మంత్రి సీతక్కకు జాజుల వినతి

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో సమగ్ర కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మంత్రి సీతక్కను బీసీ సంక్షేమ సంఘం జాతీయాధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ కోరారు. సోమవారం సచివాలయంలో సంఘం నేతలు శ్రీనివాస్, విక్రం, శ్యామ్, మణిమంజరి, నగేష్, మహేశ్‌ నరసింహనాయక్‌ తదితరులతో సీతక్కను కలిసి ఆయన వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం కులగణన చేయాలని కోరారు. 


అటవీ భూమిలో మైనింగ్‌పై హైకోర్టు నోటీసులు

ఈనాడు, హైదరాబాద్‌: సూర్యాపేట జిల్లా సుల్తాన్‌పూర్‌ రిజర్వు ఫారెస్ట్‌ భూముల్లో అక్రమ మైనింగ్‌పై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి, సాగర్, నాగార్జున సిమెంట్స్‌ సంస్థలకు సోమవారం హైకోర్టు నోటీసులు జారీ చేసింది. రిజర్వు ఫారెస్ట్‌లో లీజు నిబంధనలను సిమెంట్‌ పరిశ్రమలు ఉల్లంఘించి మైనింగ్‌ నిర్వహిస్తున్నా చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ సూర్యాపేటకు చెందిన కె.వెంకటరెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే, జస్టిస్‌ జె.అనిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ నాగార్జున సిమెంట్స్‌ 12 హెక్టార్లలో, సాగర్‌ సిమెంట్స్‌ 14 హెక్టార్లలో అక్రమంగా మైనింగ్‌ నిర్వహిస్తున్నాయన్నారు. దీనిపై కలెక్టర్‌కు ఆర్డీవో నివేదిక అందజేసినా చర్యలు లేవని పేర్కొన్నారు. 


ఆ అధికారులను వెనక్కి తేవాలి: టీజీవో

సీఎస్‌ శాంతికుమారికి వినతిపత్రం ఇస్తున్న శ్రీనివాసరావు, ఇతర నేతలు

ఈనాడు, హైదరాబాద్‌: ఎన్నికల సంఘం సూచనల మేరకు లోక్‌సభ ఎన్నికలకు ముందు దూరప్రాంతాలకు బదిలీపై వెళ్లిన అధికారులను వెనక్కి తెచ్చి, ప్రస్తుత బదిలీల్లో వారికి అవకాశం కల్పించాలని టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు కోరారు. ఈ మేరకు ఆయన టీజీవో నేతలు సత్యనారాయణ, బి.శ్యాం, ఎం.ఉపేందర్‌రెడ్డి, జగన్‌మోహన్‌రావు తదితరులతో కలిసి సోమవారం సీఎస్‌ శాంతికుమారి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రికి 16 డిమాండ్లతో కూడిన వినతిపత్రాలను వేర్వేరుగా సమర్పించారు. 


49 ఏళ్ల మొక్కు.. 12 అడుగుల జుట్టు

ఈయన పేరు ఇన్నపనూరు నాగభూషణం. వయస్సు 80 ఏళ్లు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం దమ్మపేటకు చెందిన ఆయన గతంలో స్థానిక గండి ముత్యాలమ్మ ఆలయ పూజారిగా పనిచేశారు. 31 ఏళ్ల వయసున్నప్పుడు నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చెర్వుగట్టు జడల రామలింగేశ్వరస్వామికి 50 ఏళ్లపాటు జుట్టు పెంచుతానని మొక్కుకున్నారు. అలా 49 ఏళ్లుగా జుట్టు పెంచుతున్నారు. ఇప్పుడు ఆయన జుట్టు 12 అడుగుల పొడవు పెరగగా.. దారంతో పాయలుగా చుట్టి భుజాన వేసుకుంటున్నారు. తన గురువుల సూచన మేరకు లోకకల్యాణార్థం మొక్కుకున్నానని, మరో ఏడాది పెంచితే 50 ఏళ్ల పూర్తవుతుందని నాగభూషణం ‘ఈనాడు’కు తెలిపారు. 

ఈనాడు, ఖమ్మం


అన్నారంలో రెండో దశ పరీక్షలు

కాళేశ్వరం, న్యూస్‌టుడే: కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్నారం బ్యారేజీ వద్ద రెండో దశ పరీక్షలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఎన్డీఎస్‌ఏ అధికారుల ఆదేశాల మేరకు కాళేశ్వరం ఇంజినీర్ల ఆధ్వర్యంలో జియో ఫిజికల్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సోమవారం బ్యారేజీ ఎగువన 30వ వెంట్‌ వద్ద పుణెకు చెందిన సెంట్రల్‌ వాటర్, పవర్‌ స్టేషన్‌ (సీడబ్ల్యూపీఎస్‌) శాస్త్రవేత్తల బృందం సభ్యులు డాక్టర్‌ మందిర, సంతోష్‌ కుమార్‌ రంగా, రమేష్‌ బాస్కే పార్లర్‌ సెస్మిక్‌ పద్ధతిలో భూగర్భంలో పరీక్షలు నిర్వహించారు. 25 మీటర్ల లోపల స్కానింగ్‌ చేస్తూ పరిశీలించారు. మొదటి దశలో బ్యారేజీకి ఎగువన పార్లర్‌ సెస్మిక్‌ పద్ధతిలో 8 పరీక్షలు నిర్వహించారు. సోమవారం జరిగిన పరీక్ష తొమ్మిదోది. ఈ కార్యక్రమంలో కాళేశ్వరం బ్యారేజీ జేఈఈ శ్రావణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


బసవతారకం ఆసుపత్రికి రూ.కోటి విలువైన ఆస్తి దానం

విశ్రాంత మహిళా ప్రిన్సిపల్‌ ఉదారత

ఈనాడు డిజిటల్, అమరావతి: బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రికి ఏపీలోని తెనాలికి చెందిన విశ్రాంత ప్రిన్సిపల్‌ పి.రమాదేవి రూ.కోటి విలువైన  ఆస్తిని దానం చేశారు. తన తదనంతరం ఆస్తి ఆ ఆసుపత్రికి చెందేలా వీలునామా రాశారు. సంబంధిత పత్రాల్ని ఆమె సంరక్షకులు ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబుకు సోమవారం అందించారు. రమాదేవి.. శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌గా విధులు నిర్వర్తించి, పదవీ విరమణ చేశారు. ఆమె ముగ్గురు కుమారులు  అమెరికాలో స్థిరపడ్డారు. క్యాన్సర్‌ సోకిన వారికి మెరుగైన వైద్య సదుపాయం అందిస్తున్న బసవతారకం ఆసుపత్రికి ఆస్తిని సంతృప్తిగా అందజేస్తున్నట్లు రమాదేవి తెలిపారు.  


బోనాల జాతర, ఊరేగింపునకు కర్ణాటక ‘రూపావతి’

ఈనాడు, హైదరాబాద్‌: బోనాల జాతర, మొహర్రం ఊరేగింపులో పాల్గొనేందుకు కర్ణాటకలోని జగద్గురు పంచాచార్య మందిర్‌ ట్రస్ట్‌కు చెందిన ‘రూపావతి’ ఏనుగు రాష్ట్రానికి రానుంది. మంగళవారం నుంచి ఈ నెల 29వ తేదీ వరకు హైదరాబాద్‌లో జరిగే పలు ఉత్సవాల్లో పాల్గొననుంది. అందుకు అటవీశాఖ అనుమతి ఇచ్చింది. మొహర్రం సందర్భంగా బీబీకాఆలం ఊరేగింపుతోపాటు సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి, కార్వాన్‌ నల్లపోచమ్మ మహంకాళి, హరీబౌలి అక్కన్న మాదన్న దేవాలయ బోనాల జాతరల్లో పాల్గొననుంది. ఇవి పూర్తికాగానే కర్ణాటక తిరిగి వెళ్తుంది.


ఎన్‌ఏపీఎస్‌-2 పర్యవేక్షణకు రాష్ట్రస్థాయి కమిటీ

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో జాతీయ అప్రెంటిస్‌ ప్రమోషన్‌ పథకం(ఎన్‌ఏపీఎస్‌)-2 అమలు, పర్యవేక్షణ కోసం రాష్ట్రస్థాయి అమలు పర్యవేక్షణ కమిటీ (ఎస్‌ఐఆర్‌సీ)ని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు కార్మికశాఖ ముఖ్య కార్యదర్శి సంజయ్‌కుమార్‌ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. ఎస్‌ఐఆర్‌సీ ఛైర్మన్‌గా ఉపాధి కల్పనశాఖ డైరెక్టర్‌ కృష్ణ ఆదిత్య, ఎక్స్‌అఫిషియో సభ్యుడిగా ఉపాధి కల్పనశాఖ జేడీ ఎస్‌వీకే నగేశ్‌ వ్యవహరిస్తారు. టాస్క్‌ ప్రతినిధి, ఆర్‌డీఎస్‌ఈ ఆర్‌డీ, వరంగల్, నిజామాబాద్, మల్లేపల్లి ఐటీఐల ప్రిన్సిపాళ్లు, ఎన్‌ఎస్‌డీసీ సభ్యులు, పరిశ్రమలశాఖ జేడీ, పారిశ్రామిక, చిన్నతరహా పరిశ్రమల ప్రతినిధి, గద్వాల పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ఈ కమిటీకి సభ్యులుగా కొనసాగుతారు. ఇది ఆరు నెలలకోసారి సమావేశమవుతుంది. పథకం అమలుకు అవసరమైన ప్రణాళికలు, బడ్జెట్‌ అంచనాలు రూపొందిస్తుంది. 


జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు జనరల్‌ ర్యాంకుల ప్రకటన

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌ విద్య కమిషనరేట్‌ పరిధిలో 1,392 జూనియర్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్షలో ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల జనరల్‌ ర్యాంకుల జాబితా(జీఆర్‌ఎల్‌)ను టీజీపీఎస్సీ ప్రకటించింది. మొత్తం 27 సబ్జెక్టుల్లో జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులకు గతేడాది సెప్టెంబరులో సీబీఆర్‌టీ పద్ధతిలో పరీక్షలు జరిగాయి. సబ్జెక్టుల వారీగా జీఆర్‌ఎల్‌ జాబితాలను కమిషన్‌ వెబ్‌సైట్లో పొందుపరిచింది. ధ్రువీకరణ పత్రాల పరిశీలనకు సాధారణ అభ్యర్థులకు 1:2 నిష్పత్తిలో, దివ్యాంగ అభ్యర్థులకు 1:5 నిష్పత్తిలో మెరిట్‌ జాబితాలు త్వరలో ప్రకటిస్తామని కమిషన్‌ కార్యదర్శి నవీన్‌ నికోలస్‌ తెలిపారు. 


ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల ఎంపిక జాబితా వెల్లడి

ఈనాడు, హైదరాబాద్‌: ప్రభుత్వ వైద్య విభాగాల్లో 200 ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టులకు (ఉద్యోగ ప్రకటన 67/2017) ఎంపికైన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ వెల్లడించింది. వివరాలకు కమిషన్‌ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించింది. అయితే ప్రాథమిక జాబితా ప్రకారం ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఎవరైనా స్వచ్ఛందంగా వదిలిపెట్టాలని భావిస్తే ఈనెల 11 నుంచి 14 వరకు ‘రీలింక్విష్‌మెంట్‌’ ఆప్షన్‌ ఇవ్వాలని కోరింది. ఈ మేరకు కమిషన్‌ వెబ్‌సైట్లో వెబ్‌లింక్‌ అందుబాటులో పెట్టినట్లు పేర్కొంది.


22 నుంచి కానిస్టేబుల్‌ అభ్యర్థులకు శిక్షణ

ఈనాడు, హైదరాబాద్‌: పలు కారణాలతో శిక్షణకు హాజరుకాని కానిస్టేబుల్‌ అభ్యర్థులకు ఈ నెల 22 నుంచి మరోమారు అవకాశం కల్పిస్తున్నట్లు అదనపు డీజీ (శిక్షణ) అభిలాష్‌ బిస్త్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి సివిల్, ఏఆర్, రాష్ట్ర ప్రత్యేక పోలీసు పటాలం (టీజీఎస్పీ) విభాగాలలో ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఎంపికైన అభ్యర్థులకు గత ఫిబ్రవరిలో శిక్షణ కూడా ప్రారంభించారు. అయితే పలువురు కానిస్టేబుల్‌ అభ్యర్థులు సాంకేతిక కారణాల వల్ల ఈ శిక్షణకు హాజరుకాలేదు. వీరికి ఈ నెల 22 నుంచి తొమ్మిది నెలలు పాటు శిక్షణ ఉంటుందని ఆ ప్రకటనలో వివరించారు. శిక్షణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లను ఆమె కోరారు.


నెలాఖరుకు రెండో భాగం పాఠ్య పుస్తకాలు 

ఈనాడు, హైదరాబాద్‌: పాఠశాల విద్యార్థులకు ఈ నెలాఖరుకు రెండో భాగం(పార్ట్‌ 2) పాఠ్య పుస్తకాలు అందజేస్తామని విద్యాశాఖ సోమవారం తెలిపింది. ఆగస్టు నెలాఖరుకు రెండో జత ఏకరూప దుస్తులు అందజేసేందుకు అంతా సిద్ధం చేసినట్లు పేర్కొంది. రెండు భాషల్లో పుస్తకాలను ప్రచురిస్తున్న నేపథ్యంలో బరువు సమస్య కాకుండా రెండు భాగాలుగా వాటిని ముద్రించి విద్యార్థులకు అందజేస్తున్నామని వివరించింది. 


ఆర్జీయూకేటీలో ప్రారంభమైన కౌన్సెలింగ్‌

ముథోల్‌(బాసర), న్యూస్‌టుడే: బాసర ఆర్జీయూకేటీలో పీయూసీ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి ఎంపికైన విద్యార్థులకు సోమవారం కౌన్సెలింగ్‌ ప్రారంభమైంది. ఆర్జీయూకేటీ ఇన్‌ఛార్జి ఉపకులపతి ఆదేశాల మేరకు విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని అకాడమిక్‌ బ్లాక్‌లో మొదటి రోజు 500 మందికి కౌన్సెలింగ్‌ నిర్వహించారు. 80 మంది విద్యార్థులకు ఒక గది చొప్పున ఏర్పాటుచేసి ధ్రువపత్రాలను పరిశీలించారు. మొదటి రోజు కౌన్సెలింగ్‌కు 42 మంది గైర్హాజరయ్యారు. సంగారెడ్డి జిల్లా అందోలు మండలం కోడికల్‌ గ్రామానికి చెందిన అన్నసాగర్‌ విఠలేశ్వర్‌ అనే విద్యార్థికి విశ్వవిద్యాలయ ప్రత్యేకాధికారి సృజన, సంయుక్త కన్వీనర్‌ డా.పావని తొలి ప్రవేశపత్రాన్ని అందజేశారు. రెండో రోజు మంగళవారం మరో 500 మంది విద్యార్థులకు కౌన్సెలింగ్‌ ఉంటుందని చెప్పారు. 


నిధులు లేక పంచాయతీలు సతమతం

భాజపా ఎమ్మెల్యే హరీశ్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో గ్రామపంచాయతీలు నిధుల కొరతతో సతమతమవుతున్నాయని భాజపా ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌ అన్నారు. సోమవారం హైదరాబాద్‌లోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..పారిశుద్ధ్య నిర్వహణకు నిధులు లేకపోవడంతో గ్రామాల్లో అధ్వాన పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. ఆసిఫాబాద్‌ జిల్లాలోని పలు గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణ లోపంతో ప్రజలు విషజ్వరాల బారిన పడుతున్నారన్నారు. స్పెషల్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్స్‌ కింద రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికి రూ.10 కోట్ల నిధులు ఇస్తామని చెప్పి.. ఇంతవరకు అతీగతీ లేదన్నారు. భారాస ప్రభుత్వం బాటలోనే కాంగ్రెస్‌ నడుస్తోందని విమర్శించారు.


ద.మ.రైల్వే డిప్యూటీ జీఎంగా ఉదయనాథ్‌

సికింద్రాబాద్, న్యూస్‌టుడే: దక్షిణ మధ్య రైల్వే డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌గా కోట్ల ఉదయనాథ్‌ సోమవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌కు చెందిన ఉదయనాథ్‌.. గతంలో సికింద్రాబాద్‌ సౌత్‌ సెంట్రల్‌ రైల్వే కన్‌స్టక్ష్రన్‌ ఆర్గనైజేషన్‌లో డిప్యూటీ ఫైనాన్షియల్‌ అడ్వైజర్, చీఫ్‌ ఎకౌంట్స్‌ ఆఫీసర్‌గా పనిచేశారు. ద.మ.రైల్వేలో డివిజినల్‌ ఫైనాన్స్‌ మేనేజర్‌గా, సికింద్రాబాద్, హైదరాబాద్‌ విభాగాల్లో సీనియర్‌ డివిజినల్‌ ఫైనాన్స్‌ మేనేజర్‌గా విధులు నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని