స్పీకర్‌ను ఆదేశించే అధికారం హైకోర్టుకు లేదు

భారాస నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్‌కు ఆదేశాలిచ్చే అధికారం ఈ కోర్టుకు లేదంటూ ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది.

Published : 09 Jul 2024 02:41 IST

ఎమ్మెల్యేల అనర్హత అంశంపై ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన ఏజీ

ఈనాడు, హైదరాబాద్‌: భారాస నుంచి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్‌కు ఆదేశాలిచ్చే అధికారం ఈ కోర్టుకు లేదంటూ ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం చెప్పిందని పేర్కొంది. భారాస తరఫున ఎన్నికై కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్‌లపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేయాలంటూ భారాస ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానంద్‌లు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్‌లపై సోమవారం జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి మరోసారి విచారణ చేపట్టారు. అడ్వొకేట్‌ జనరల్‌ ఎ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ స్పీకర్‌కు ఆదేశాలిచ్చే పరిధి హైకోర్టుకు లేదంటూ కిహోటో హోలోహాన్‌ కేసులో సుప్రీంకోర్టు తేల్చి చెప్పిందన్నారు. పిటిషనర్లు కేశం మెగాచంద్రసింగ్‌ కేసులో ముగ్గురు జడ్జిలు ఇచ్చిన తీర్పును ఆధారంగా చేసుకుని వాదనలు వినిపిస్తున్నారన్నారు. అయితే ఐదుగురు జడ్జిలిచ్చిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందన్నారు. అంతేకాకుండా గతంలో తెలుగుదేశం నుంచి అప్పటి తెరాసలోకి ఫిరాయించారంటూ తలసాని శ్రీనివాసయాదవ్‌పై అనర్హత వేటు వేయకుండా స్పీకర్‌ జాప్యం చేస్తున్నారని, దానిపై నిర్ణయం తీసుకుని అనర్హత వేటు వేసేలా స్పీకర్‌కు ఆదేశాలు జారీ చేయాలంటూ ఎర్రబెల్లి దయాకర్‌రావు దాఖలు చేసిన పిటిషన్‌ను ఇదే హైకోర్టు తిరస్కరించిందన్నారు. స్పీకర్‌కు ఆదేశాలు ఇవ్వడానికి కోర్టు నిరాకరించిందన్నారు. రాజ్యాంగం ప్రకారం పార్టీ ఫిరాయింపులకు సంబంధించి స్పీకర్‌ ముందున్న పిటిషన్‌లలో సుప్రీంకోర్టు, హైకోర్టులు జోక్యం చేసుకోవడానికి వీల్లేదన్నారు. చట్టసభ నుంచి సభ్యుడి సస్పెన్షన్‌ లేదా శాశ్వత బహిష్కరణ, అనర్హత వేటు వంటి నిర్ణయాలన్నీ స్పీకర్‌ పరిధిలోనివేనని, ఇందులో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోరాదన్నారు. తదుపరి వాదనల నిమిత్తం విచారణను ఈ నెల 11కు వాయిదా వేయాలని ఏజీ కోరగా అందుకు ధర్మాసనం అంగీకరించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని