ఒకే గదిలో.. 2 పాఠశాలలు.. 10 తరగతులు.. 70 మంది విద్యార్థులు

ఒక గదిలో రెండు తరగతులు నిర్వహించడం అక్కడక్కడ జరుగుతుంటుంది. మంచిర్యాల జిల్లా భీమిని మండలం కేస్లాపూర్‌ అనుబంధ గ్రామం గట్టుపల్లిలో మాత్రం ఒకే గదిలో ఏకంగా రెండు పాఠశాలలను నిర్వహిస్తున్నారు.

Published : 09 Jul 2024 04:35 IST

ఒక గదిలో రెండు తరగతులు నిర్వహించడం అక్కడక్కడ జరుగుతుంటుంది. మంచిర్యాల జిల్లా భీమిని మండలం కేస్లాపూర్‌ అనుబంధ గ్రామం గట్టుపల్లిలో మాత్రం ఒకే గదిలో ఏకంగా రెండు పాఠశాలలను నిర్వహిస్తున్నారు. కేస్లాపూర్‌ ప్రాథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో కూల్చేశారు. అక్కడి విద్యార్థులను అదే పంచాయతీలోని గట్టుపల్లి పాఠశాలకు తరలించారు. ఇక్కడ ఒక గది, వరండా మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం ఒకే ఇరుకు గదిలో రెండు పాఠశాలలకు చెందిన 70 మంది విద్యార్థులకు బోధిస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పైగా ఈ రెండు పాఠశాలలకు సంబంధించి ఒకటి నుంచి ఐదో తరగతి విద్యార్థులందరినీ కలిపే పాఠాలు చెబుతున్నారు. రెండు పాఠశాలల్లోని నలుగురు ఉపాధ్యాయులకు గాను ఒకరు డిప్యుటేషన్‌పై వెళ్లగా ముగ్గురు ఇక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే కేస్లాపూర్‌ పాఠశాలకు మన ఊరు- మన బడి కింద రూ.12 లక్షల నిధులు మంజూరయ్యాయి. గట్టుపల్లి పాఠశాల భవనం పక్కనే గుత్తేదారు పనులు ప్రారంభించి పిల్లర్లు నిర్మించారు. బిల్లులు రాకపోయే సరికి మధ్యలోనే నిలిపివేశారు. ఈ విషయంపై ఎంఈవో మహేశ్వర్‌రెడ్డిని ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా.. పాత భవనం కూలగొట్టిన చోటే కొత్త భవనం నిర్మిస్తే ఇబ్బంది ఉండేది కాదన్నారు. గట్టుపల్లిలో నిర్మాణం చేపట్టడంతో సాంకేతిక సమస్య తలెత్తిందన్నారు. ఆ భవన ఫొటో ఆన్‌లైన్‌లో నమోదుకాకపోవడంతో గుత్తేదారుకు డబ్బులు రావడం లేదని చెప్పారు. 

న్యూస్‌టుడే, భీమిని 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని