మూడు చోట్ల 50 శాతం దాకా యాంటీబయాటిక్స్‌ నిరోధకత

యాంటీబయాటిక్స్‌ నిరోధకతను కమ్యూనిటీలో గుర్తించేందుకు హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ(ఐఐసీటీ) సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా మురుగునీటి నుంచి నమూనాలు సేకరించి పరిశోధనలు చేపట్టింది.

Published : 09 Jul 2024 02:55 IST

హైదరాబాద్‌లో మురుగునీటి నమూనాలపై ఐఐసీటీ పరిశోధన
వైద్యులు కొత్త మందులు రాసేందుకు ఇవి ఉపయోగకరం అంటున్న శాస్త్రవేత్తలు

ఈనాడు, హైదరాబాద్‌: యాంటీబయాటిక్స్‌ నిరోధకతను కమ్యూనిటీలో గుర్తించేందుకు హైదరాబాద్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ టెక్నాలజీ(ఐఐసీటీ) సంప్రదాయ పద్ధతులకు భిన్నంగా మురుగునీటి నుంచి నమూనాలు సేకరించి పరిశోధనలు చేపట్టింది. తార్నాక, నాచారం, హెచ్‌ఎంటీ నగర్‌ ప్రాంతాల్లో ప్రధానంగా వాడే యాంటీబయాటిక్స్‌కు 50 శాతం దాకా నిరోధకత ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో ఉండేవారికి పనిచేయని యాంటీబయాటిక్స్‌ స్థానంలో కొత్తవాటిని వైద్యులు రాసేందుకు ఈ పరిశోధన దోహదం చేస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఈ పరిశోధన పత్రం తాజాగా ఎన్‌పీజే క్లీన్‌ వాటర్‌ జర్నల్‌లో ప్రచురితమైంది. 

అసలేంటి ఈ నిరోధకత.. 

అవసరం లేకపోయినా యాంటీబయాటిక్స్‌ ఉపయోగిస్తే భవిష్యత్తులో వచ్చే ఇన్ఫెక్షన్లకు అవి పనిచేయకపోయే అవకాశం ఉంటుంది. దీన్నే యాంటీబయాటిక్స్‌ నిరోధకత అంటారు. ఇప్పుడు ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆరోగ్య ముప్పు ఇది. యాంటీబయాటిక్స్‌ వినియోగంతో వ్యాధికారక క్రిముల్లో వాటిని తట్టుకునే సామర్థ్యం (ఏఎంఆర్‌) ఎలా ఉందో క్లినికల్‌ నమూనాల ద్వారా  గుర్తిస్తున్నారు. కమ్యూనిటీలో ఇది ఎలా ఉందో పూర్తి అవగాహన కోసం ఐఐసీటీ ఈ పరిశోధనలు చేపట్టింది. తార్నాక, నాచారం, హెచ్‌ఎంటీ నగర్‌లోని మురుగునీటిలో సేకరించిన నమూనాల నుంచి 123 యాంటీబయాటిక్‌ రెసిస్టెన్స్‌ జన్యువులు (ఏఆర్‌జీ), 13 మొబైల్‌ జన్యు మూలకాలు (ఎంజీఈ) క్యూ-పీసీఆర్‌ ఉపయోగించి విశ్లేషించారు. ప్రధానమైన యాంటీబయాటిక్స్‌లో ఐదు తరాలకు చెందిన వాటిపై ఏ మేరకు నిరోధకత ఉందో పరిశీలించారు. పెన్సిలిన్‌ను తొలితరంగా చెబుతుంటారు. ప్రస్తుతం ఐదో తరం మందులు ఇస్తున్నారు. వీటిపై ఐఐసీటీ ప్రధాన శాస్త్రవేత్త డా.ఎస్‌.వెంకటమోహన్‌ బృందం.. డిసెంబరు 2021 నుంచి ఏప్రిల్‌ 2022 వరకు మురుగు నీటి నుంచి నెలవారీగా నమూనాలను తీసుకుని పరీక్షించింది. అన్ని నెలల్లోనూ 50 శాతం వరకు యాంటీబయాటిక్స్‌ రెసిస్టెన్స్‌ జన్యువుల ఉనికి కనిపించింది. చలికాలంలో డిసెంబరు, జనవరి మాసంలో తీవ్రత ఎక్కువగా 52 నుంచి 62 శాతం మధ్య కనిపించింది. దీని ద్వారా ఆయా ప్రాంతాల్లో నిరోధకత కల్గిన మందులను వైద్యులు సూచించకుండా ఉండేందుకు ఉపయోగపడుతుందని పరిశోధకులు అంటున్నారు. అప్పటికే నిరోధకత కలిగిన మందులు వాడితే పనిచేయక అది మలం రూపంలో మురుగులో కలుస్తుంది. అక్కడి నుంచి జంతువులకు, మనుషులకు చేరి మానవాళికి ముప్పుగా మారుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు