ఆయిల్‌పామ్‌కు ధరల గండం

ఆయిల్‌పామ్‌ గెలల ధర తగ్గుదల రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే పంట సాగు చేస్తున్న వారిలోనే కాక కొత్తగా ముందుకొస్తున్న వారికి ఇబ్బందికరంగా మారింది.

Published : 09 Jul 2024 03:08 IST

ఏటేటా తగ్గుదలతో సాగుపై  అన్నదాతల్లో ఆందోళన
ధర స్థిరీకరించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ

ఈనాడు, హైదరాబాద్‌: ఆయిల్‌పామ్‌ గెలల ధర తగ్గుదల రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే పంట సాగు చేస్తున్న వారిలోనే కాక కొత్తగా ముందుకొస్తున్న వారికి ఇబ్బందికరంగా మారింది. ధరల తగ్గుదలపై రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. ఓ వైపు పెద్దఎత్తున సాగును పెంచేందుకు సర్కారు సన్నాహాలు చేస్తున్న సమయంలో ధరల సమస్య ప్రతిబంధకమవుతుందనే భావన కలుగుతోంది.

దేశ అవసరాల కోసం ఏటా పామాయిల్‌ను రూ.70 వేల కోట్లకుపైగా వెచ్చించి దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా వంట నూనెగింజల ఉత్పత్తిని ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలో జాతీయ వంటనూనెల ఉత్పత్తి కార్యక్రమం(నేషనల్‌ ఎడిబుల్‌ ఆయిల్‌ మిషన్‌-ఆయిల్‌పామ్‌) పేరిట పథకం తీసుకొచ్చింది. భారీఎత్తున సబ్సిడీలు ప్రకటించడంతో తెలంగాణలో నాలుగేళ్లుగా ఆయిల్‌పామ్‌ సాగు పెరిగింది. మొదటి ఏడాది 26 వేల ఎకరాల్లో సాగు కాగా ఇప్పుడది రెండున్నర లక్షల ఎకరాలకు చేరింది. నీటి వినియోగం తక్కువగా ఉండడం, వాతావరణ మార్పులను తట్టుకోవడం, అంతరపంటల సాగుకు అవకాశం వల్ల రైతులు దీనివైపు మొగ్గుచూపుతున్నారు. ఒకసారి పెట్టుబడి పెడితే 30 ఏళ్లు క్రమం తప్పకుండా స్థిర ఆదాయం వస్తుంది. గెలలో వచ్చే నూనె ఆధారంగా చెల్లింపులు చేస్తారు. సాగు చేసిన 4 ఏళ్ల తర్వాత పంట చేతికి రావడం ప్రారంభమవుతుంది. ఏడాదికి నికరంగా రూ.లక్ష ఆదాయం లభిస్తోంది.

దిగుమతి సుంకం ఎత్తివేయడంతో.. 

రాష్ట్రంలో ఏటా లక్ష ఎకరాల్లో సాగు పెంపు లక్ష్యంతో ప్రభుత్వం రాయితీలు, ప్రోత్సాహకాలను ప్రకటించింది. మరోవైపు 15 కంపెనీలతో అవగాహన ఒప్పందాలు చేసుకుంది. కంపెనీలు మొక్కలను సరఫరా చేసి సాగు చేయించడంతోపాటు పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తాయి. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బాధ్యతలు చేపట్టిన తర్వాత దీని సాగుపై ప్రత్యేక దృష్టిసారించారు. సాగుచేసే రైతులకు రూ.37,200 రాయితీగా ప్రభుత్వం ఇస్తోంది. ఇది కాకుండా అన్నదాతలు ఎకరానికి రూ.60 వేలను వెచ్చించి సాగు చేసేందుకు ముందుకొస్తున్నారు. ఈ తరుణంలో అనూహ్యంగా ధరలు తగ్గడం సమస్యగా మారింది. సాధారణంగా జూన్‌ నుంచి ఆయిల్‌పామ్‌ సీజన్‌ ప్రారంభమవుతుంది. 2022లో టన్ను గెలల ధర రూ.19,114గా నిర్ణయించగా నిరుడు అది రూ.16,415లకు తగ్గింది. 2024కి గాను ఇటీవల రూ.13,652గా కేంద్రం నిర్ణయించింది. అక్టోబరు వరకు ఇది అమల్లో ఉంటుంది. ముడి పామాయిల్‌ దిగుమతులపై ఉన్న సుంకాన్ని కేంద్రం పూర్తిగా ఎత్తివేయడంతో పరిశ్రమల యాజమాన్యాలు ఆయిల్‌పామ్‌ గెలల ధరలను మరింత తగ్గిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఎంఈఓ-ఓపీ పథకం కింద వయబిలిటీ గ్యాప్‌ ఫండింగ్‌ సూత్రం అనుసరించి నూనె ఉత్పత్తిశాతాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ ధర నిర్ణయించినట్లు ప్రకటించింది. ఉమ్మడి ఏపీలోని ఉత్పత్తి శాతాన్ని పరిగణనలోకి తీసుకుని ఈ ధర నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఇచ్చింది. వాస్తవానికి ఏపీ కంటే తెలంగాణలో మెరుగైన నూనె ఉత్పత్తి శాతం ఉంది. దీంతోపాటు ఉప ఉత్పత్తులను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉన్నా దానిని తీసుకోలేదు. 

రైతుల్లో మీమాంసతో ప్రభుత్వం అప్రమత్తం.. 

ఆయిల్‌పామ్‌ గెలల ధరలు తగ్గడంతో రైతుల్లో పంట సాగుపై మీమాంస ఏర్పడింది. ధరలు తగ్గడంతో సాగుకు వెనకాడుతున్నారు. దీంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాజాగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. టన్ను గెలల ధర రూ.15వేలుగా స్థిరీకరించాలని, మూడు నుంచి నాలుగేళ్లపాటు దానిని కొనసాగించాలని కోరారు. ధరల ఖరారుకు తెలంగాణలో ఉత్పత్తి అయ్యే గెలల నుంచి నూనె శాతాన్నే పరిగణనలోనికి తీసుకోవాలని స్పష్టం చేశారు. దిగుమతుల సుంకాన్ని కొనసాగించాలని అభ్యర్థించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని