వామపక్ష తీవ్రవాదం.. బలవుతున్న సామాన్య జనం

తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని గిరిజనులు... పోట్లగిత్తల పోరులో లేగదూడల్లా నలిగిపోతున్నారు. పోలీసులు, మావోయిస్టుల మధ్య జరుగుతున్న యుద్ధంలో అకారణంగా బలవుతున్నారు.

Published : 09 Jul 2024 03:10 IST

పోలీసులే లక్ష్యంగా అడవుల్లో మందుపాతరలు, ఉచ్చులు
వాటి బారినపడి అమాయకులు మృత్యువాత
ఇటీవల ములుగు జిల్లాలో రెండు ఘటనలు
గత ఏడేళ్లలో తెలంగాణలో 10 మంది, ఛత్తీస్‌గఢ్‌లో 338 మంది మృతి

ఛత్తీస్‌గఢ్‌ అటవీ ప్రాంతంలో పోలీసులు లక్ష్యంగా మావోయిస్టులు ఏర్పాటు చేసిన ఉచ్చులు 

ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని గిరిజనులు... పోట్లగిత్తల పోరులో లేగదూడల్లా నలిగిపోతున్నారు. పోలీసులు, మావోయిస్టుల మధ్య జరుగుతున్న యుద్ధంలో అకారణంగా బలవుతున్నారు. వంట చెరకు కోసం అడవికి వెళ్లిన ఒకరు పొరపాటున మందుపాతరపై కాలుపెట్టి ప్రాణాలు కోల్పోగా... దైవ దర్శనానికి వెళ్తున్న మరో మహిళ కూడా తీవ్రగా గాయపడ్డారు. దీంతో వామపక్ష తీవ్రవాదానికి సంబంధించిన హింసలో సామాన్యుల మరణాల అంశం మరోమారు తెరపైకి వచ్చింది. 

అడవిలో నలువైపుల నుంచి దాడి 

వామపక్ష తీవ్రవాదం ఉద్ధృతంగా ఉన్నప్పుడు ఉమ్మడి ఏపీలో సామాన్యుల మరణాలు ఎక్కువగా ఉండేవి. ఆర్టీసీ బస్సులను పేల్చివేయడం, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం వంటి ఘటనల్లో ప్రజలు ప్రాణాలు కోల్పోతుండేవారు. ప్రస్తుతం ఇలాంటి ఘటనలు చాలావరకు తగ్గిపోయాయి. పోలీసుల నుంచి ఒత్తిడి పెరగడంతో మావోయిస్టు ఉద్యమం దాదాపు దండకారణ్యానికే పరిమితమైంది. ఇరువురి మధ్య పోరు కూడా అక్కడే జరుగుతోంది. ముఖ్యంగా కొద్ది రోజులుగా మావోయిస్టుల ఏరివేత లక్ష్యంగా భద్రతా బలగాలు నలువైపుల నుంచి చుట్టుముడుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు జరిగిన ఎదురుకాల్పుల్లో 120 మంది మావోయిస్టులు మరణించారు. ఇందులో మొదటి నాలుగు నెలల్లోనే 91 మంది చనిపోయారు. అయితే, ఇద్దరి మధ్య జరుగుతున్న పోరులో గత ఏడేళ్ల కాలంలో తెలంగాణకు చెందిన 10 మంది, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 338 మంది దుర్మరణం పాలయ్యారు. వారి కుటుంబాలు వీధుల పాలయ్యాయి. అమాయకుల ప్రాణాలు బలి కాకుండా... పోలీసులు, మావోయిస్టులు ఇప్పటికైనా సంయమనం పాటించాలని పలువురు కోరుతున్నారు. 

ఆత్మరక్షణలో భాగంగా మందుపాతరలు 

మారుమూల అటవీ ప్రాంతాల్లోకీ భద్రతా బలగాలు చొచ్చుకొని వెళ్తుండటంతో మావోయిస్టులు ఆత్మరక్షణలో పడ్డారు. తమనుతాము రక్షించుకోవడానికి పెద్దఎత్తున మందుపాతరలు అమరుస్తున్నారు. వీటి బారినపడిన ములుగు జిల్లా వాజేడు మండలానికి చెందిన ఎల్లందుల ఏసు మరణించగా, వెంకటాపురం మండలం చొక్కాల గ్రామానికి చెందిన డర్రా సునీత తీవ్రంగా గాయపడ్డారు. కొద్దిరోజుల వ్యవధిలోనే జరిగిన ఈ రెండు ఘటనలు కలకలం రేపాయి. మందుపాతరలతోపాటు ఉచ్చుల వంటివి కూడా అమర్చి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. అటవీ ప్రాంతాల్లోని నడకదారుల్లో పెద్దపెద్ద గుంతలు తవ్వి, వాటిలో పదునైన ఇనుప ఊచలు నాటి, పైన కర్రలు, ఆకులతో కప్పి ఉచ్చులు ఏర్పాటు చేశారని, సమీప ప్రాంతాల ప్రజలు అడవుల్లోకి వెళ్లేప్పుడు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని