ఐటీఐల్లో బోధకుల కొరత

మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ కేంద్రం(ఐటీఐ)లో మొత్తం 11 ట్రేడ్‌లు ఉన్నాయి. ఇక్కడ ఏటా 360 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు.

Published : 09 Jul 2024 04:36 IST

మంజూరైన పోస్టుల్లో దాదాపు సగం ఖాళీ
కొత్త ట్రేడ్ల బోధనకు సిబ్బంది కరవు
ఈనాడు - హైదరాబాద్‌

మహబూబ్‌నగర్‌లోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ కేంద్రం(ఐటీఐ)లో మొత్తం 11 ట్రేడ్‌లు ఉన్నాయి. ఇక్కడ ఏటా 360 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. మంజూరైన బోధకుల పోస్టులు 26 కాగా.. పనిచేస్తున్నవారు 11 మంది మాత్రమే. కీలకమైన డిప్యూటీ టెక్నికల్, సహాయ టెక్నికల్‌ అధికారుల పోస్టులు 21 ఉండగా.. తొమ్మిది మందే ఉన్నారు. అరకొర సిబ్బంది, మారుతున్న కోర్సులకు అనుగుణంగా కొత్తగా నియామకాలు లేకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఇదే పట్టణంలోని పిల్లలమర్రి ప్రభుత్వ ఐటీఐలో మొత్తం 11 బోధన పోస్టులకు గాను కేవలం ముగ్గురు మాత్రమే పనిచేస్తున్నారు. 

రాష్ట్రంలోని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ(ఐటీఐ)లు అధ్యాపకుల కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. విద్యార్థుల సంఖ్యకు సరిపడేలా, అందుబాటులోని ట్రేడ్లకు అనుగుణంగా బోధన సిబ్బంది లేరు. మారుతున్న పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు ప్రవేశపెట్టినా.. వాటిని బోధించేందుకు పోస్టులు మంజూరు చేయకపోవడంతో ఆశించిన లక్ష్యం నెరవేరడం లేదు. గత పదేళ్ల కాలంలో ఐటీఐల్లో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకుల్లో కొందరి క్రమబద్ధీకరణ మినహా కొత్త పోస్టులు భర్తీ కాలేదు. ఒప్పంద అధ్యాపకుల క్రమబద్ధీకరణ తర్వాత ప్రభుత్వ ఐటీఐలకు మంజూరైన పోస్టుల్లో సగానికిపైగా ఖాళీగానే ఉన్నాయి. 

బోధన సిబ్బంది నియామకంతోనే నైపుణ్య శిక్షణ లక్ష్యం సాకారం..

పారిశ్రామిక అవసరాలకు తగినట్లుగా, మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఐటీఐలను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని 65 ఐటీఐలను ఆధునిక శిక్షణ కేంద్రా(ఏటీసీ)లుగా మార్చుతూ.. అక్కడి విద్యార్థులకు స్వల్ప, దీర్ఘకాల నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు కార్యాచరణ సిద్ధం చేసింది. ఇందుకు టాటా టెక్నాలజీస్‌తో ఒప్పందం చేసుకుంది. అయితే ఐటీఐల్లో సిబ్బంది కొరత ఎక్కువగా ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం 65 ప్రభుత్వ ఐటీఐలు ఉన్నాయి. వీటిలో మొత్తం 38 ట్రేడ్‌లు కొనసాగుతున్నాయి. వీటిని బోధించేందుకు మంజూరైన పోస్టులు 1,295 ఉండగా.. రెగ్యులర్, ఒప్పంద అధ్యాపకులతో కలిపి 657 మంది మాత్రమే పనిచేస్తున్నారు. మిగతా పోస్టులు ఖాళీగానే ఉన్నాయి. ప్రస్తుత బోధకుల్లోనూ ఎక్కువ మంది పాత టెక్నాలజీ, ట్రేడ్‌లను బోధిస్తున్నవారే ఉన్నారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కొత్త ట్రేడ్‌లు మంజూరైనా.. వాటి బోధనకు పోస్టులు భర్తీ కాలేదు. కొత్త ట్రేడ్‌లలో దాదాపు 200 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వ ఐటీఐల్లో సరైన సంఖ్యలో సిబ్బంది లేకపోవడంతో ఏటా కొత్త ప్రవేశాలపై ప్రభావం పడుతోంది. నైపుణ్య శిక్షణ కోసం ప్రభుత్వంతో కుదిరిన ఒప్పందంలో భాగంగా టాటా సంస్థ ప్రతినిధులు విద్యార్థులతో పాటు సంబంధిత ట్రేడ్‌లలో బోధకులకు శిక్షణ అందిస్తారు. అయితే ఎవరికి శిక్షణ ఇప్పించాలన్న విషయమై ఉపాధి కల్పన శాఖలో సందిగ్ధం నెలకొంది. పాత టెక్నాలజీపై బోధన చేస్తున్నవారికి ఇవ్వాలా? లేదా ఉన్నత సాంకేతిక విద్య అర్హతలు కలిగిన పట్టభద్రులను నియమించి.. వారికి ఇవ్వాలా? అన్న విషయమై సమాలోచనలు జరుగుతున్నాయి. టాటా ప్రాజెక్టు అమలులో భాగంగా కనీసం 400 మంది నియామకం చేపడితేనే లక్ష్యం నెరవేరుతుందని ఉపాధి కల్పన శాఖ ఉద్యోగ వర్గాలు చెబుతున్నాయి. 


అర్హతలున్నా క్రమబద్ధీకరణకు దూరం..

పారిశ్రామిక శిక్షణ కేంద్రాల్లో బోధకుల కొరతను తీర్చేందుకు గతంలో ఐటీఐ ఉత్తీర్ణులైన వారిని ఒప్పంద ప్రాతిపదికన నియమించారు. ఇలాంటి వారు దాదాపు 378 మంది కొన్నేళ్లుగా పనిచేస్తున్నారు. ఇటీవల ఒప్పంద ఉద్యోగుల క్రమబద్ధీకరణలో భాగంగా ప్రభుత్వం.. ఐటీఐల్లో పనిచేస్తున్న సిబ్బంది సర్వీసు, ఇతర అర్హతల వివరాలు తీసుకుంది. 230 మంది ఉద్యోగుల సర్వీసును క్రమబద్ధీకరించగా.. మిగతా వారికి నిలిచిపోయింది. వీరిలో కొందరి సర్వీసు వివరాలను ప్రిన్సిపాళ్లు తప్పుగా ఇవ్వడం వల్ల అనర్హులుగా మిగిలిపోయారని ఉపాధి కల్పనశాఖ వర్గాలు గుర్తించాయి. మరికొందరికి కనీస అర్హతలు లేవని గుర్తించాయి. సర్వీసు, అర్హతలు సరిగా ఉన్నవారికి సంబంధించిన క్రమబద్ధీకరణ దస్త్రం ఉపాధి కల్పన శాఖకు చేరింది. దీనిపై నిర్ణయం వెలువడాల్సి ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని