గిరిజన పాఠశాలలు, వసతిగృహాల్లో బయోమెట్రిక్‌ హాజరు

రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ వసతిగృహాలు, ఆశ్రమ పాఠశాలలు, గిరిజన పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులకు బయోమెట్రిక్‌ హాజరు అమలు చేయాలని గిరిజన సంక్షేమశాఖ నిర్ణయించింది.

Published : 09 Jul 2024 03:05 IST

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని గిరిజన సంక్షేమ వసతిగృహాలు, ఆశ్రమ పాఠశాలలు, గిరిజన పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులకు బయోమెట్రిక్‌ హాజరు అమలు చేయాలని గిరిజన సంక్షేమశాఖ నిర్ణయించింది. విద్యాలయాల్లో రోజూ బయోమెట్రిక్‌ విధానం తప్పనిసరి చేయాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశించింది. ఈ హాజరుతో విద్యార్థుల కచ్చితమైన సంఖ్యతోపాటు ప్రవేశాలు, బిల్లుల మంజూరులో అక్రమాలు నిరోధించవచ్చని భావిస్తోంది. విద్యార్థుల హాజరు మేరకు నిధులు ఖర్చు చేయాలని గతంలోనే బయోమెట్రిక్‌ తీసుకువచ్చినా సరైన మౌలిక సదుపాయాలు లేకపోవడంతో అమలు సాధ్యపడలేదు. కొన్నిచోట్ల పరికరాల్లో సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయి. విద్యార్థులు వసతిగృహాల్లో ఉంటున్నారా? వార్డెన్లు, ఉపాధ్యాయులు సకాలంలో తరగతులకు హాజరవుతున్నారా? లేదా? క్షేత్రస్థాయిలో గుర్తించే పరిస్థితి లేకుండా పోయింది. ఈ క్రమంలో లోపాలను సవరించి బయోమెట్రిక్‌ వ్యవస్థను పూర్తిస్థాయిలో తీసుకొచ్చారు. హాజరును రోజూ గమనించేందుకు వీలుగా కమాండ్‌ కంట్రోల్‌ వ్యవస్థ అమల్లోకి రానుంది. దీంతో ఉదయం 10 గంటల వరకు హాజరు వివరాలు సంక్షేమశాఖల ఉన్నతాధికారులకు వాట్సప్, మెయిల్‌ ద్వారా వెళ్తాయి. ఫలానా చోట టీచర్లు ఎందుకు రాలేదు..? విద్యార్థుల హాజరు ఎందుకు తక్కువగా ఉందన్న విషయాలపై సమీక్షలు నిర్వహించి చర్యలు తీసుకునేందుకు వీలు కలుగుతుందని గిరిజన సంక్షేమ వర్గాలు వెల్లడించాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని