భూ సమస్యలు కోకొల్లలు

యాచారం మండలంలోని 10 గ్రామాల్లో ధరణిలో 800 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవే 10 గ్రామాల్లో మా సంస్థ భూ న్యాయ శిబిరాలు నిర్వహించగా 2200 దరఖాస్తులు అందాయి.. ఇవి కాకుండా మరోవెయ్యి మంది దరఖాస్తు చేయనివారుంటారు.

Published : 09 Jul 2024 04:38 IST

పది గ్రామాల్లో లీఫ్స్‌ సంస్థ అధ్యయనం
సంస్కరణలకు మార్గనిర్దేశం చేయనున్న పైలట్‌ ప్రాజెక్టు 

మంతన్‌గౌరెల్లి సభలో భూ సమస్యలు తెలుసుకుంటున్న సునీల్‌కుమార్, కోదండరెడ్డి

యాచారం, న్యూస్‌టుడే: ‘యాచారం మండలంలోని 10 గ్రామాల్లో ధరణిలో 800 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవే 10 గ్రామాల్లో మా సంస్థ భూ న్యాయ శిబిరాలు నిర్వహించగా 2200 దరఖాస్తులు అందాయి.. ఇవి కాకుండా మరోవెయ్యి మంది దరఖాస్తు చేయనివారుంటారు. వీటినిబట్టి గ్రామాల్లో భూ సమస్యలు కోకొల్లలుగా ఉన్నాయని స్పష్టమవుతోంది’ అని లీఫ్స్‌ (లీగల్‌ ఎంపవర్‌మెంట్‌ అండ్‌ అసిస్టెన్స్‌ ఫర్‌ ఫార్మర్స్‌ సొసైటీ) వ్యవస్థాపకులు, ధరణి కమిటీ సభ్యుడు, భూచట్టాల నిపుణుడు సునీల్‌కుమార్‌ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉందని.. 25 లక్షల వరకు భూసమస్యలు ఉండొచ్చని పేర్కొన్నారు. లీఫ్స్‌ సంస్థ రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో 10 గ్రామాలను ఎంపిక చేసుకుని జనవరిలో కీలక అధ్యయనం చేపట్టి.. సోమవారం ముగించింది. జనవరిలో కార్యకలాపాలు ప్రారంభించిన ఈ సంస్థ.. ఎంపిక చేసిన గ్రామాల్లో మొదటిదశలో భూన్యాయ శిబిరాలు నిర్వహించి రైతుల నుంచి 2200 దరఖాస్తులు స్వీకరించింది. రెండోదశలో స్వీకరించిన దరఖాస్తులకు సంబంధించి రైతుల వద్ద ఉన్న ఆధార పత్రాలను రెవెన్యూ రికార్డులను పరిశీలించి వాటిని ఎలా పరిష్కరించాలనే దానిపై నిపుణులు నోట్‌ తయారుచేశారు. ఈ సందర్భంగా మంతన్‌గౌరెల్లి గ్రామంలో సోమవారం నిర్వహించిన సభలో సునీల్‌కుమార్‌తో పాటు ధరణి కమిటీ సభ్యులు కిసాన్‌ కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం.కోదండరెడ్డి పాల్గొన్నారు. భూ సమస్యలపై రైతుల నుంచి సేకరించడానికి తాము రూపొందించిన దరఖాస్తు పత్రం, సమస్యల పరిష్కారానికి తాము అమలు చేసిన విధానం, ప్రభుత్వం చేపట్టబోయే రెవెన్యూ సంస్కరణలు, కొత్త ఆర్‌ఓఆర్‌ చట్టానికి.. యాచారం పైలట్‌ ప్రాజెక్టు దశ.. దిశ చూపిస్తుందని సునీల్‌కుమార్‌ తెలిపారు. తమ అధ్యయనం వివరాలు ప్రభుత్వానికి అందజేసి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. రైతుల సమస్యలను ఎలా పరిష్కరించాలనేది పైలట్‌ ప్రాజెక్టులో గుర్తించామని వివరించారు. 

గత ప్రభుత్వ నిర్వాకంతోనే ఇక్కట్లు: కోదండరెడ్డి

గత ప్రభుత్వ నిర్వాకంతోనే భూసమస్యలు విపరీతంగా పెరిగాయని కోదండరెడ్డి పేర్కొన్నారు. ధరణిని అమలులోకి తెచ్చే ఉద్దేశంతో సమస్యలు సృష్టించి రైతులను ఇబ్బందిపెట్టారని తెలిపారు. సునీల్‌కుమార్‌కు భూ సమస్యల పరిష్కారంపై అపార అనుభవం ఉందని పేర్కొన్నారు. యాచారంలో వీరు అమలు చేసిన పైలట్‌ ప్రాజెక్టు ప్రభుత్వానికి ఉపయోగపడనుందని చెప్పారు. రెవెన్యూ సమస్యలను పరిష్కరించడానికి సీఎం చిత్తశుద్ధితో పని చేస్తున్నారన్నారు. ఇందులోభాగంగా వేసిన కమిటీ కొత్త ఆర్వోఆర్‌ చట్టం తేవాలని ప్రతిపాదించిందని గుర్తు చేశారు. 


హక్కుల మాయంపై అనేక ఫిర్యాదులు 

లీఫ్స్‌ సంస్థకు అందిన వాటిలో భూమి హక్కులు మాయమైన సమస్యలే అధికంగా వచ్చాయి. మంతన్‌గౌరెల్లిలో గ్రామసభలో అనేకమంది రైతులు పలు సమస్యలతో వచ్చారు. ‘‘2005లో రాజశేఖర్‌రెడ్డి చేపట్టిన భూ పంపిణీ కార్యక్రమంలో నాకు ఎసైన్‌మెంట్‌ సర్టిఫికెట్‌ ఇచ్చారు. పాత పాసుపుస్తకం ఉంది. ధరణి వచ్చాక అధికారులు కొత్త పాసుపుస్తకం ఇవ్వలేదు’’ అని మెగావత్‌ చెంపా అన్నారు. ‘‘నాకు 4-37 ఎకరాల పట్టా భూమి ఉంది. కొత్త పాసు పుస్తకాలు ఇచ్చేటప్పుడు 30 గుంటల భూమిని మాయం చేశారు. దాన్ని తిరిగి చేర్చాలని అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు’’ అని సభావట్‌ మంగ్త వాపోయారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని