మన్యంలో కంటెయినర్‌ ఆసుపత్రి

ఏటా వర్షాకాలంలో మన్యం ప్రాంతంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలుతుండడంతో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. రవాణా సౌకర్యం లేక వైద్య సిబ్బంది మారుమూల గ్రామాల్లోని గిరిజనులకు వైద్యం అందించడం కష్టంగా మారుతోంది.

Updated : 09 Jul 2024 07:40 IST

రాష్ట్రంలోనే తొలిసారి ములుగు జిల్లాలో ఏర్పాటుకు కలెక్టర్‌ చొరవ

ములుగు, న్యూస్‌టుడే: ఏటా వర్షాకాలంలో మన్యం ప్రాంతంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలుతుండడంతో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది. రవాణా సౌకర్యం లేక వైద్య సిబ్బంది మారుమూల గ్రామాల్లోని గిరిజనులకు వైద్యం అందించడం కష్టంగా మారుతోంది. ఇలాంటి పరిస్థితులను అధిగమించి గిరివాసులకు వైద్య సేవలందించేందుకు ములుగు జిల్లా కలెక్టర్‌ రాష్ట్రంలోనే తొలిసారి ఓ వినూత్న ప్రయోగం చేశారు. కంటెయినర్‌ రూపంలో అదనపు ఆరోగ్య ఉప కేంద్రాన్ని ఏర్పాటు చేసి సేవలందించాలని నిర్ణయించారు. జాతీయ రహదారికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ములుగు జిల్లా తాడ్వాయి మండలం పోచాపూర్‌ గ్రామానికి చుట్టూ నర్సాపూర్, అల్లిగూడెం, బందాల, బొల్లెపల్లి గ్రామాలుంటాయి. ఇక్కడున్న వారికి వైద్యం చేయాలంటే గోవిందరావుపేట మండలం పస్రా నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్రాంత ప్రజలు ప్రతి సోమవారం పస్రాలో జరిగే సంతకొచ్చినప్పుడు సరకులు తీసుకోవడంతో పాటు పస్రా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, లేదంటే ప్రైవేటు వైద్యులను ఆశ్రయిస్తుంటారు.

అత్యవసరమైనా.. సోమవారం వరకు ఆగాల్సిందే. సమయానికి వైద్యం అందక ప్రాణాలు పోయిన సందర్భాలున్నాయి. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని కలెక్టర్‌ టీఎస్‌ దివాకర ఓ ప్రత్యేక ఆలోచన చేశారు. అత్యవసర సేవల కోసం కంటెయినర్‌లో ఆరోగ్య ఉపకేంద్రం ఏర్పాటుచేసి సుమారు ఆరు నెలలు సేవలందిచాలనుకున్నారు. నాలుగు పడకల కోసం సుమారు రూ.7 లక్షల వ్యయంతో దీన్ని రూపొందించారు. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక వాహనంలో తీసుకొచ్చి పోచాపూర్‌లో ఏర్పాటుచేశారు. ఈ వారంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు