జేఎన్‌టీయూ విదేశీ క్యాంపస్‌లు లేనట్లే!

రాష్ట్రంలోని సాంకేతిక విశ్వవిద్యాలయం జేఎన్‌టీయూ... విదేశాల్లో తన క్యాంపస్‌లను ప్రారంభించేందుకు చేసిన ప్రయత్నాలు దాదాపుగా నిలిచిపోయాయి.

Published : 09 Jul 2024 03:14 IST

ఒప్పందాలపై అక్కడి వర్సిటీల అనాసక్తి 

ఈనాడు, హైదరాబాద్‌ - కూకట్‌పల్లి, న్యూస్‌టుడే:   రాష్ట్రంలోని సాంకేతిక విశ్వవిద్యాలయం జేఎన్‌టీయూ... విదేశాల్లో తన క్యాంపస్‌లను ప్రారంభించేందుకు చేసిన ప్రయత్నాలు దాదాపుగా నిలిచిపోయాయి. ఐఐటీల తరహాలో అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో క్యాంపస్‌లను ఏర్పాటు చేయాలని ఎనిమిది నెలల క్రితం అప్పటి వీసీ కట్టా నరసింహారెడ్డి, రిజిస్ట్రార్‌ మంజూర్‌ హుస్సేన్‌ నిర్ణయించారు. ఆరు నెలల్లోపే ప్రారంభిస్తామని ప్రకటించారు. అక్కడి విద్యా విధానాలకు అనుగుణంగా ఇంజినీరింగ్‌ కోర్సులు రూపొందింపజేసి... విద్యార్థుల ప్రవేశాలు, ఆచార్యుల నియామకాలూ పూర్తి చేస్తామన్నారు. లాస్‌వేగాస్, న్యూయార్క్, న్యూజెర్సీ, డెట్రాయిట్‌ అలబామాల్లోని వర్సిటీలతో డ్యూయల్‌ డిగ్రీ కోర్సు ఒప్పందాలను కుదుర్చుకుంటామని చెప్పారు. తొలి మూడేళ్లు హైదరాబాద్‌లో, చివరి రెండేళ్లు అమెరికాలో చదివేలా వారికి ఏర్పాట్లు చేస్తామని అప్పట్లో పేర్కొన్నారు. ఈ మేరకు గతేడాది నవంబరులో అమెరికాలోని లాస్‌వేగాస్‌కు వెళ్లారు. పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు డాక్టర్‌ హరి ఇప్పనపల్లి  సహా మరికొందరితో చర్చించారు. వీరి ప్రతిపాదనలపై రెండు విదేశీ వర్సిటీలు ఏమాత్రం ఆసక్తి చూపలేదు. ఒక ప్రైవేటు కళాశాల యాజమాన్యం మాత్రం ఒకట్రెండు కోర్సులను విద్యార్థులు అమెరికా, హైదరాబాద్‌లలో చదువుకునేలా రూపొందిస్తామని తెలిపినా... తదుపరి ఎలాంటి సమాచారాన్ని పంపించలేదు. 

సమాచార, సమన్వయలోపాలే కారణమా? 

విదేశాల్లో క్యాంపస్‌ల ఏర్పాటు ప్రతిపాదన నిలిచిపోవడానికి సమాచార, సమన్వయ లోపాలు కారణమని ఇంజినీరింగ్‌ విద్య నిపుణులు చెబుతున్నారు. ఇతర దేశాల్లో మన క్యాంపస్‌లను ఏర్పాటు చేయాలంటే అక్కడి చట్టాలను పాటించాల్సి ఉంటుంది. జేఎన్‌టీయూ అధికారులు ఒక ప్రణాళికను రూపొందించుకుని వెళ్లుంటే ప్రస్తుత విద్యా సంవత్సరంలో కాకపోయినా... భవిష్యత్తులో ఏర్పాటుకు అవకాశం ఉండేదన్నారు. అక్కడి రాష్ట్రాల అనుమతులు, ఇంజినీరింగ్‌ కోర్సుల మూల్యాంకనం వంటివాటిపై విదేశీ వర్సిటీతోపాటు స్థానిక ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాలి. వాస్తవానికి విద్య, ఉపాధి అవకాశాల కోసం వెళ్లి ఉన్నతంగా ఎదిగిన విద్యార్థులు అమెరికా, కెనడాతోపాటు ఐరోపా దేశాల్లో స్థిరపడ్డారు. అమెరికాలోని తెలుగువారు సహజంగానే జేఎన్‌టీయూ క్యాంపస్‌లలో తమ పిల్లలను చేర్పించే అవకాశాలున్నాయి. వీటన్నింటినీ పూర్తిగా పరిశీలించకుండా కొందరు పూర్వవిద్యార్థుల సలహాలతో మాత్రమే అధికారులు వెళ్లడంతో ఆశించిన లక్ష్యాలు నెరవేరలేదు. ఈ అంశంపై రిజిస్ట్రార్‌ డాక్టర్‌ కె.వెంకటేశ్వరరావును వివరణ కోరగా... జేఎన్‌టీయూ విదేశీ క్యాంపస్‌ల ఏర్పాటు వ్యవహారం పరిశీలనలో ఉందని, పూర్తి వివరాలు అందుబాటులో లేవన్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని