పంపుహౌస్‌ల నిర్వహణ ప్రాంతాన్ని ఎందుకు మార్చారు?

పంపుహౌస్‌లు నీటమునగడానికి బ్యారేజీల డిజైన్‌లో లోపం కారణమా? పంపుహౌస్‌ల మెయింటెనెన్స్‌ బే(నిర్వహణ ప్రాంతం)కు సంబంధించి డిజైన్‌లో మార్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది?

Published : 09 Jul 2024 03:16 IST

ఇంజినీర్లను ప్రశ్నించిన జస్టిస్‌ పీసీ ఘోష్‌
బ్యారేజీలపై అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశం 

కమిషన్‌ విచారణకు హాజరైన కాళేశ్వరం సీఈ సుధాకర్‌రెడ్డి, మేడిగడ్డ ఈఈ తిరుపతి, సీఈ వెంకటరమణారెడ్డి తదితరులు

ఈనాడు, హైదరాబాద్‌: పంపుహౌస్‌లు నీటమునగడానికి బ్యారేజీల డిజైన్‌లో లోపం కారణమా? పంపుహౌస్‌ల మెయింటెనెన్స్‌ బే(నిర్వహణ ప్రాంతం)కు సంబంధించి డిజైన్‌లో మార్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది? అని కాళేశ్వరంపై న్యాయవిచారణ జరుపుతున్న జస్టిస్‌ పీసీ ఘోష్‌ ఇంజినీరింగ్‌ అధికారులను ప్రశ్నించినట్లు తెలిసింది. మేడిగడ్డ, అన్నారం పంపుహౌస్‌లు నీటమునగడానికి కారణాలపై ప్రశ్నించడంతో పాటు పంపుహౌస్‌ల నిర్వహణ ప్రాంతాన్ని మొదట ఇచ్చిన డిజైన్‌లో మార్పులు చేసి తగ్గించడం, సుందిళ్ల బ్యారేజీ గరిష్ఠ వరద మట్టం(హెచ్‌ఎఫ్‌ఎల్‌) ప్రకారం అన్నారం పంపుహౌస్‌ నిర్వహణ ప్రాంతం లేకపోవడం, మొదట పంపుహౌస్‌ నిర్వహణ ప్రాంతాన్ని 132 మీటర్లుగా నిర్ణయించి తర్వాత 124 మీటర్లకు తగ్గించడం తదితర అంశాలపై ఇంజినీర్ల నుంచి జస్టిస్‌ పీసీ ఘోష్‌ వివరాలు కోరినట్లు సమాచారం. పంపుహౌస్‌లకు సంబంధించిన డిజైన్లలో కమిషనర్‌ ఆఫ్‌ డిజైన్స్, హైడ్రాలజీ విభాగాలతో సంబంధం లేకుండా జెన్‌కో ఇవ్వడానికి కారణమేంటని కూడా ప్రశ్నించినట్లు తెలిసింది.  వీటన్నిటినీ అఫిడవిట్‌ రూపంలో ఈ నెల 16వ తేదీలోగా దాఖలు చేయాలని ఆదేశించారు. కాళేశ్వరం ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ హరిరాం, చీఫ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌(ఈఎన్సీ జనరల్‌) పి.పద్మావతి, కాళేశ్వరం చీఫ్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ అప్పారావు, మాజీ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ నల్లా వెంకటేశ్వర్లు, చీఫ్‌ ఇంజినీర్లు సుధాకర్‌రెడ్డి, వెంకటరమణారెడ్డి, ఎస్‌ఈ కరుణాకర్, సత్యరాజ్‌ చంద్ర, ఈఈలు సీహెచ్‌.తిరుపతి, యాదగిరి, ఎస్‌.సత్యనారాయణ, సర్దార్‌ ఓంకార్‌ సింగ్, మల్లికార్జున ప్రసాద్, బి.విష్ణుప్రసాద్, నూనె శ్రీధర్‌ సహా మొత్తం 15 మందితో పాటు నిర్మాణ సంస్థలకు చెందిన ఇద్దరు ప్రతినిధులు సోమవారం కమిషన్‌ ఎదుట హాజరయ్యారు. బ్యారేజీలపై విచారణలో భాగంగా పంపుహౌస్‌ల డిజైన్లు, నిర్వహణ తీరుపై విచారణ జరుపుతున్నామని, అదనపు సమాచారం కోసమే ఈ ప్రక్రియ చేపట్టినట్లు కమిషన్‌ పేర్కొన్నట్లు తెలిసింది. విచారణకు సంబంధించిన సమాచారం ఏదైనా ఉంటే అందజేయాలని సూచించినట్లు సమాచారం. కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలకు సంబంధించి అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కమిషన్‌ ఆదేశించినట్లు సమాచారం. ప్రాజెక్టు పూర్తిస్థాయి సమాచారం, దస్త్రాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని జస్టిస్‌ పీసీ ఘోష్‌ శనివారం ఆదేశించిన విషయం తెలిసిందే. 

 తన కార్యాలయం వద్ద జస్టిస్‌ పీసీ ఘోష్‌ 

కమిషన్‌కు కాగ్, నిపుణుల కమిటీ నివేదికలు

ప్రాజెక్టుపై కాగ్‌ విడుదల చేసిన నివేదికను ఆ సంస్థ అధికారికంగా కమిషన్‌కు అందించింది. నిపుణుల కమిటీ కూడా తన నివేదిక అందజేసింది. అఫిడవిట్ల పరిశీలన పూర్తయిన వెంటనే పలువురికి నోటీసులు ఇవ్వనున్నారు. కాగ్‌ రాష్ట్ర విభాగం అధికారులను కూడా విచారణకు పిలవాలని కమిషన్‌ నిర్ణయించినట్లు తెలిసింది. జాతీయ ఆనకట్టల భద్రత పర్యవేక్షణ కమిటీ(ఎన్డీఎస్‌ఏ), విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాలను తుది నివేదికలు ఇవ్వాలని కమిషన్‌ మరోమారు ఆదేశించింది. ఇటీవల విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగానికి కమిషన్‌ లేఖ రాయగా.. డైరెక్టర్‌ జనరల్‌ మార్పు కారణంగా తుది నివేదిక ఇవ్వలేకపోయినట్లు ఆ విభాగం సమాధానం పంపినట్లు తెలిసింది. 

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు, పంపుహౌస్‌లలో పనిచేస్తున్న డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌(డీఈఈ)లు మంగళవారం, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌(ఏఈఈ)లు బుధవారం విచారణకు హాజరు కావాలని కమిషన్‌ ఆదేశించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని